ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో గృహ నిర్మాణాలు అమలు జరుగుతున్న తీరు పట్ల కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి . కౌషల్ కిషోర్ సంతృప్తి వ్యక్తం చేసారు. రాష్ట్రంలో పేదలు ఇళ్ళు నిర్మించుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షలు మందికి ఇళ్ళ పట్టాలు కేటాయించటం చాలా మంచి నిర్ణయమన్నారు. అధికార పర్యటనకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి రాష్ట్రంలో గృహనిర్మాణాల అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అనంతరం విజయవాడలోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలో గృహ నిర్మాణం అమలు జరుగుతున్నతీరును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పేద ప్రజల కోసం అమలు జరుగుతున్న ఈ పథకం సకాలంలో పూర్తి అయ్యే విధంగా కృషి జరగాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన అన్నారు. హౌసింగ్ మిషన్ కింద ప్రతి పేదవానికి ఇళ్ళు కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని దీనిని పూర్తి చేయటానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు .దేశంలోని పేద ప్రజలకు 2024 సంవత్సరానికి పక్కా ఇళ్ళు నిర్మించాలన్నది ప్రధానమంత్రి ఆశయం అని ఈ ఆశయం పూర్తికావటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేయాలని,పేదల ఇళ్ళ నిర్మాణాలు తో పాటు ఆ కాలనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇళ్ళ మంజూరు లో అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, రాష్ట్రానికి అవసరైన ఇళ్ళను కేటాయించటానికి కృషి చేస్తానని, అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయటానికి చర్యలు తీసుకుంటానని కేంద్ర మంత్రి కౌషల్ కిషోర్ హామీ ఇచ్చారు. కేంద్రం వివిధ పథకాలు కింద రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తోందని, ఆ పథకాలు సకాలంలో పూర్తిచేయటానికి చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.
రాష్ట్రానికి సహకరించండి: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
రాష్ట్రంలో 30 లక్షలమంది పేదలకు ఇళ్ళు నిర్మించుకోవటానికి ఉచితంగా ఇళ్ళ స్థలాలు పంపిణి చేసామని, రాష్ట్రంలో నవరత్నాలు పేదలు అందరికి ఇళ్ళు పథకంలో భాగంగా ఇళ్ళ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలియచేశారు. అధికార కార్యక్రమాలలో ఉన్నందున మంత్రి తన సందేశాన్ని పంపించారన్నారు. రాష్ట్రంలో ఈ పథకం అమలు బాగా జరుగుతోందని, కేంద్రం కూడా సహకరించాలని మంత్రి కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి జోగి రమేష్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యెక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు.లబ్ధిదారులుకు ఇసుకను ఉచితంగా పంపిణి చేస్తున్నామని, సిమెంటు,ఐరన్ ఇతర నిర్మాణ సామగ్రిని మార్కెట్ ధరకంటే తక్కువకు అందేలా చర్యలు తీసుకున్నామని అయన తెలియచేశారు. ఇళ్ల నిర్మాణాల పురోగతి ఫై రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా సమీక్ష చేస్తున్నారని, అధికార యంత్రాగం నిత్యం పర్యవేక్షిస్తోందని అజయ్ జైన్ వివరించారు.రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ళ నిర్మాణాల ఫై ఆయన మంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్షీ షా మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నా కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలియ చేశారు.
కార్యక్రమంలో నవరత్నాలు పథకాలు అమలు కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఏ.నారయణ మూర్తి,గృహనిర్మాణ సంస్థ చీఫ్ ఇంగినీర్ జీ.వీ.ప్రసాద్,ఇతర అధికారులు పాల్గొన్నారు. రా ష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు స్వాగతం పలికారు.
లే అవుట్ సందర్శన
కేంద్ర గృహనిర్మాణం,పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌషల్ కిషోర్ ఇబ్రహంపట్నం మండలం గాజులపల్లి లే ఔటు లో జరుగుతున్న ఇళ్ళు నిర్మాణాలను రాష్ట్ర మంత్రి, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ లేఅవుట్ లో 1402 ఇళ్ళు మంజూరు కాగా 250 ఇళ్ళు పూర్తయ్యాయని, మిగిలినవి త్వరలో పూర్తి అవుతాయని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ షా కేంద్ర మంత్రికి వివరించారు. ఈ లే అవుట్ లో జరుగుతున్న ఇళ్ళ నిర్మాణాల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.