రిజర్వేషన్ తీసేసి జగన్ రెడ్డి దగా చేశాడు

-అన్యాయానికి గురైన బీసీలకు ప్రశ్నించే హక్కులేదా?
-మనమెంత.. మనకెంత అనే రీతిలో మన హక్కులకై ఫైట్ చేయాలి
-అడుక్కోవడం కాదు.. డిమాండ్ చేసి మన హక్కులు సాధించుకోవాలి
-కాకినాడ జోన్ 2 బీసీ నేతల సమావేశంలో వక్తలు

బలహీన వర్గాలుగా పిలవబడుతూ వెనకే ఉండిపోయిన బీసీలు ఇకనైనా గొంతెత్తి అన్యాయాన్ని ప్రశ్నించాలి. అప్పుడే మనహక్కుల్ని మనం కాపాడుకోగలం. హక్కుగా రావాల్సిన నిధులు, ఉద్యోగాల్లో వాటా సాధించుకోగలం. దూరమైన విద్యా పథకాలను పొందగలమని తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్స్ రాష్ట్ర అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు కాకినాడలో జోన్ 2 బీసీ కులాల ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు రద్దు చేసి రాజకీయ అవకాశాలు దూరం చేశాడు. స్కిల్ డెవలప్మెంట్, స్టడీ సర్కిల్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య వంటి విద్యా పథకాలు రద్దు చేసి బీసీలకు చదువులు దూరం చేశారు. చివరికి విలీనం పేరుతో వేలాది పాఠశాలల మూసివేతతో అధికంగా నష్టపోయింది మన బీసీ బిడ్డలే అన్నారు. బీసీల నిధులు లాక్కుని, సంక్షేమాన్ని దూరం చేసి, స్వయం ఉపాధిని దెబ్బతీశాడు. ఆర్ధికంగా ఎదగనీయకుండా చేశాడన్నారు. కులాలుగా విడిపోయిన వారంతా.. కళ్లు తెరిచి బీసీలుగా ఏకమైతే జగన్ రెడ్డికి శంకరగిరి మాన్యాలేదిక్కు.

అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నారన్న కక్షతో అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. పెళ్లికి హాజరయ్యారన్న నెపంతో యనమల రామకృష్ణుడిపై అట్రాసిటీ కేసు పెట్టారు. 68 సంవత్సరాల అయ్యన్నపై రేప్ కేసు పెట్టారు. నడిరోడ్డుపై పీకలు కోసి చంపుతున్న వారిపై కేసులు లేవు కానీ.. ప్రశ్నించే వారిపై లేనిపోని కేసులు పెడుతున్నారన్నారు. బీసీ కులాల నుండి వచ్చే ప్రతి విజ్ఞప్తినీ పరిశీలించి, మేనిఫెస్టోలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర తెలిపారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వరకు బీసీలకు రాజకీయంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యం రాలేదు. దశాబ్దాలుగా ఓటర్లుగానే మిగిలిపోయాం. బానిసలుగా బతికాం. 1982లో టీడీపీ వచ్చాకే బీసీలకు రాజకీయం దగ్గరైంది. స్వాతంత్ర్యం వచ్చినా, దేశంలో రాష్ట్రంలో వందలాది కులాలు ఏ జాబితాలో చేరుతారో కూడా తెలియని పరిస్థితిలో ఉండేది. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించి, ఏ జాబితాలో లేని కులాలను ఎంబీసీలుగా గుర్తింపునిచ్చాం.

