– ఇంకా పూర్తి కాని సినిమా షూటింగులు
– కొత్తగా చేతిలో మరో మూడు సినిమాలు
– వారాహి వాహనం రోడ్డెక్కేదెప్పుడు?
– ఏప్రిల్ వచ్చినా ప్రారంభం కాని యాత్ర
– జనవరి నుంచి సా…గుతున్న ‘జాగు’యాత్ర
– అప్పుడప్పుడు ప్రకటనలు, పర్యటనలు
– ప్రత్యక్ష కార్యాచరణ, పార్టీ నిర్మాణం, అభ్యర్ధుల ఎంపికపై కనిపించని కసరత్తు
– ఎమ్మెల్యే స్ధాయి అభ్యర్ధులను గుర్తించని జనసేనాధిపతి
– పోలింగ్‌బూత్ వ్యవస్థనయినా ఏర్పాటుచేసుకోకపోతే ఎలా?
– పోటీ చేసే బలమైన అభ్యర్ధులు ఏరీ?
– ఇలాగైతే జగన్‌ను ఓడించడం అసాధ్యమంటున్న క్యాడర్
– ఈ ఏడాదయినా పవన్ ఫుల్‌టైమ్ పాలిటిక్స్ చేయాలని స్పష్టీకరణ
-ఏం చేయాలన్నా ఏడాది సమయమేనంటున్న జనసైనికులు
– ఫుల్‌టైమ్ పాలిటిక్స్ చేస్తేనే ఫలితాలని స్పష్టీకరణ
( మార్తి సుబ్రహ్మణ్యం)
జనసేనాధిపతి పవన్ కల్యాణ్ కనీసం ఎన్నికల ఏడాదిలోన యినా ఫుల్‌టైమ్ పాలిటిక్స్ చేస్తారా? లేక అప్పుడు కూడా పార్ట్‌టైమ్ పొలిటీషియన్‌గా కొనసాగుతారా? ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికీ గెలుపు గుర్రాల ఎంపిక చేయకపోతే ఎలా? అసలు ఎన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉన్నామో అంచనా లేకపోతే ఎలా? పార్టీకి ఆశ-శ్వాస అయిన పవన్ వారాహి వాహనం రోడ్డెక్కేదెప్పుడు? ఏకబిగిన పార్టీ కార్యక్రమాలు చేపట్టకపోతే జనంలో ఉండేదెలా? చివరకు ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచి, పోలింగ్ బూత్‌లలో కూర్చునే పోలింగ్‌బూత్ ఏజెంట్ల వ్యవస్థయినా ఏర్పాటుచేసుకోకుంటే ఎలా? ఇలాగైతే బలమైన జగన్‌ను ఓడించడం అసాధ్యం కదా?… ఇదీ జనసైనికుల మనోగతం.
ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో, అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ అస్త్ర శస్ర్తాలు సమకూర్చుకునే పనిలో ఉన్నాయి. ఎవరి వ్యూహాలకు తగ్గట్లు వారు నిరంతరం జనంలో ఉండేలా చూసుకుంటున్నారు. ఏమీ లేని బీజేపీ సైతం.. నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం ద్వారా, హడావిడి చేస్తోంది. ఇతర పార్టీలోని ప్రముఖులను బీజేపీలోకి తీసుకువచ్చే పనిలో పడింది. చివరాఖరకు కనుమరుగైన కాంగ్రెస్ కూడా, ఎస్సీ-ఎస్టీ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు రూపొందించే పనిలో ఉంది.
కానీ, కులబలం-యూత్ ఫాలోయింగ్-సినీ గ్లామర్ దండిగా ఉన్న జనసేన అధిపతి పవన్ కల్యాణ్ మాత్రం, ఇంకా తన పార్టీని ఎన్నికల రణరంగానికి సిద్ధం చేయకపోవడం, జనసైనికులను నిరాశ పరుస్తోంది. జనసేన అంటే పవన్.. పవనంటే జనసేన. కాబట్టి.. ఆయన వస్తేనే కార్యక్రమాలు జరుగుతాయి, ఆయన వస్తేనే ఊపు వస్తుంది. వెళ్లిన తర్వాత మళ్లీ శూన్యం-స్తబ్దత. కనీసం ఎన్నికల ఏడాదిలోనయినా.. తమ అధినేత ఫుల్‌టైమ్ పాలిటిక్స్ చేస్తే, పార్టీకి మనుగడ ఉంటుందన్నది జనసైనికుల వాదన.
నిజానికి ఈ జనవరి నుంచి పవన్ పూర్తి స్థాయి రాజకీయనేతగా అవతరిస్తారని, అందులో భాగంగా జనంలోకి వెళ్లేందుకే, వారాహి వాహనం తయారుచేయించుకున్నారన్న ప్రచారం జరిగింది. దానితో నారసింహయాత్ర ప్రారంభమవుతుందని కొందరు- వారాహి యాత్ర అని ఇంకొందరు ప్రచారం చేశారు. అంతా అనుకున్నట్లుగానే వారాహి వాహనం బయటకు రావడం, రిజిస్ట్రేషన్ పనులు పూర్తి కావడం, ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేయడం చకచకా జరిగిపోయింది. అయితే.. అసలు పవన్ కల్యాణ్ దానితో ఎప్పుడు రోడ్డెక్కుతారో తెలియక, జనసైనికులు ఆసక్తిగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు.
ఇప్పటివరకూ పవన్ కల్యాణ్ పార్ట్‌టైం పొలిటీషియన్‌గా ఉన్నప్పటికీ.. వైసీపీ-టీడీపీ-బీజేపీ-కాంగ్రెస్ చేయని సేవా కార్యక్రమాలు పవన్ నిర్వహించారు. రైతులను ఆదుకుంటున్నారు. ఏదైనా సంఘటన జరిగితే పవన్ స్పందించి, వారిని పార్టీ తరఫున ఆదుకుంటున్నారు. దానివల్ల పవన్ పార్ట్‌టైమర్ అయినప్పటికీ, ఆయన వల్ల ప్రజలలకు మేలు కలుగుతోంది కదా అన్న వ్యాఖ్యలు వినిపించేవి. పవన్ కష్టార్జితంతో సంపాదించిన సంపదను.. సమాజానికి వినియోగిస్తున్నారే తప్ప, ఎవరినీ దోచి, అవినీతి చేసి సంపాదించలేదు కదా అన్న సానుభూతి-మెచ్చుకోలు సమాజంలో లేకపోలేదు.
అయితే అది రాజకీయకోణంలో చూస్తే, పనికిరాదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో .. జనసైనికులను సన్నద్ధం చేసే ప్రణాళిక రూపొందించకుండా, ఎన్నికలకు వెళ్లడం పార్టీకి నష్టమని జనసైనికులు విశ్లేషిస్తున్నారు. ఏయే నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది? ఎమ్మెల్యే స్థాయి ఉన్న నాయకులెవరు?
వారి ఆర్ధిక పరిస్థితి ఏమిటి? వంటి కీలక అంశాలపై దృష్టి సారించకుండా, గ్రామ-మండల-నియోజకవర్గ-జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటుచేయకుండా, ఎన్నికల్లో ఏవిధ ంగా అద్భుతాలు సృష్టిస్తామో అర్ధం కావడం లేదని జనసైనికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పోలింగ్‌బూత్ ఏజెంట్లను నియమించుకునే పరిస్థితికి ఎదిగినప్పుడే, పార్టీ జనంలోకి వెళ్లినట్లు లెక్క అని స్పష్టం చేస్తున్నారు.
నాగబాబును ప్రధాన కార్యదర్శిగా నియమించినప్పటికీ, ఆయన వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని, ప్రజారాజ్యం నాటి అనుభవాలను గుర్తు చేస్తున్నారు. నాగబాబు చేసే వ్యాఖ్యలవల్ల, పార్టీ అనేకసార్లు ఇబ్బందిపడిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు. ఆయనకున్న రాజకీయానుభవం తక్కువేనంటున్నారు. పోనీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాతయినా.. ఆయన పూర్తిస్థాయి రాజకీయాలకు సమయం కేటాయించి ఉంటే, జనసేన ఈపాటికి కొద్దిగానయినా నిలదొక్కుకుని ఉండేదని జనసైనికులు విశ్లేషిస్తున్నారు.
నిరంతరం జనంలో ఉండే పార్టీలకే, మనుగడ భయం కనిపిస్తుంటే.. అప్పుడప్పుడు వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తే, పార్టీ ఇక జనంలోకి ఎలావెళుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా అన్ని రంగాల్లో బలంగా ఉండటంతోపాటు, చేతిలో ప్రభుత్వ వ్యవస్థలున్న జగన్‌ను ఎదుర్కొని, వైసీపీని ఓడించాలంటే.. ఈ తరహా వ్యవస్థ-విధానాలు సరిపోవని స్పష్టం చేస్తున్నారు.
జగన్‌ను ఓడించి తీరతానని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న పవన్ మాటలు కార్యరూపం దాల్చాలంటే.. ఆయన మరో ఏడాదివరకూ, నిరంతరం జనంలోనే ఉండాలని జనసైనికులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆయనకు చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయని, అవి పూర్తి కావాలంటే ఎన్ని నెలల సమయం పడుతుందో తెలియదంటున్నారు. కనీసం ఒక్కో సినిమా షూటింగ్ నాలుగునెలలు వేసుకున్నా, ఎన్నికల నాటికి ఎన్ని సినిమాలు పూర్తవుతాయో అంచనా వేసుకోవాలని విశ్లేషిస్తున్నారు.
ఏడాది పాటు ఎలాంటి షూటింగులు పెట్టుకోకుండా, కేవలం పార్టీపైనే దృష్టి సారిస్తే.. పవన్ తాను అనుకున్న లక్ష్యాలు సాధించడం, పెద్ద కష్టం కాదని జనసైనికులు స్పష్టం చేస్తున్నారు. ముందు నియోజకవర్గాల వారీగా పార్టీ బలాన్ని, అభ్యర్ధులను గుర్తించడమే పెద్ద సవాల్ అంటున్నారు.
జనం కేవలం పవన్‌ను చూసి మాత్రమే ఓట్లు వేయరని, అభ్యర్ధులను కూడా చూస్తారని గుర్తుచేస్తున్నారు. నిజానికి ఇప్పటివరకూ కనీసం పది-పదిహేను నియోజకవర్గాల్లో కూడా, ప్రత్యర్ధులకు గట్టి పోటీ ఇచ్చే నేతలెవరూ లేరని, జనసైనికులు గుర్తు చేస్తున్నారు. పవన్ మొదట దానిపై దృష్టి సారించాలన్నది జనసైనికుల సూచన.