– కుట్ర కోణం లేదని రామోజీ, టీడీపీ, మొత్తంగా ఎల్లో మీడియా ఎలా చెబుతున్నారు?
– డీఎల్ డైలాగ్‌ల స్క్రిప్ట్ వారిదే.
– హత్యాయత్నం సఫలమై ఉంటే పరిస్థితి ఏమిటి?
– హత్యాయత్నం చేసిన వ్యక్తి నేర చరిత్రను ఎందుకు దాచారు?
– అతడికి ఉద్యోగం ఇచ్చింది టీడీపీ వారే కదా?
– విమానాశ్రయంలోకి కత్తి ఎలా వచ్చింది?
– బాబుపై నక్సల్స్ దాడి కూడా మ్యాచ్ ఫిక్సింగేనా? డ్రామాయేనా?
– మరి 2004 ఎన్నికల్లో బాబు ఎందుకు ఓడిపోయాడు?
: మాజీ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని)
పచ్చ పత్రికల బరితెగింపు:
రోజు రోజుకీ చంద్రబాబే బరి తెగిస్తున్నాడనుకుంటే పచ్చ పత్రికలు మరింతగా బరి తెగిస్తున్నాయి. చంద్రబాబు కంటే నాలుగు ఆకులు ఎక్కువ తిన్నామన్నట్లు మరింతగా దిగజారి పోతున్నాయి. విలువలు, విశ్వసనీయతకు ఏ మాత్రం ఆస్కారం లేకుండా, నలుగురు నవ్విపోయినా పర్లేదు తాము అనుకున్నదే వార్తగా రాయడమే పనిగా పెట్టుకున్నారు. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతి అదే పనిగా బరి తెగించి జగన్‌గారిపై విషం చిమ్ముతూ దురుద్దేశపూరితంగా, కక్షపూరితంగా రాతలు రాస్తున్నాయి. జగన్ గారిని ఏదో రకంగా అపఖ్యాతి పాలు చేయాలనే దుర్భుద్ధితో వార్తలు అచ్చు వేస్తున్నారు. ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్ వేశారని తాటికాయంత అక్షరాలతో రాస్తూ చంద్రబాబుకు ఎక్కడా మచ్చ రాకుండా చూస్తున్నారు. దోషమంతా జగన్‌గారికి అంటించి విషం చిమ్మే ప్రయత్నాన్ని నిస్సిగ్గుగా చేస్తున్నారు.
ఘటన జరగ్గానే ప్రకటనలు:
2018 అక్టోబర్‌లో జగన్‌పై ఎంతో సెక్యూరిటీ ఉండే విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగింది. ఘటన జరిగిన గంటకే దాని వెనక కుట్ర లేదని డీజీపీ ప్రకటన. ఆ తర్వాత కాసేపటికే దాడి చేసింది వైయస్సార్సీపీ సానుభూతిపరుడని అప్పటి సీఎం చంద్రబాబు చెప్పడం అంతా నాటకీయ ఫక్కీలో కొనసాగింది. అదీ చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల పని తీరు. నిజానికి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్న విపక్షనేతపై ఏకంగా ఎయిర్‌పోర్టులనే హత్యాయత్నం జరిగితే, అన్ని కోణాల్లో ప్రాథమిక దర్యాప్తు చేసి, మాట్లాడాల్సిన డీజీపీ, అదేమీ లేకుండానే ప్రకటన చేయడం ఆశ్చర్యకరం. ఆ వెంటనే నిస్సిగ్గుగా అప్పటి సీఎం మాట్లాడడం మరీ దారుణం.
