Suryaa.co.in

Andhra Pradesh

అమూల్ సంస్థకు సేల్ పాయింట్లకు స్థలములు కేటాయించటం నిలిపివేయాలి

– ఎన్.టి.ఆర్.జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావుకు వినతిపత్రం సమర్పించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి

కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) ప్రయోజనాలకు భంగం కలిగించేలా, అమూల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో పాలు సేకరించటకు, అనేక సేల్ పాయింట్ల కొరకు ఎన్.టి.ఆర్. జిల్లాలో కీలకమైన ప్రదేశాలలో ప్రభుత్వం/ మున్సిపల్ స్థలములను ఇవ్వటం ఎంతమాత్రం సమంజసం కాదని దీనిని ఆపుచేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్, మాజీ వ్యవసాయ మంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు నేతృత్వంలో సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ మేధావుల సంఘం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు కోగంటి కోటయ్య తదితర ప్రతినిధుల బృందం పూర్తి వివరాలతో ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావుకు ఈరోజు ఉదయం విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

అనంతరం ఇదే విషయమై వడ్డే శోభనాద్రీశ్వరావు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ 1,50,000 పాడిరైతుల సంస్థ అయిన కృష్ణా మిల్క్ యూనియన్ ను నిర్వీర్యం చేయటానికే అమూల్ సంస్థను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, విజయవాడ నగరంలో దాదాపు 100 కీలక ప్రదేశాలలో అమూల్ సేల్ పాయింట్లకు స్థలములను ఇచ్చు ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు. ఎన్.టి.ఆర్. జిల్లాలో రైతుల వద్ద అమ్మవలసి ఉన్న సార్వా ధాన్యాన్ని మరియు రానున్న రబీ ధాన్యంను కొనుగోలు చేయుటకు వెంటనే ఏర్పాట్లు చేయాలని, మార్కెటింగ్ శాఖతో మాట్లాడి రైతుల గోడౌన్లలో నిలువ చేసిన ధాన్యంపై 70 శాతం సొమ్మును అడ్వాన్సుగా పొందగల రైతుబంధు స్కీమ్ ను ఎట్టి జాప్యం లేకుండా అమలు చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ సహకార రంగంలో కృష్ణా మిల్క్ యూనియన్ 1100 కోట్లు టర్నోవర్ తో తమ లాభాలనుంచి బోనస్ తో పాటు వైద్య సేవలు, తక్కువ ధరలకే దాణా, మేలుజాతి పశువుల వీర్యాన్ని తక్కువ ధరకే రైతులకు ఇస్తుందని రైతులకు, పశువులకు భీమా, పిల్లల చదువులకు, పిల్లల పెళ్లిళ్లకు ఆర్ధిక సహాయం అందిస్తుందని, అమూల్ లీటరుకు గరిష్టంగా రు.74/-లు ఇస్తుందని, కృష్ణా మిల్క్ యూనియన్ లీటరుకు బోనస్ తో కలిపి రు.89/-లు చెల్లిస్తోందని రైతుల ప్రయోజనాల దృష్ట్యా అమూల్ సంస్థకు పాలుపోస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అంధిస్తున్న సహకారము/ ప్రోత్సాహమును కృష్ణా మిల్క్ యూనియన్ కు అందించేలా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE