Home » సినిమా బ్లాక్ బస్టరే

సినిమా బ్లాక్ బస్టరే

ఊహించినట్లే అనూహ్య విజయం సాధించింది రాస్తూనే ఉందాం సినిమా.
సీనియర్ జర్నలిస్ట్ భోగాది వెంకటరాయుడు తన 40 ఏళ్ల జర్నలిజం జీవితంలోని అనుభవాలు..జ్ఞాపకాలను కలగలిపి ఈతరం జర్నలిస్టులకోసం ప్రేమగా తయారు చేసిన సరికొత్త టానిక్ “రాస్తూనే ఉందాం” పుస్తకాన్ని శాంతా బయోటెక్ అధినేత పద్మభూషణ్, వరప్రసాద రెడ్డి ఆవిష్కరించి మొదటి ప్రతిని, పద్మభూషణ్ పద్మనాభయ్యకు అందించారు. ఈ సందర్భంగా వరప్రసాద రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం ఒకప్పటిలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇపుడు ప్రతీ పత్రికా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తోందని.. ఇటువంటి వాతావరణంలో రాయుడి వంటి నిబద్ధత ఉన్న జర్నలిస్టులు ఇమడలేరని అన్నారు.
మొదటి కాపీని అందుకున్న పద్మనాభయ్య మాట్లాడుతూ, రాస్తూనే ఉందాం పుస్తకాన్ని చదవడం మొదలు పెడితే చివరి వరకు ఎక్కడా ఆపలేకపోయానని .. ఏ పుస్తకాన్నీ ఇలా నిరాటంకంగా చదవలేదని అన్నారు. ఈ పుస్తకం నేటి తరం జర్నలిస్టులకు మంచి మార్గదర్శిగా పనికొస్తుందని పద్మనాభయ్య అన్నారు. రాయుడి రచనా శైలి అద్భుతమని కొనియాడారు.
వ్యవస్థలు ఇలా దిగజారిపోడానికి తనలాంటి వాళ్ల వైఫల్యమూ కారణమే కాబట్టి, తాను ఎక్కువ మాట్లాడలేనని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కె.వి.పి.రామచంద్రరావు అన్నారు.
వ్యవస్థల్లో విలువలు పడిపోతే.. పత్రికలు వాటిని ఎత్తి చూపేవని.. అటువంటి పత్రికా వ్యవస్థలోనే విలువలు పడిపోతే, ఇక ఎవరైనా చేయగలిగింది ఏముంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిజపు విలువలు మళ్లీ పెరిగితే బాగుండునని ఆయన ఆకాంక్షించారు.
నిజాన్ని నిర్భయంగా రాయడంలో రాయుణ్ని మించిన వారు లేరని సీనియర్ జర్నలిస్ట్ గోవిందరాజుల చక్రధర్ అన్నారు. రాయుడి స్థానంలో తాను ఉండి ఉంటే కచ్చితంగా అంత నిక్కచ్చిగా రాయలేకపోయేవాడినని చక్రధర్ వ్యాఖ్యానించారు.
భోగాది వెంకటరాయుడిది అనితర సాధ్యమైన భిన్నమైతన తత్వం అని కొనియాడారు మన తెలంగాణ ఎడిటర్ కె.శ్రీనివాస రెడ్డి. ఉన్నది ఉన్నట్లు రాసే క్రమంలో రాయుడికి తరతమ బేధాలు ఉండవని… తన వాళ్లపైనా విసుర్లతో వార్తలు రాసేస్తారని శ్రీనివాస రెడ్డి అన్నారు. అర్ధశతాబ్ధి గా తాను జర్నలిజంలోనే ఉన్నా హైదరాబాద్ కు పరిమితం అయ్యానని కానీ రాయుడు మాత్రం జర్నలిజంలో భిన్న పార్శ్వాలను చూసి రాటు దేలారని శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు.
రాయుడి కాలం నాటి జర్నలిజానికి నేటి జర్నలిజానికీ పొంతనే లేదన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ.బి.వెంకటేశ్వరరావు. ఒక ఎస్పీ జిల్లా మొత్తం కార్యకలాపాలను పర్యవేక్షించడం కన్నా ఒక జిల్లా రిపోర్టర్ జిల్లాలో ఏం జరుగుతోందో ఓ కన్నేసి ఉంచి వార్తలు రాయడం చాలా కష్టమైన పని అన్నారు ఏ.బి. వెంకటేశ్వరరావు.
చాలా కాలంగా భోగాది వెంకట రాయుడు తన పత్రికలో పవర్ ఫుల్ కాలమ్ రాస్తున్నారని లాయర్ పత్రిక ఎడిటర్ ప్రభు అన్నారు. రాయుడిలా ఏ పార్టీకీ సైడ్ తీసుకోని జర్నలిస్టులకూ.. వాళ్లు రాసే రాతలకూ ప్రధాన పత్రికల్లో చోటు ఉండదని.. తన పత్రికలో మాత్రం రాయుడు ఎంతకాలం రాసినా తాను కళ్లకద్దుకుని ప్రచురిస్తానని ప్రభు అన్నారు.
చివరగా పుస్తక రచయిత భోగాది వెంకట రాయుడు మాట్లాడుతూ …ఉద్యోగంలో ఉన్నా లేకపోయినా జర్నలిస్టు అనే వాడు రాస్తూనే ఉండాలని సూచించారు. తన జర్నలిస్టు జీవితంలో చాలా ఆటు పోట్లు చూశానని.. కష్టం వచ్చినపుడు కృంగిపోలేదు.. విజయాలు వచ్చినపుడు పొంగిపోనూ లేదని అన్నారు. ఏదో ఒక పత్రికలో ఉద్యోగం చేసినపుడు కాలరెగరేయలేదు.. ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు డీలా పడిపోనూ లేదని తన శైలిని చెప్పుకొచ్చారు. సీనియర్ జర్నలిస్టులు వల్లీశ్వర్ , తాడి ప్రకాష్, పి.విక్రమ్, తోట భావనారాయణ, ముసునూరి సోమయాజులు , తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఒక పక్క హైదరాబాద్ నగరం అంతా మబ్బులు పట్టేసి.. కుంభవృష్టి వానలు పడతాయన్న హెచ్చరిక మేఘాలు కమ్మేసిన సమయంలోనూ ఓ జర్నలిస్టు రాసిన పుస్తకం విడుదల కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం తరలి రావడం నిజంగానే విశేషం. ఇద్దరు పద్మభూషణులు.. పుస్తకాల విడుదల కార్యక్రమాలకు ఎప్పుడూ రాని సీనియర్ పొలిటీషియన్ కె.వి.పి.రామచంద్రరావు, సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ.బి. వెంకటేశ్వరరావు వంటి వారు రావడమూ గొప్పే.
మొత్తానికి బుక్ రిలీజ్ ఫంక్షన్ సూపర్ హిట్ అయిపోయింది.
ఆ ఆనందంతో రాయుడి కళ్లు ఉబ్బిపోయాయి. వర్షానికి ముందే ఆ కళ్లల్లోంచి ఆనందభాష్పాలు రాలిపడ్డాయి.

– ( యాజులు)

Leave a Reply