– విపక్షంలోకి వచ్చినా మారని చంద్రబాబు అలవాటు
– సమయపాలన పాలించని చంద్రబాబు
– లేటుగా సాగుతున్న టీడీపీ అధినేత పర్యటనలు
– అర్ధరాత్రి వేళ బహిరంగసభలతో నేతల అవస్థలు
– అంతసేపు వేచిచూడలేక వెనుదిరిగుతున్న జనం
– దానితో నేతల కష్టం వృధా
– పార్టీ ఆఫీసులోనూ అదే పద్ధతి
– గంటలసేపు వెయిట్ చేయించే పద్ధతితో నేతల్లో విసుగు
– బాబుతో భేటీలంటే ప్రముఖులకు వెయింటింగ్ భయం
– గంటల ప్రసంగంతో క్యాడర్, జనంలో విసుగు
– అన్ని అంశాలూ ఒకేసారి చెప్పాలన్న బాబు తపన
– దానితో ప్రసంగం సగంలోనే వెళ్లిపోతున్న జనం
– వైసీపీకి ఆయుధమవుతున్న ఆ దృశ్యాలు
– తాజాగా గుడివాడ పర్యటనలోనూ అదే తీరు
– ఖాళీ కుర్చీలతో బాబు మాట్లాడుతున్నారంటూ కొడాలి నాని వ్యంగ్యాస్త్రాలు
– కేసీఆర్, జగన్, రేవంత్‌రెడ్డి, పవన్, లోకేష్ ప్రసంగాలు అరగంటకే పూర్తి
– చంద్రబాబుకు చెప్పే ధైర్యం లేని నేతలు
– చంద్రబాబు ఇక మారరా అంటున్న సీనియర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
కొత్తగా సెల్ఫీ టెక్నాలజీ అందిపుచ్చుకున్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. సమయపాలన-గంటలపాటు ప్రసంగించే విషయంలో మాత్రం అప్డేట్ కాకపోవడంపై, టీడీపీ శ్రేణులో విసుగు-అసంతృప్తి వ్యక్తమవుతోంది. చంద్రబాబు పర్యటనలన్నీ గంటలపాటు ఆలస్యంగా సాగుతుండటంతో.. వచ్చిన జనాలను అప్పటివరకూ ఉంచలేక, అగ్రనేతల అవస్థలు వర్ణనాతీతం. అధినేత సభ పూర్తయ్యేలోగా సగం కుర్చీలు ఖాళీగా ఉండటం, దానిని వైసీపీ ఆయుధంగా సంధింస్తుంటే, తెలుగుతమ్ముళ్లు తలపట్టుకుంటున్న పరిస్థితి. పడిన కష్టమంతా వృధా అయిపోతోందని తమ్ముళ్లు మొత్తుకుంటున్నా, ఆ విషయాన్ని అగ్రనేతలు అధినేతకు చెప్పలేని నిస్సహాయ పరిస్థితి.
ఇటీవలి చంద్రబాబునాయుడు పర్యటనలకు.. జనం పోటెత్తుతున్నప్పటికీ, బహిరంగసభలు మాత్రం సగంలోనే జనాలు వెళ్లిపోతున్న వైనం, తెలుగుతమ్ముళ్లను ఆందోళనకు గురిచేస్తోంది. చంద్రబాబు
గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించే రోడ్‌షోలకు విపరీతమైన జనాలు హాజరవుతున్నారు. రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. బస్సు నుంచి ఆయన ప్రసంగిస్తున్న ప్రాంతాలు పసుపుమయం అవుతున్నాయి. దానితో ఋ ప్రతి రోడ్‌షోలలో చంద్రబాబులో సమరోత్సాహం తొంగిచూస్తుంది.
అదే ఉత్సాహంతో బహిరంగసభలకు హాజరవుతున్న చంద్రబాబు ప్రసంగాన్ని .. పూర్తిగా వినకుండానే జనం సగంలో వెళ్లిపోతున్న వైనమే, తమ్ముళ్లకు రుచించడం లేదు. దానికి కారణం.. చంద్రబాబు రోడ్‌షోలలో సమయాన్ని ఎక్కువగా కేటాయించడం, ఎక్కువసేపు ప్రసంగించడమే కారణమంటున్నారు.
రోడ్‌షోలు, అక్కడి ప్రసంగాలు ముగిసే సరికే రాత్రి అవుతోందని, అప్పుడు బహిరంగసభలు నిర్వహిస్తే.. సభ ముగిసే అర్ధరాత్రి వరకూ జనం ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. అందువల్ల రోడ్‌షోలలో మాట్లాడటం మానేసి, ఆ సమయాన్ని బహిరంగసభలకు కేటాయిస్తే సరిపోతుందని చెబుతున్నారు.