కానీ.. అది కుట్ర కాదట!:
విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్ పై హత్యాయత్నం జరిగిందని, అక్కడి క్యాంటీన్ యజమాని టీడీపీ సానుభూతిపరుడని, దాడి చేసిన నిందితుడు అక్కడే పని చేసే వాడని ఆ పార్టీ నాయకులే ఒప్పుకున్నారు. ఆ తర్వాత కేసు దర్యాప్తు చేసిన ఎన్ఐఏ కూడా జగన్‌పై హత్యాయత్నం జరిగిందనే తేల్చింది. అయితే విచిత్రంగా హత్యాయత్నం జరిగింది కానీ దాని వెనుక కుట్ర లేదని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఎలా మేనేజ్ చేయబడుతున్నాయో చూస్తే అర్ధమవుతోంది.
అది కుట్ర. ఇది ‘కోడి కత్తి’ నా?:
నాడు ఎన్టీఆర్‌పై దాడి జరిగితే అది కుట్ర. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్ పై హత్యాయత్నం జరిగితే, దాన్ని కోడి కత్తి అని రాస్తారా? కోడి కత్తి కేసు అనే మాటలు సరైనవేనా రామోజీ? అదేనా మీ భాష? విపక్షనేతపై ఏకంగా ఎయిర్‌పోర్టులోనే హత్యాయత్నం జరిగితే, అందులో కుట్ర లేదని ఎలా రాస్తారు? ఇవేనా పత్రికా విలువలు? నాడు ఎన్టీఆర్‌పై మల్లెల బాబ్జీ చేసిన దాడిలో నిందితుడు నిమ్మకాయలు కోసే కత్తి వాడారు. మరి ఆనాడు దాన్ని నిమ్మకాయల కత్తి అని రాయకుండా.. ఎన్టీఆర్‌పై హత్యాయత్నం అని ఎలా రాశారు?. అంటే మనోడిపై దాడి జరిగితే హత్యాయత్నం. జగన్‌గారిపై హత్యాయత్నం జరిగితే కోడి కత్తి కేసా? మీకిదేం పోయే కాలం?
జైళ్లో ఉన్న వ్యక్తి ఇంటర్వ్యూ ఇచ్చాడా?:
ఆనాటి ఘటనపై అక్టోబరు 26న ఈనాడులో ప్రచురితమైన ‘జగన్‌కు సానుభూతి రావాలనే దాడి చేశా’.. అని నిందితుడు చెప్పినట్లుగా పెట్టిన హెడ్డింగ్నే.. ఇప్పుడు కాపీ పేస్టు చేశారు. హత్యాయత్నం కేసులో నిందితుడు జైల్లో ఉన్నాడు. మరి అతడు చెప్పినట్లు వార్త ఎలా రాశారు? నిందితుడు ఏమైనా రామోజీరావుకు ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చాడా? దాన్నే పత్రికలో రాశారా? మరీ ఇంత దౌర్భాగ్యమా? ఇందుకేనా పేపర్ నడుపుతున్నారు?. మీరు రాసిన దాన్నే టీడీపీ ఆఫీస్‌లో కొందరు మొగుతున్నారు.
ఆనాడు వైయస్సార్ ఏమన్నారు?:
చంద్రబాబూ, మీపై అలిపిరి వద్ద దాడి జరిగిన వెంటనే అప్పటి విపక్ష నేత వైయస్సార్ ఎలా స్పందించారో మీకు గుర్తుందా? ఆ ఘటన అమానవీయం అని ఆయన అన్నారు. అదీ ఆయన సంస్కారం. రాజశేఖరరెడ్డి కుటుంబం ఎప్పుడూ అలా విలువలకు కట్టుబడి ఉంది. ఆనాడు మీమీద దాడి జరిగిందని తెలియగానే హుటాహుటిన తిరుపతి వచ్చిన ఆయన, మిమ్మల్ని పరామర్శించారు. దాడి ఘటనను ఖండించారు. సిద్ధాంతాలతో విభేదిస్తే ప్రజాస్వామ్య బద్దంగా పోరాటాలు చేయాలి తప్ప, ఇలా హత్యాయత్నం చేయడం సరికాదని మావోయిస్టుల చర్యను ఖండించారు. అదీ ఆయన వ్యక్తిత్వం. నైతిక విలువలతో కూడిన ప్రవర్తన. వ్యవహారశైలి. కానీ, జగన్‌పై హత్యాయత్నం తర్వాత మీరేం మాట్లాడారు? ఘటన గురించి తెలిసినా, రెండు గంటల తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చి మీరేమన్నారు. వైయస్సార్సీపీ వాళ్లే ఆ దాడి చేశారు. అది వాళ్లంత వాళ్లు చేసుకున్నదంటూ దిగజారి మాట్లాడారు. అదీ నీ నీచ సంస్కృతి.
