నడకదారి భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

Spread the love

– భక్తుల భద్రత విషయంలో రాజీ లేదు
– ఆపరేషన్ చిరుత కొనసాతుంది
– ఐదు చిరుతలను బంధించిన అటవీ శాఖ సిబ్బందిని అభినందించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, భక్తుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఏడవ మైలు శ్రీ నరసింహస్వామి ఆలయం సమీపంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుతను గురువారం చైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, రాత్రి పన్నెండు ఒంటి గంట మధ్య ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కిందన్నారు. రెండు నెలల్లో చిక్కిన ఐదవ చిరుత అన్ని తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో భక్తుల క్షేమం విషయంలో, వారి సౌలభ్యం కోసం టీటీడీ ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే అన్నారు.

అటవీశాఖ అధికారుల సహకారంతో, దాదాపు 300 మంది అటవీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో నిరంతర కృషి జరుగుతోందని చెప్పారు. ఈ కారణంగానే ఐదవ చిరుతను ఈ రోజున పట్టుకోవడం జరిగిందన్నారు.

ఇప్పటివరకు ఇద్దరు పిల్లలు చిరుత పులి దాడికి గురైతే, అందులో ఒక పాప మరణించినట్లు తెలిపారు. ఆ తర్వాత మరింత అప్రమత్తతో నడక దారిలో నడుస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించమని, వారితో పాటు తోడుగా భద్రత సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు చేసామన్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే చిన్న పిల్లలు నడిచేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు.

భక్తులలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం నిన్నటి నుంచి చేతి కర్రలు కూడా ఇవ్వడం ప్రారంభించామన్నారు. భక్తులకు భద్రతా సిబ్బంది తోడుగా ఇచ్చి, అదనపు భద్రత కల్పిస్తూనే అదనంగా కర్రలు ఇస్తున్నట్లు చెప్పారు.
భక్తుల భద్రత విషయంలో టీటీడీ ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు. ఆపరేషన్ చిరుత నిరంతరాయంగా కొనసాగుతుందని వివరించారు.

చైర్మన్ వెంట జేఈవో వీరబ్రహ్మం, టీటీడీ డీఎఫ్ఓ శ్రీనివాసులు, అటవీశాఖ డీఎఫ్ఓ సతీష్ రెడ్డి, విజివో బాలి రెడ్డి, ఏవీఎస్వో సతీష్, ఇతర అధికారులు ఉన్నారు.

Leave a Reply