Suryaa.co.in

Andhra Pradesh

వినాయక చవితి పూజలకు అనుమతులివ్వండి

– సీఎం జగన్‌కు లోకేష్ లేఖ
కరోనా కారణంతో వినాయకచవతి పండుగ, మండపాలు వద్దని చెప్పడం ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. కరోనా నిబంధనల మేరకే పండుగలు నిర్వహించుకునేలా అనుమతి ఇవ్వాలని ఆయన, సీఎం జగన్‌కు లేఖ రాశారు. లేఖ పూర్తి సారాంశం ఇదీ..
06-09-21
అమరావతి.
బహిరంగ లేఖ
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి
విషయం: విఘ్నాలు తొలగించే వినాయకుని పండగకే విఘ్నాలు కల్పించడం మంచిది కాదు. కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి బహిరంగ వేడుకలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలి.
కరోనా కారణంగా చూపుతూ వినాయక చవితి ఉత్సవాలకు బ్రేక్ వెయ్యడం, కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నందున పండుగను వ్యక్తిగతంగా ఇళ్లలో మాత్రమే జరుపుకోవాలంటూ ప్రభుత్వం ఆంక్షలు విధించడం, అనుమతులకు నిరాకరించడం వలన భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. విఘ్నాలు తొలగించే వినాయకుని పండగకే విఘ్నాలు కల్పించడం మంచిది కాదు. చవితి ఉత్సవాలపై ఏ రాష్ట్రం పెట్టని నిబంధనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే పెట్టడంలో అర్థమేంటి? కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో మద్యం అమ్మకాలు విచ్చల విడిగా జరిపారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో కనీస కోవిడ్ నిబంధనలు పాటించకుండా భారీ జన సమీకరణతో వేడుకగా జరిపారు. ఆఖరికి మీ 25వ వివాహ వార్షికోత్సవాన్ని కూడా అన్ని చోట్లా హడావిడిగా జరిపారు. మీకు సంబంధించిన ఏ కార్యక్రమానికి అడ్డురాని కోవిడ్ నిబంధనల పేరు చెప్పి మతసామరస్యాన్ని దెబ్బతీయొద్దు. దయచేసి మీ నిర్ణయాన్ని వెంటనే మార్చుకొని కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి బహిరంగ వేడుకలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలి.
… నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

LEAVE A RESPONSE