పోనీ బహిరంగసభలో మట్లాడటం తగ్గిస్తే సరిపోతుందని.. కానీ వీటికి భిన్నంగా అటు రోడ్‌షో-ఇటు బహిరంగసభల్లో మాట్లాడటం వల్ల. అర్ధరాత్రి దాటి, జనం సగంలోనే వెళ్లేందుకు కారణమవుతోందని ఓ మాజీ మంత్రి విశ్లేషించారు.
పైగా చంద్రబాబు అంత రాత్రి సమయాల్లోనూ గ ంటలపాటు మాట్లాడితే, వినే ఓపిక ఎవరికి ఉంటుందని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. దానితో చంద్రబాబు ప్రసంగం మధ్యలోనే జనం వెళ్లిపోతున్న పరిస్థితి
ఏర్పడిందని చెబుతున్నారు. బాబు సభలు, రోడ్‌షోలపై ప్రత్యేక దృష్టి సారించిన వైసీపీ మీడియా-నిఘా బృందాలకు.. ఆ ఖాళీ కుర్చీల దృశ్యాలు హాట్‌కేక్‌లా మారి, సోషల్‌మీడియాలో వైరల్ అయేందుకు కారణమవుతున్నాయని విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలు- ప్రజా సమస్యలు- అవినీతి అంశాలు- జగన్ విధానాలను ఒకేసారి చెప్పాలనుకునే చంద్రబాబు తపనలో తప్పు లేదు. కానీ ప్రజలు అంతసేపు వినే పరిస్థితిలో లేరన్న వాస్తవాన్ని, గ్రహించాల్సిన అవసరం ఉందని తమ్ముళ్లు స్పష్టం చేస్తున్నారు. దానితో విసుగుపుట్టిన జనం, బాబు ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోతున్నారని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
దీనివల.. జన సమీకరణకు తాము పడిన కష్టమంతా వృధా అయిపోవడంతోపాటు.. ఖాళీగా ఉన్న కుర్చీలను చూపించటం ద్వారా, బాబు ప్రతిష్ఠ కూడా మసకబారేందుకు కారణమవుతోందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చినా ఇంకా అప్డేట్ కాకపోవడం, లోపాలు సవరించుకునేందుకు ప్రయత్నించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా గుడివాడలో చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షో సూపర్‌హిట్టయింది. రోడ్లు కిక్కిరిసిపోయాయి. జనం నీరాజనం పట్టారు. బాబు పర్యటన చాలా ఏళ్ల తర్వాత, గుడివాడలో కొడాలి నానితో యుద్ధం చేస్తున్న టీడీపీకి జోష్ ఇచ్చింది. అయితే బహిరంగసభ మాత్రం.. ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం తమ్ముళ్లను నిరాశపరిచింది. ఆలస్యంగా ప్రారంభమైన సభను త్వరగా ముగిస్తే, సభ సక్సెస్ అయ్యేదని, అందుకు భిన్నంగా అర్దరాత్రి వరకూ నిర్వహించడం వల్ల, సగం మందికి పైగా వెళ్లిపోయేందుకు కారణమయిందని గుడివాడ తమ్ముళ్లు విశ్లేషిస్తున్నారు.
‘‘ బాబు సాయంత్రం మూడున్నరకు రావలసి ఉంది. కానీ ఆరున్నరకు గుడివాడ రూరల్‌కు వచ్చారు. అక్కడి నుంచి గుడివాడ టౌన్లో నిర్వహించిన రోడ్‌షోలకు జనం బాగా వచ్చారు. బాబు కాన్వాయ్ ఊరి చివర ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలోని బహిరంగసభకు చేరేసరికి రాత్రి పదిన్నరయింది. అప్పటికి అక్కడ పదివేల మంది వరకూ ఉన్నారు. నాయకుల ప్రసంగాలు పూర్తయి, చంద్రబాబు మాట్లాడేసరికి పదకొండున్నరయింది. అక్కడి నుంచి బాబు పన్నెండున్నర వరకూ ప్రసంగించారు. ఈలోగా వచ్చిన జనం సగానికి పైగా వెళ్లిపోవడం ప్రారంభించారు. దానిని వైసీపీ మీడియా వీడియో తీసి వైరల్ చేసింది. సభ మొత్తం పూర్తయ్యేసరికి ఒంటిగంట పైనే అయింది’’ అని గుడివాడ టీడీపీ నేత ఒకరు వివరించారు. సమయపాలన లేకపోవడం వల్లే ఇదంతా జరిగిందని తెలుగుతమ్ముళ్లు స్పష్టం చేస్తున్నారు.
నిజానికి సభ గుడివాడలోని నెహ్రు చౌక్‌లో పెడితే సరిపోయేది. కానీ కొడాలి నాని ఒత్తిళ్ల వలన పోలీసులు అనుమతించకపోవడంతో, ఊరి చివర ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టాల్సి వచ్చిందని వివరించారు. సభ నిర్వహించిన ఇంజనీరింగ్ కాలేజీ ఊరికి దూరంగా ఉండటం కూడా, దీనికి మరో కారణమని విశ్లేషించారు.
