సొంత ఖర్చుతో జనాలను గ్రామాలకు చేర్చిన కన్నా

-దటీజ్ కన్నా !
-జగన్ సభకు ఆర్టీసీ బస్సులు
-బస్సుల్లేక అల్లాడిన సత్తెనపల్లి జనం
-పల్లెలకు వెళ్లేందుకు జనం అవస్థలు
-రంగంలోకి దిగిన కన్నా లక్ష్మీనారాయణ
-సత్తెనపల్లిలో కారు-ఆటోడ్రైవర్లకు పిలుపు
-కార్లు, ఆటోల్లో జనాలను గ్రామాలకు తరిలించిన కన్నా
-కన్నాకు కృతజ్ఞతలు చెప్పిన గ్రామాల ప్రజలు
(అన్వేష్)

ఎంకి పెళ్లి సుబ్బిచావుకు రావడమంటే ఏమిటో సత్తెనపల్లి గ్రామీణ ప్రజలు ఆదివారం అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభకు సత్తెనపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులన్నీ వైసీపీ సభకు తరలివెళ్లాయి. ఆ విషయం తెలియని గ్రామీణ ప్రజలు, సత్తెనపల్లి ఆర్డీసీ డిపో- తాలూకా సెంటర్‌లో చేతిలో సామాన్లతో పడిగాపులు కాశారు. నిజానికి రోజువారీ పనుల కోసం సత్తెనపల్లి పరిసర గ్రామాల్లోని ప్రజలు సత్తెనపల్లి టౌన్‌కు వస్తుంటారు. పనులు ముగించుకుని తిరిగి పల్లెవెలుగు, ఇతర బస్సు సర్వీసులలో గ్రామాలకు చేరుకుంటారు.

ఆదివారం కూడా అలాగే ఉదయమే వచ్చారు. అయితే సత్తెనపల్లిలోని ఆర్టీసీ బస్సులన్నీ వైసీపీ సిద్ధం సభకు వెళ్లడంతో బస్సులు రాక, జనం మండుటెండలో తాలూకాసెంటర్‌లో నిల్చున్నారు. ఆ తర్వాత తాము వెళ్లాల్సిన బస్సులను వైసీపీ నేతలు సిద్ధం సభకు తీసుకువెళ్లారని తెలియడంతో, జనం సీఎం జగన్‌ను తిడుతూ శాపనార్ధాలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ హుటాహుటిన అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. సమస్య ఏమిటో వాకబు చేశారు.

అప్పటికప్పుడు సత్తెనపల్లి టౌన్‌లోని కార్లు-ఆటోలను పిలిపించి, సొంత ఖర్చుతో జనాలను అవే వాహనాలలో వారి గ్రామాలకు పంపించి, తన ఔదార్యం చాటుకున్నారు. కన్నా వచ్చి తమను ఆటోలలో పంపించకపోతే, ఈరోజంతా ఇక్కడే ఉండాల్సివచ్చేదని జనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. అయినా మేం ఎక్కాల్సిన బస్సులను వైసీపీ వాళ్లు ఎలా తీసుకువెళతారు? జగన్‌కు జనం కంటే పార్టీ మీటింగు ఎక్కువా? మా ఉసురు ఊరకనేపోదు అని శాపనార్ధాలు పెట్టారు. సమయానికి వచ్చి ఆదుకున్న టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ మేలు మర్చిపోలేమని కృతజ్ఞతలు చెప్పారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ‘‘ప్రజలు రవాణా సౌకర్యం లేక అల్లాడుతుంటే ఉన్న తక్కువ బస్సులను, వైసీపీ సభలకు పంపించడం బాధ్యతారాహిత్యం. ఈ సైకో ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవు. అయినా పది కిలోమీటర్ల దూరానికి సైతం, హెలికాఫ్టర్‌లో వెళ్లే సైకో సీఎంకు సామాన్య ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయి? ఈ శనిని వదిలి టీడీపీ-జనసేన-బీజేపీ ప్రజాప్రభుత్వం వచ్చే సమయం ఇంకెంత దూరంలో లేదు. అప్పటిదాకా కొంచెం ఓర్పుతో ఉండండి’’ అని వ్యాఖ్యానించారు.

Leave a Reply