– చిన ఎరుకపాడు వ్యవసాయ భూమిలో రూ. 5 కోట్ల లాభానికి రియల్టర్ పథకం
– ఎకరం ప్రభుత్వ మార్కెట్ విలువ రూ.11.50లక్షలు
నాలా పన్ను 2లక్షల 87వేల 500లను రెవెన్యూశాఖకు చెల్లించాల
100 ఫ్లాట్ల వరకు ఉన్న నాన్ లేఅవుట్ ప్లాన్ ను కాగితాలపై సిద్ధం?
– నాన్ లేఅవుట్ రియల్ ఎస్టేట్ వెంచర్
– ఐదెకరాల భూమి అమ్మితే రైతుకొచ్చేది రూ.2.90 కోట్లే
– అగ్రిమెంట్ చేసుకున్న రియల్టర్ కు మాత్రం రెట్టింపు లాభం
– రైల్వేగేట్లపై ఇంకా ఫ్లైఓవర్లు నిర్మించకుండానే వాడేసుకుంటున్నారు
– నేషనల్ హైవే, రైల్వేస్టేషన్ నూ వదలడం లేదు
– గ్రావెల్ మాత్రమే తోలి నూరుశాతం వాస్తు అంటూ ప్రచారం
– రూ.లక్షలు పెట్టి ఫ్లాట్లు కొని ఆ 100 మంది పరిస్థితేంటి?
– వసతులేమీ కల్పించకుండానే నాలుగు రెట్లకు అంటగడుతున్నారు
– నాన్ లేఅవుట్ల ఇంటి ప్లాన్, బ్యాంక్ రుణాలెలా వస్తాయి?
– ప్లాట్లు కొన్న తర్వాత కూడా 14 శాతం పన్ను కట్టాల్సిందేనా?
– గుడివాడ ప్రాంతంలో కొనసాగుతోన్న రియల్టర్ల బాగోతం
గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం చినఎరుకపాడు గ్రామంలో ఉన్న ఐదెకరాల వ్యవసాయభూమిలో రూ. 5కోట్ల లాభానికి అనధికారిక లేఅవుట్లు వేసే రియల్టర్ ఒక పథకాన్నయితే ప్రారంభించేశాడు. దీనికొక ‘నగర్’ పేరు కూడా పెట్టేశాడు. ఈ ‘నగర్’ ను నిర్మించే కనస్ట్రక్షన్ కంపెనీని కూడా ప్రకటించేశాడు. ఇంతకీ ఈ ‘నగర్’ నిర్మాణం జరుగుతున్న ఐదెకరాల వ్యవసాయ భూమిని రైతు దగ్గర నుండి కొనేందుకు ఇప్పటివరకైతే అగ్రిమెంట్ మాత్రమే జరిగినట్టుంది. రిజిస్ట్రేషన్ జరగని ఈ భూమిని ఇంకా వ్యవసాయేతర భూమిగా మార్చుకోలేదు.
ఇక్కడ ఎకరం ప్రభుత్వ మార్కెట్ విలువ రూ.11.50లక్షలుగా ఉంది. ఐదెకరాల్లో ‘నగర్’ ను నిర్మించే రైతు దగ్గర నుండి ఎకరా రూ. 58లక్షలు చొప్పున కొనుగోలు చేసేందుకు రియల్టర్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మాత్రం రైతుకు రూ.2.90కోట్లు రియల్టర్ చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ వ్యవసాయభూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు ఐదెకరాల భూమి ప్రభుత్వ మార్కెట్ విలువ మొత్తం రూ.57, 50లక్షలపై నాలా పన్నును 5శాతం అంటే రూ.2లక్షల 87వేల 500లను రెవెన్యూశాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే లేఅవుట్ ప్యాట్రన్ ను ప్రారంభించుకోవచ్చు.
ఇదంతా ఫాలో అవ్వడం కష్టమనుకున్నారో ఏమోగాని రెవెన్యూశాఖకు నాలా పన్నులను చెల్లించకుండా, లేఅవుట్ పర్మిషన్ కోసం సీఆర్డీఏకు దరఖాస్తు చేసుకునే పనే లేకుండా ఏకంగా నాన్ లేఅవుట్ రియల్ ఎస్టేట్ వెంచర్ కు తెర తీశారు. రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్న రియల్టర్ కు మాత్రం భూమి అమ్మిన రైతు కన్నా రెట్టింపు లాభాన్ని కొల్లగొట్టేందుకు కొత్త ‘నగర్’ నిర్మాణం పేరుతో చకచకా ఏర్పాట్లు చేసుకుపోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ ‘నగర్’ ను ఎక్కడ నిర్మిస్తున్నారో చెబితే ఒకింత ఆశ్చర్యం కలుగకమానదు. గత కొన్ని దశాబ్దాలుగా గుడివాడ నియోజకవర్గంలో ఎన్నికల హామీగా ఉండి ఇటీవల దాదాపు రూ.300కోట్లకు పైగా వ్యయంతో భీమవరం, మచిలీపట్నం రైల్వేట్రాక్ లపై ఫ్లైఓవర్లు నిర్మించేది ఈ ‘నగర్’ కు సమీపంలోనే అంటూ వాడేసుకుంటున్నారు. ఇక ఇదే ‘నగర్’ కు 90 అడుగుల రోడ్డు ఫేసింగ్, కత్తిపూడి టూ గుడివాడ బైపాస్ కు 200 మీటర్ల దూరం, ఒక కిలోమీటరు దూరంలో నూజెళ్ళ రైల్వేస్టేషన్ ఉన్నాయంటూ వీటిని కూడా వదిలిపెట్టడం లేదు.
ఇంతకీ వ్యవసాయేతర భూమిగా మారని ఈ వ్యవసాయ భూమిలో , ఇప్పటి వరకు గ్రావెల్ ను మాత్రమే తోలడం జరిగింది. కనీసం సర్వే రాళ్ళను కూడా పాతకుండా 100శాతం వాస్తు అంటూ ప్రచారం చేసుకుపోతున్నారు. ఇంకా రోడ్లు, డ్రైన్లు, మంచినీరు వంటి మౌలిక వసతులన్నీ కాగితాల మీదైనా కన్పిస్తాయో లేదో తెలియని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న అనధికారిక రియల్ వెంచర్లో ఫ్లాట్ల అమ్మకాలకు తెగబడుతున్నారు.
మొత్తం 100 ఫ్లాట్ల వరకు ఉన్న నాన్ లేఅవుట్ ప్లాన్ ను కాగితాలపై సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అగ్రిమెంట్ చేసుకున్న ఐదెకరాల్లో రోడ్లు, డ్రైన్లు తదితరాలకు ఒక ఎకరాన్ని వదిలిపెట్టినా మిగతా నాలుగెకరాలను గజం రూ.4,500లు చొప్పున అమ్మేందుకు ధరను నిర్ణయిస్తూ ఈ ‘నగర్’ దగ్గర ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. దీన్నిబట్టి దాదాపు రూ.8 కోట్లకు పైగా మొత్తానికి ఫ్లాట్లను అమ్మి ఐదెకరాల వ్యవసాయ భూమి ఇచ్చిన రైతుకు రూ.2.90కోట్లు చెల్లించే, అద్భుత పథకానికి శ్రీకారం చుట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఇక్కడ రూ. లక్షలు పెట్టి నాన్ లేఅవుట్ లో ఫ్లాట్లు కొనే ఆ 100 మందికి ఇంటి ప్లాన్, బ్యాంక్ రుణాలు వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ రావాలంటే మాత్రం ఫ్లాట్లు కొన్నవారు భూమి మార్కెట్ విలువలో 14శాతం మొత్తాన్ని పన్నులుగా చెల్లించాలి. ఇక్కడ భూమి ప్రభుత్వ మార్కెట్ విలువ గజానికి రూ.1300లుగా ఉంది. దీన్నిబట్టి ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు అదనంగా మరో రూ.35లక్షల వరకు అదనంగా పన్నులు చెల్లించాల్సిన పరిస్థితులున్నాయి.
గుడివాడ ప్రాంతంలో ఎన్నో ఏళ్ళుగా అనేక మంది రియల్టర్లు ఇదే విధంగా అనధికారిక లే అవుట్లతో రూ. కోట్లు కొల్లగొడుతూ వస్తున్నారు. ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారంతా మోసపోతూ ఇళ్ళు నిర్మించుకోలేక , చివరికి ఖాళీ స్థలాలుగానే వదిలి పెట్టేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి నాన్ లేఅవుట్లు వేస్తున్న రియల్టర్ల బాగోతంపై దృష్టి పెట్టాలని, కనీసం నాలా పన్నులైనా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.