అసలు చంద్రబాబునాయుడు షెడ్యూల్ ప్రకారం వచ్చి ఉంటే, ఈ సమస్యలు తలెత్తేవి కావని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పర్యటనలన్నీ ఇదే విధంగా సాగుతుండటంతో, జనసమీకరణ చేసిన నాయకులకు.. బాబు టూర్ పూర్తయ్యేవరకూ జనాలను ఆపడం కష్టమవుతోందని జిల్లా నేతలు సైతం వాపోతున్నారు.
అటు పార్టీ కార్యాలయం, నివాసంలోనూ బాబు సమయపాలన వ్యవహారం, ఇలాగే కొనసాగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా బాబు అపాయింట్మెంట్ శైలి మారకపోవడం, సీనియర్లకు విసుగు తెప్పిస్తోంది. దానితో బాబు ఆఫీసుకు వచ్చినప్పుడు, కార్యకర్తలంతా తోసుకుని వెళ్లడంతో ఆయనను కలిసేందుకు వచ్చిన ప్రముఖులు విసుగెత్తి, వెళ్లిపోతున్న పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
‘అధికారంలో ఉన్నప్పుడూ ఇలాగే వెయిట్ చేయించి, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా వెయిట్ చేయించడం అవమానం. అంటే తమ కోసం ఎప్పుడయినా వెయిట్ చేయాలన్న పాలిసీని పాటిస్తున్నారన్న తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంద’ని ఓ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ విధానం మంచిదికాదని, దీనివల్ల పార్టీ- బాబును వ్యక్తిగతంగా అభిమానించేవారు దూరమయ్యే ప్రమాదం ఉందంటున్నారు. చివరు నాయకత్వం-శ్రేణుల మధ్య, ఆత్మీయ వాతావరణం దెబ్బతింటుందని స్పష్టం చేశారు.
ప్రధానంగా దీనితో పార్టీ ఆఫీసుకు, వివిధ జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెప్పిన సమయానికి ఆఫీసుకు రాకపోవడంతో ఆయన కోసం కార్యకర్తలు, సీనియర్లు గంటలసేపు వేచి చూడాల్సిన దుస్థితిపై, పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా దూరం నుంచి వచ్చే కార్యకర్తల అవస్థలు వర్ణనాతీతం.
చివరకు బాబును కలవాలనుకునే ప్రముఖులు సైతం, ఆయనతో భేటీకి భయపడుతున్న పరిస్థితి. గంటలపాటు వెయిట్ చేయించే, అవమానకర పరిస్థితే దానికి కారణమంటున్నారు. ఆయన వద్ద పనిచేసే సిబ్బందికి సైతం.. ఎవరి ప్రాధాన్యం ఏమిటో తెలియకపోవడం వల్లే, ఈ సమస్య వస్తోందని సీనియర్లు చెబుతున్నారు.
టెలీకాన్ఫరెన్సులు, సమీక్షా సమేశాలు, బహిరంగసభల్లో చెప్పిందే చెప్పడం, సుదీర్ఘంగా మాట్లాడటంపై అసహనం వ్యక్తమవుతోంది. అయితే, దీనివల్ల పార్టీ శ్రేణులు, ప్రముఖులు పడుతున్న ఇబ్బందులను.. పొలిట్‌బ్యూరో స్థాయి నేతలు కూడా, బాబు దృష్టికి తీసుకువెళ్లేందుకు భయపడుతుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ పీసీసీ అధినేత రేవంత్‌రెడ్డి, జనసేన అధిపతి పవన్, టీడీపీ యువనేత లోకేష్ వంటి ప్రముఖులంతా అరగంటకు మించి ప్రసంగించరని గుర్తు చేస్తున్నారు. ‘‘సూటిగా, పేలిపోయే డైలాగులతో సాగే వారి ప్రసంగం అప్పుడే అయిపోయిందా’’ అనిపిస్తుంటుందని విశ్లేషిస్తున్నారు.
అయితే చంద్రబాబు ప్రసంగం మాత్రం గంటలపాటు సాగుతుండటం వల్ల.. ప్రజలు ఆయన ప్రసంగాన్ని వినేందుకు, అంత ఆసక్తిచూపించడం లేదంటున్నారు. ప్రసంగం విషయంలో చంద్రబాబు స్వయం నియంత్రణతోపాటు, సమయపాలన పాటించ కపోతే.. జనసమీకరణలో తాము పడిన కష్టం వృధా అవుతుందని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా చంద్రబాబు సభలకు జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారన్న ప్రచారం వల్ల, ఆయన ఇమేజ్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు.
ఆయన ఇమేజ్ దెబ్బతింటే, బాబు ఇమేజ్‌పైనే ఆధారపడే పార్టీ.. దానితోపాటు తామూ దెబ్బతింటామన్నది సీనియర్ల విశ్లేషణ. మరి బాబు మారతారా? షార్ట్ అండ్ స్వీట్లా ప్రసంగిస్తారా అన్నది ప్రశ్న.