Suryaa.co.in

Andhra Pradesh

టామ్ & జెర్రీ ఆట ఆపండి

– వివేకా హత్య కేసు విచారణపై బాలకోటయ్య అసహనం

నాలుగేళ్ళు దాటిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అనుసరిస్తున్న వైఖరి చూస్తుంటే, టామ్ & జెర్రీ పిల్లల యానిమేషన్ చిత్రం గుర్తుకొస్తుందని, పిల్లి ఎలుకను పట్టుకోదు, ఎలుక పిల్లికి దొరకదు అన్న చందంగా మారిందని ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఎద్దేవా చేశారు.

శనివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు జాప్యానికి కోర్టులు, సిబిఐ కలిసి ఆడుతున్న నాటకంగా ప్రజలు నమ్ముతున్నారు అని పేర్కొన్నారు. హత్య కేసులో అవినాష్ రెడ్డికి దొరికిన సౌలభ్యం దేశ చరిత్రలో ఇంకెవరికీ దొరికిఉండకపోవచ్చు అని అభిప్రాయ పడ్డారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ టేక్ అవుట్ , ఇతర సాక్షాలు దొరికినా, నిందితుని పట్ల సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు వ్యక్తం చేసిన ద్వంద్వ పరస్పర విరుద్ధ అభిప్రాయాలను ప్రజల గమనిస్తున్నారని గుర్తు చేశారు.

ఇలాంటి విచారణ ప్రక్రియ ద్వారా సిబిఐ మీద, కోర్టుల మీద ప్రజల్లో విశ్వాసం పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని సమస్యలను గాలికి వదిలేసి, రాజకీయ పార్టీల నాయకులు, మీడియా సంస్థలు వైసీపీ ట్రాప్ లో పడుతున్నాయని, టామ్ & జెర్రీ ఆటకు ప్రాధాన్యత ఇస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి సిబిఐ తన విచారణా ప్రమాణాలను కాపాడుకోవాలని బాలకోటయ్య హితవు పలికారు.

LEAVE A RESPONSE