కార్పొరేషన్ ఏర్పాటు చేసి వందల కోట్ల బడ్జెట్ కేటాయించాం. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి ప్రతి కార్పొరేషన్లో కూడా రూ.200-300 కోట్ల నిధులున్నాయి. వాటిని బీసీల కోసం ఖర్చు చేయకుండా, వెనక్కి లాక్కున్నాడు. బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొంత మందికి పదవులిచ్చి ఉద్దరించానంటున్నాడు. ఏం ఉద్దరించాడు.? నాలుగేళ్ల పాలనలో బీసీలకు ఏం ఒరిగింది. పిల్లలు ఆవుకథ చెప్పినట్లు.. ఎటు తిరిగి ఏమడిగినా నవరత్నాలు అంటున్నాడు. అన్ని కులాలకు అందించే పథకాలేనా బీసీ సంక్షేమం.? అలాంటప్పుడు బీసీ కార్పొరేషన్లు ఎందుకు? బీసీల హక్కులపై మాట్లాడలేని మంత్రులు ఎవరికోసం? పైసాకు ప్రయోజనం లేని మంత్రులు ఎవరిని ఉద్దరించడానికి ఉన్నట్లో వారే సమాధానం చెప్పాలి.

చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా, పీపీపీ విధానంతో ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. అప్పట్లో విజన్ 2020 అంటే ఎవరూ నమ్మలేదు. పైనా నవ్వారు. నాటి విజన్ రిజల్ట్ హైదరాబాద్ రూపంలో చూస్తున్నాం. అదే స్ఫూర్తితో ఇప్పుడు చంద్రబాబు గారు తన పుట్టిన రోజు నాడు సంకల్పం తీసుకున్నారు. ప్రభుత్వం, ప్రైవేటు, పబ్లిక్ పార్టనర్ షిప్ (పిపిపిపి)తో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ ఆర్ధికంగా సుస్థిరపరిచేందుకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశారు. రాష్ట్రంలో పేదరికం అనేది లేకుండా చేయడమే లక్ష్యంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టేందుకు విజన్ రూపొందించారన్నారు.

ఏది ఏమైనా 2024లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఈ రోజు బీసీ కులాల నుండి తెలుసుకున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. ఏయే కులాల్లో ఎవరు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకోండి. ఒక్క ఇళ్లున్నా వెళ్లండి. సమస్య తెలుసుకోండి. అధికారంలోకి వచ్చాక పరిష్కరించే బాధ్యత తీసుకుంటా. 1995నుండి స్థానక సంస్థల ఎన్నికల్లో బీసీలు అనుభవిస్తున్న 34 శాతం రిజర్వేషన్లు ఎందుకు తగ్గాయి? దేహి అనే పరిస్థితి ఇకపై ఉండబోదు. నేను చేయకుంటే నన్ను ప్రశ్నించండి. నేను మన నాయకుడిని అడిగి సాధిస్తానని హామీ ఇస్తున్నానని తెలిపారు.

పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. జనాభాలో సగం ఉన్నప్పటికీ… సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాం. కారణం మనలో రాజకీయ చైతన్యం లేకపోవడం. చదువు లేకపోవడమే. భవిష్యత్ తరాలను చదివించుకుందాం. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు అనడం కాదు.. బీసీలే తెలుగుదేశం పార్టీ గుండె. పేదలకు న్యాయం చేసిందే తెలుగుదేశం పార్టీ. ఆర్ధిక వ్యవస్థలోనూ బీసీలు భాగస్వాములు కావాలి. అప్పుడే బీసీల్లో సుస్థిరత వస్తుందని పేర్కొన్నారు.

పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. 26 సంవత్సరాల వయసులో నన్ను ఎమ్మెల్యేని చేశారు. బీసీ నినాదంతో ఎన్నికల్లో అభ్యర్ధుల్ని నిలబెట్టారు. బీసీలకు స్థాయి, గౌరవం ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తి హక్కు, విద్యా హక్కు, కూడు, గూడు, గుడ్డ నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ కు రాజకీయాలు తెలియకపోవడమే. తెలుగుదేశం పార్టీ ఆదరణ పరికరాలిచ్చి బీసీలకు అండగా నిలిస్తే.. జగన్ రెడ్డి హత్యలు చేస్తూ ఆనందిస్తున్నాడు. బీసీలు మాట్లాడితే కేసు, ప్రశ్నిస్తే కేసు, నిలదీస్తే కే సు అనేలా తయారయ్యారు.

