Home » నెల్లూరు జిల్లాలో భూకుంభకోణాలపై టీడీపీ నేతల వినూత్న నిరసన

నెల్లూరు జిల్లాలో భూకుంభకోణాలపై టీడీపీ నేతల వినూత్న నిరసన

– కలెక్టరేట్ కు ఫ్లెక్సీలు కట్టి కుంభకోణాలను సాక్ష్యాలతో సహా వివరించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
– చర్యలు తీసుకోవాలని ఇన్ చార్జి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు చేస్తున్న భూ కుంభకోణాలను ఆధారాలతో సహా వివరిస్తూ ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర తదితరులు వినూత్న నిరసన నిర్వహించారు. కలెక్టరేట్ చుట్టూ ఫ్లెక్సీలు కట్టి, అందులో కబ్జా అయిన భూముల వివరాలను మ్యాపులతో సహా వివరించారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి ఏమన్నారంటే.. అధికారంలో ఉన్నా, లేకున్నా 35 ఏళ్లుగా జిల్లా రాజకీయాలు చూస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా, ఈ రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో దోపిడీలకు అడ్డుఅదుపూ లేకుండాపోయింది. మట్టి, గ్రావెల్, ఇసుక వరకే దోచుకుంటున్నారనుకున్నాం…కానీ చివరకు కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తులను కూడా కాజేసే పరిస్థితికి వచ్చారు. మొన్న చిల్లకూరులో 250 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు.
ఇప్పుడు నెల్లూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న, కాకుటూరులో రూ.60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హాంఫట్ చేశారు. కోట్ల విలువైన భూకుంభకోణం జరిగితే టైపిస్టులు, తాత్కాలిక ఉద్యోగులపై చర్యలు తీసుకుని సరిపెట్టారు. పొదలకూరు తహసీల్దారు అక్రమాలకు పాల్పడుతున్నారని, జూలై 28న మేం ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. ఆగస్టు 2న మరోసారి పొదలకూరు టీడీపీ నేతలు సాక్ష్యాధారాలతో సహా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. బండారం బయటపడిపోతోందని భయపడిన ఆ తహసీల్దారు, ఆగస్టు 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు..ఆ ఫిర్యాదుపై ఈ రోజుకీ కేసు నమోదు కాలేదు.
సాక్షాత్తు తహసీల్దారు ఫిర్యాదు చేసినా, పోలీసులు ఎందుకు రిజిస్టర్ చేయలేదు…కలెక్టరేట్ లోని ఉన్నతాధికారులు కేసు రిజిస్టర్ చేయవద్దన్నారా..లేక ఎమ్మెల్యే చెప్పారా? పొదలకూరు మండలంలో వందల ఎకరాల భూములు అన్యాక్రాంతమైపోయాయి.. తహసీల్దరు, ఎస్సై బంధువుల పేర్లతో రికార్డులు మార్చేశారు. ఈ భూకుంభకోణాల వెనుక ఉన్న డాన్ ఎవరో వెలికితీయాలని, ఆగస్టు 23న అబ్దుల్ అజీజ్ కలెక్టర్ ను కలిసి కోరారు..ఈ రోజుకీ ఆ డాన్ ఎవరో బయటకు రాలేదు.
ఎమ్మెల్యేకి తెలియకుండా, సర్వేపల్లి నియోజకవర్గంలో వందల కోట్ల విలువైన భూముల రికార్డులు మారే ప్రసక్తే లేదు..ఇదంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతోంది. ఎమ్మెల్యే, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కు తెలియకుండా, ప్రభుత్వ భూములు రికార్డులు మారిపోతున్నాయా వెంకటాచలంలోని హైవే పక్కన ఉన్న రూ.60 కోట్ల విలువైన భూమి రికార్డులను, ప్రకాశం జిల్లా గుడ్లూరులో ఉండే గుమస్తా మార్చేశాడంటే నమ్మే విషయమేనా?
ఇదే నిజమైతే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆస్తులను, మేం అల్లీపురంలో కూర్చుని మార్చేసుకోవచ్చా? ప్రభుత్వ భూములు, ఆస్తులకు రక్షణ లేదా? అసలు పొదలకూరుకు స్వాతిముత్యం ఎందుకు వచ్చారో…ఎందుకు వెళ్లారో…ఆమెతో పాటు సిబ్బందిని కూడా ఎందుకు తీసుకెళ్లిపోయారో..ఉన్నతాధికారులే తేల్చాలి. చిల్లకూరు, కలువాయి నుంచి వెంకటాచలం వరకు వందల ఎకరాల ప్రభుత్వ భూములు, వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.
తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధారాలు సేకరించి, సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదులు ఇచ్చే వరకు జిల్లా ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? జిల్లాలో కలెక్టరేట్ నిద్రపోతుందా…లేక ఎమ్మెల్యేలను చూసి అధికారులు భయపడిపోతున్నారా?
ఎమ్మెల్యేలకు జడిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తారా? ఈ అత్యంత ప్రమాదకరమైన భూకుంభకోణాలపై సీఎస్, సీసీఎల్ఏ, డీజీపీ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లకు ఆధారాలతో సహా ఫిర్యాదులు పంపుతున్నాం. చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించబోతున్నాం. ఎమ్మెల్యేలు, వైసీపీ నేతల మాటలు విని అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదు.

Leave a Reply