దర్యాప్తు కోరడం తప్పా?:
ఎయిర్‌పోర్టులో తనపై దాడి చేసిన కుర్రాడు తనకు తెలియదన్న జగన్, హైసెక్యూరిటీ ఉండే అక్కడికి తను కత్తితో ఎలా వచ్చాడని ప్రశ్నించారు. నిందితుడు క్యాంటీన్లో పని చేస్తున్నాడని, అది టీడీపీ సానుభూతిపరుడైన వ్యక్తి కావడం వల్ల, ఆయన పాత్ర ఏమైనా ఉందని అడిగారు. అందుకే దాడిపై సమగ్ర దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేశారు. మరి అందులో తప్పేముంది?. ఆయనకు ఆ హక్కు లేదా?
దాడి జరిగిన గంటలోపే నిందితుడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడని డీజీపీ చెబితే.. అతడికి నేరచరిత్ర లేదని రామోజీ తన పత్రికలో మర్నాడే రాసుకొచ్చారు. నిజాయితీగా ఒక వార్త రాద్దామన్న బుద్ధి ఆయనకు లేకుండా పోయింది.
ఇవన్నీ అనుమానాలు:
హత్యాయత్నం నిజమే. కానీ దాని వెనుక ఎవరూ లేరట. తనపై హత్యాయత్నం వెనక ఎవరున్నారని జగన్ అడగడం తప్పని పచ్చ పత్రికలు, టీడీపీ అంటోంది. గుండు సూది కూడా రానివ్వని ఎయిర్‌పోర్టులోకి హత్యాయత్నం చేసే కత్తులు ఎలా వచ్చాయి? వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైతే టీడీపీ వ్యక్తి అతణ్ని ఎలా ఉద్యోగంలో పెట్టుకున్నాడు? మరి ఇవన్నీ అనుమానాలే కదా?
బాబుకు అన్ని చోట్లా స్లీపర్‌సెల్స్:
ఇవన్నీ చూస్తుంటే ఒకటే అర్ధమవుతుంది. తీవ్రవాదులకు ఎలాగైతే స్లీపర్ సెల్స్ ఉంటారో చంద్రబాబుకు కూడా అన్ని చోట్లా స్లీపర్ సెల్స్ ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. సీబీఐ, ఎన్ఐఏ అధికారులను ప్రభావితం చేసేలా ఎక్కడికక్కడ ఆ స్లీపర్ సెల్స్ పని చేస్తున్నట్లు అర్థమవుతోంది.
డీఎల్ కూడా బాబు స్లీపర్‌సెల్:
దిక్కుమాలిన రామోజీకి వయసు రాగానే సరి పోదు. డీఎల్ రవీంద్రారెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడితే దాన్ని కూడా సిగ్గు లేకుండా అచ్చేశాడు. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణలే ఈ స్లీపర్ సెల్స్‌తో మాట్లాడిస్తారు. మళ్లీ దాన్ని పచ్చ పత్రిల్లో నిస్సిగ్గుగా అచ్చేస్తారు. మనిషి జన్మ ఎత్తగానే సరా? వైయస్సార్ వద్ద ఆషాడభూతిలా డీఎల్ రవీంద్రారెడ్డి బతికాడు. అది మేం కళ్లారా చూశాం. వైయస్సార్ మరణించగానే విజయమ్మని కించపరుస్తూ మాట్లాడిన డీఎల్, ఆ తర్వాత జగన్‌పైనే పోటీ చేశారు. అలాంటి నీచమైన వ్యక్తులతో తమకు కావాల్సిన విషం చిమ్మించి, దాన్ని యథాతథంగా పచ్చ పత్రికల్లో అచ్చేయిస్తున్నారు.