రాష్ట్ర బీసీ మంత్రి ఎవరో ప్రజలకు తెలియదు. బీసీ మంత్రికి రాష్ట్రంలో ఎన్ని బీసీ కులాలున్నాయో తెలియదు. ఒక ఎంపీ ప్యాంట్ విప్పుతాడు. మంత్రి చొక్కా విప్పుతాడు. విశాఖలో ఒక మంత్రి అరగంట చాలు అంటాడు. ఒక మంత్రి ఇంకేమీ చేయదా అంటాడు. మంత్రులంతా దోపిడీ ఎలా చేయాలో ఆలోచించుకుంటున్నారు. మహిళా మంత్రి అసలు ఏ శాఖో ఆమెకే తెలియక రీల్స్ చేసుకుంటోందని ఎద్దేవా చేశారు.

మంచి జరగాలని మనం తిరుపతికో, అన్నవరానికో వెళ్తాం. కానీ.. ఈ ముఖ్యమంత్రి కుటుంబం చంచల్ గూడ జైలుకు వెళ్తోంది. వైజాగ్ ను రాజధాని అని చెప్పిన జగన్ రెడ్డి.. కాలేజీలు, రైతు బజార్, కలెక్టర్ కార్యాలయం సహా అన్ని ప్రభుత్వ బిల్డింగులు తాకట్టు పెట్టేశాడు. చివరికి మద్యాన్ని తాకట్టు పెట్టి రూ.40వేల కోట్లు అప్పులు తెచ్చిన దుర్మార్గపు ముఖ్యమంత్రిని ఇక్కడే చూస్తున్నాం. అందుకే కలిసి ముందుకు వళ్దాం. బీసీల సత్తా చాటుదాం. అండగా నిలిచే చంద్రబాబుని, ఆదరించే తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. ఉద్యోగం చేస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది. కానీ, రాజకీయంలో రాణిస్తే.. మన చుట్టూ ఉన్న వ్యవస్థ బాగుపడుతుందని పేర్కొన్నారు.

మాజీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) మాట్లాడుతూ.. ప్రశ్నించేవారిపై, గొంతెత్తే వారిపై కేసులు పెడుతున్న జగన్ రెడ్డికి బీసీల సత్తా ఏంటో చాటి చెప్పాలి. బలహీన వర్గాల ఆవేదనలను ఉద్యమస్థాయిలో తీసుకెళ్లినపుడు మాత్రమే హక్కుల్ని సాధించుకోగలం అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానంతరం ఏ ప్రభుత్వంలోనూ జరగనంత ద్రోహం జగన్ రెడ్డి హయాంలో బీసీలకు జరిగింది. పదవుల పేరుతో దగా చేస్తున్నారు. అసైన్డ్ భూములు లాక్కున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి కళ్లు బైర్లు కమ్మేలా బీసీలు తీర్పు ఇవ్వబోతున్నారన్నారు. చట్ట సభల మెట్లు ఎక్కని బీసీ కులాలన్నింటినీ చట్ట సభల్లో అవకాశం కల్పించినపుడే బీసీలకు అసలైన సాధికారిత లభించినట్లు. కుల సమస్యలపై చర్చించాలి.

కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. సబ్సిడీ పరికరాలు దూరం చేశారు. విద్యా పథకాలు నిలిచిపోయాయి. ఎందుకు మనం ప్రశ్నించడం లేదు? పార్టీలు మాట్లాడితే రాజకీయం అంటారు. కుల సంఘాలు ప్రశ్నించాలి. బ్రిటీష్ పాలకుల మాదిరిగా.. జగన్ రెడ్డి వ్యవహరిస్తూ బీసీలను అణగదొక్కుతున్నాడు. శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. జనాభాలో సగం ఉన్న బీసీలు ఎందుకు వెనుకబడిపోయారో ఆలోచించుకోవాలి.కులం యాదృచ్ఛికం. దాన్ని ప్రభుత్వాలే పారద్రోలేలా చర్యలు తీసుకోవాలి. బీసీలకు న్యాయం జరిగింది ఎన్టీఆర్., చంద్రబాబు, తెలుగుదేశం హయాంలోనే. ఒక్క ఛాన్స్ అన్న జగన్ రెడ్డి 17వేల పదవులు దూరం చేశాడు. బీసీలకు జగన్ రెడ్డి చేసిన దగాపై రచ్చబండలో చర్చిద్దాం. ఉద్యమించి హక్కుల్ని సాధించుకుందాం అన్నారు.

