-నేను మంగళగిరిలో ఓడిపోయాను. హేళన చేశారు. ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు
-ఓడిపోయానని పారిపోలేదు. మరింతగా గొప్పగా పోరాడుతున్నాను
-ఆత్మహత్యలు వద్దు ధైర్యంతో బ్రతకండి
-పరీక్షలో పాసవడమే జీవితం కాదు
-ఇంటర్ తప్పిన విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవద్దన్న టీడీపీ యువనేత లోకేష్
జీవితమే ఓ పరీక్ష. అనేక పరీక్షలు ఎదురవుతాయి. అందులో టెన్తో, ఇంటరో పరీక్ష తప్పితే ఏమవుతుంది? మహా అయితే ఒక ఏడాది వృథా అవుతుంది. ఈ మాత్రానికే సృష్టిలో అద్భుతమైన వరమైన మానవ జన్మని బలవన్మరణంతో ముగించడం అర్థరహితం. ఈ రోజు పరీక్ష తప్పిన విద్యార్థే రేపు అద్భుత ఆవిష్కరణలు చేసే సైంటిస్ట్ కావొచ్చు. నేడు మార్కులు తగ్గాయని తనువు చాలిస్తున్న విద్యార్థులే దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యే నిపుణులుగా ఎదగొచ్చు. అడుగడుగునా ఎదురయ్యే సవాళ్లన్నీ పరీక్షలే. విజయాలు, అపజయాలు ఉంటాయి. నేటి ఓటమి రేపటి గెలుపు మార్గం.
మార్కులు తగ్గాయని మూర్ఖంగా ప్రాణాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. రేపు వేరే పరీక్షలో అందరికంటే ఎక్కువ మార్కులు నీకే రావొచ్చు. ఉన్నతోద్యోగం నువ్వే పొందొచ్చు. అవకాశాలు వచ్చేవరకూ బతికి ఉండాలి. నేను మంగళగిరిలో ఓడిపోయాను. హేళన చేశారు. ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఓడిపోయానని పారిపోలేదు. మరింతగా గొప్పగా పోరాడుతున్నాను. ఓడిన చోటే గెలుస్తాను. హేళనలే విజయధ్వానాలు చేసుకుంటాను.
పరీక్ష పోతే పోయేదేం లేదు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే ముందు అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులని గుర్తుకి తెచ్చుకోండి. మీకు ప్రేమని పంచే కుటుంబ సభ్యులని తలచుకోండి. తల్లిదండ్రి, గురువు, దైవం అందరూ మీకు అండగా ఉంటారు. బంగారు భవిష్యత్తు మీ కోసం ఎదురు చూస్తోంది. మీ ఆత్మహత్యలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. దయచేసి బలవన్మరణపు ఆలోచనలు వీడండి. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. సమాజాభివృద్ధిలో మీ పాత్ర పోషించండి.