ప్రభావితం. అందుకే బలహీనం:
ఎలాంటి ప్రభావితం లేకపోతే ఎన్ఐఏ ఛార్జ్‌షీట్ ఎందుకంత బలహీనంగా ఉంది? దాన్ని చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. ఎలాంటి ప్రభావితానికి గురి కాకపోతే ఆ రకంగా ఎలా ఉంటుంది? అందుకే ఆ దర్యాప్తు విధానాన్ని ఖండిస్తున్నాం. ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగిందని ఒప్పుకుంటూనే.. ఆకతాయి తనంగా, సరదాగా హత్యాయత్నం జరిగిందని కేసును క్లోజ్ చేయాలని ప్రయత్నం చేశారు. ఈ దుష్టచతుష్టయం దుర్మార్గాలను ప్రజలు ఖండించాలని కోరుతున్నాం. గరుడ పురాణం పేరుతో చంద్రబాబు సొంత మనిషి సినీనటుడు శివాజీతో ఆనాడు స్టేట్మెంట్ ఇప్పించారు. అది జరిగిన వెంటనే హర్షవర్ధన్ అనే ఒక టీడీపీ చోటా నాయకుడు హోటళ్లో ఉన్న వ్యక్తి జగన్ గారిపై హత్యాయత్నం చేశాడు.
జైళ్లో అతణ్ని ఏం చేస్తారో?:
టీడీపీ సానుభూతిపరులు కావాలని గొడవలు పెట్టుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి జగన్‌పై హత్యాయత్నం కేసు నిందితుడితో ఏదో చర్చించి వస్తున్నారు. ఈమధ్య ఒక మహిళా వకీలు టీడీపీ సానుభూతిపరురాలు కూడా పిటిషన్ పెట్టి అతనితో చర్చించి వస్తోంది. అందుకే మాకు చంద్రబాబుపై అనుమానంగా ఉంది. లోపల అతణ్ని ఏం చేస్తారో?
చంద్రబాబుకు కుక్క బాష తెలుసేమో?:
కుక్కలు అసహ్యించుకోవడం ఎలా తెలిసింది? చంద్రబాబుకు కుక్క బాష వచ్చా? కొన్ని పచ్చ కుక్కలు అమాయకమైన, నిజమైన కుక్కలను వాళ్ల రాజకీయాలకు వాడుకుంటున్నారు. చివరికి ఈ పచ్చ కుక్కలు వాళ్ల రాజకీయాల కోసం దిగజారి ప్రయత్నిస్తున్నారో అర్ధం అవుతుంది. చంద్రబాబుకు కుక్క బాష వచ్చి జగన్ పరిపాలన నచ్చలేదని బాబుకు చెప్పి ఉంటుంది.
మళ్లీ అధికారం ఇస్తారు:
చంద్రబాబు నైజం ఎంత సేపు ఏమార్చడం, లొంగ దీసుకోవడం, ఎర వేయడం, ఆశ చూపడం. తద్వారా ఓట్లు, పదవి పొందడం. కానీ జగన్‌గారు ప్రజలను నమ్మారు. 2012 నుంచి 2019 వరకు అవిశ్రాంతంగా ప్రజల మధ్యే ఉన్నారు. అందుకే వారు నమ్మారు. అవకాశం ఇచ్చారు. పచ్చ పత్రికలు ఎంత దుష్ప్రచారం చేసినా నమ్మడం లేదు. మళ్లీ తిరిగి గెలిపిస్తారని శ్రీ పేర్ని నాని స్పష్టం చేశారు.