చరిత్రలో నిలిచిపోయేలా టిడిపి మహానాడు నిర్వహణ

– వేమగిరిలోనే వేదిక
– 15 లక్షల మంది రానున్నారు
– రాష్ట్ర టిడిపి నేతలు వెల్లడి

చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మహానాడు సభ వేదికైన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. ఆ ప్రాంతంలోనే మహానాడు నిర్వహించడానికి నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకునే వేళ మహానాడు వేడుకలు జరుగుతున్నాయన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ మహానాడు నిర్వహించడానికి వచ్చే నెల 27,28, 29 తేదీలు ఖరారు చేసామన్నారు. మాజీ మంత్రులు కిమిడి కళా వెంకటరావు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్న రాజప్ప, పత్తిపాటి పుల్లారావు, జవహర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు నిర్వహించే ఈ మహానాడు తెలుగుదేశం క్యాడర్‌లో మరింత ఉత్సాహం నింపడమే కాకుండా అధికార పార్టీ అరాచకాలు బహిర్గతం చేయబడతాయన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేసి అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ఆర్పి పాలన ఎండగట్టబడుతుందని వివరించారు. ఈ ముఖ్యమంత్రిని ఎప్పుడు అధికారం నుంచి సాగనంపుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం రూరల్, నగర ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవానీలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే ఈ ప్రాంతంలో మహానాడు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం అని చాటి చెప్పడానికి ఈ మహానాడు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గన్ని కృష్ణ, వెలుగుబంటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, అన్నందేవుల చంటి, గంగుమళ్ల సత్యనారాయణ, ఆకుల రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Leave a Reply