అనంతరం 10 తీర్మానాలను తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి ప్రవేశపెట్టారు.
1. సమగ్ర జనగణన జరగాలి. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. జనాభా దమాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలి. చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి.
2. గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన బీసీ సబ్ ప్లాన్ నిధులను తిరిగి ఇవ్వాలి.
3. బీసీ కార్పొరేషన్లకు జనాభా దమాషా ప్రకారం నిధులు కేటాయించి, స్వయం ఉపాధి కల్పించాలి.
4. స్థానిక సంస్థల్లో కుదించిన రిజర్వేషన్లను పునరుద్ధరించి 34% రిజర్వేషన్ కల్పించాలి.
5. ఆదరణ సహా రద్దు చేసిన 30 బీసీ పథకాలను పునరుద్ధరించాలి.
6. విదేశీ విద్య, స్కిల్ డెవలప్మెంట్, స్టడీ సర్కిల్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి విద్యా పథకాలను పునరుద్ధరించాలి.
7. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా బీసీలపై దాడుల నియంత్రణకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి.
8. చట్టసభల్లో ఇప్పటివరకు ప్రాధాన్యం లభించని బీసీ కులాలన్నింటికీ రాజకీయ ప్రధాన్యం కల్పించాలి.
9. కులవృత్తులపై ఆధారపడిన వారికి ఆదరణ లాంటి పథకాలతో యాంత్రిక పరికరాలను సబ్సిడీతో అందించాలి. వారి ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పాటు అందించాలి.
10. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు తొలిప్రాధాన్యం ఇవ్వాలి.

కార్యక్రమంలో సీనియర్ నాయకులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చిన్నరాజప్ప, మాజీ మంత్రులు కిమిడి కళా వెంకట్రావు, కేఎస్ జవహర్, పత్తిపాటి పుల్లారావు, శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, పిల్లి అనంతలక్ష్మి, జోతుల నెహ్రూ, మాజీ శాసన మండలి సభ్యులు చిక్కాల రామచంద్ర రావు , కాకినాడ పార్లమెంటు అధ్యక్షులు జోతుల నవీన్, బీసీ సాధికార సమితి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గంజాం రాఘవేంద్ర, ఏలూరు పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ చక్రవర్తి, నరసాపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు కర్నేను గౌరు నాయుడు, అమలాపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు వాడ్రేవు వీరబాబు, రాజమండ్రి పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు పితాని శివరామకృష్ణ, కాకినాడ పార్లమెంట్ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్, బీసీ సాధికార సమితి జోన్ 1 కో ఆర్డినేటర్ పూతి కోటేశ్వరరావు, శెట్టిబలిజ సాధికార సమితి కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు, గౌడ సాధికార కన్వీనర్ అశోక్ గౌడ్, పెరికి సాధికారి సమితి కన్వీనర్ వనపర్తి బద్రి, భట్రాజ సాధికార సమితి కన్వీనర్ ప్రసన్నాంజనేయ రాజు, శ్రీశయన సాధికార సమితి కన్వీనర్ పట్నాల వెంకటేశ్ బాబు, మేదర సాధికార సమితి కన్వీనర్ దూళిపాళ్ల ఏసుబాబు, ఎంబీసీ సాధికార సమితి కన్వీనర్ పెండ్ర రమేష్, నూర్ బాష సాధికార సమితి కన్వీనర్ సుబాన్ ఇతర బీసీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply