జగన్ గారూ..గిట్టుబాటు ధరలేవీ: సుంకర పద్మశ్రీ

వైసీపీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తుందని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ విమర్శించారు. రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ధాన్యం తొలిన రైతులకు చాలా ప్రాంతాల్లో ఇప్పటికి డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. రైతు అప్పుల్లో కురుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పంటకు తీసుకున్న ప్రభుత్వం సరైన మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. ఇదే అదునుగా చూసి దళారులు రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి, కర్నూలు, జిల్లాలో సుబాబుల్, జామాయిల్ ను రైతులు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక్క కృష్ణాజిల్లాలోనే 10 వేల మంది రైతులు 40 వేల ఎకరాలలో ఈ పంటను సాగు చేస్తున్నారని వివరించారు. పేపర్ కంపెనీలకు ప్రధాన వనరుగా ఉన్న సుబాబుల్, జామాయిల్ సాగు చేస్తున్న రైతులు పేపర్ కంపెనీలు, దళారుల చేతుల్లో మోసాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు, కంపెనీల నుంచి రైతులను కాపాడవాల్సిన ప్రభుత్వం రైతులను కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదిలివేయడం సరికాదన్నారు. సుబాబుల్ టన్ను 4200 లకు కొనుగోలు చేయాలని మంత్రుల సమక్షంలో కుదిరిన ఒప్పందాన్ని కంపెనీలు అమలు చేయటం లేదన్నారు.
ట్రేడ్ లైసెన్స్ పేరుతో వారే రోజుకో ధర నిర్ణయించుకుంటు రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం పేపర్ కంపెనీలకు అనుకూలంగా 143, 493 జీవోలు తెచ్చి రైతులకు నష్టం చేకూర్చేతే, వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ టన్ను ధర 5000 అమలు కావడం లేదన్నారు. సుబాబుల్, జామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర సాధన కోసం రైతులు చేపట్టే ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర, ఒకే విధానం వ్రాతపూర్వక అగ్రిమెంట్ ద్వారా అమలు జరిగేలా చూడాలన్నారు. సుబాబుల్, జామాయిల్ రైతులందరికీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం టన్ను ధర 5000 అమలుపర్చాలన్నారు. కర్ర కొనుగోళ్ళు మార్కెటింగ్ యార్డు ద్వారా జరపాలన్నారు. ట్రేడింగ్ లైసెన్సులు రద్దు చేసి, దళారులను అరికట్టి రైతులకు నేరుగా ధర వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply