రాష్ట్ర ప్రజల అభ్యున్నతి, సకల జనుల సంతోషానికి రాజశ్యామల దేవీ యజ్ఞం

• ముఖ్యమంత్రి సంకల్ప శుద్ధితో దిగ్విజయంగా ఐదో రోజు కొనసాగిన రాజశ్యామల యజ్ఞం
• *అమ్మవారి ఆశీస్సులు, అనుగ్రహంతో అధ్యాత్మిక శోభను సంతరించుకున్న యాగశాల
• యజ్ఞదీక్ష చేపట్టిన దేవదాయశాఖ మంత్రి దంపతులతో రేపు గౌరవ ముఖ్యమంత్రికి నూతన పట్టు వస్త్రాల బహుకరణ
• రుత్విక్కులు, వేద పండితులు, పీఠాధిపతులచే ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం
• అనంతరం వేద పండితులను, పీఠాధిపతులను సత్కరించనున్న ముఖ్యమంత్రి
• దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయానికి చెందిన రూ.180 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల మాస్టర్ ప్లాన్ ను పరిశీలించనున్న సీఎం
• మహా క్రతువుతో దేదీప్యమానంగా అలరారుతున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం
• క్రతువును వైభవోపేతంగా నిర్వహిస్తున్న రుత్విక్కులు, ఘనాపాటిలు, వేద పండితులు
• ప్రముఖ పీఠాధిపతుల అనుగ్రహ భాషణంపై సర్వత్రా హర్షం
• *భారతదేశంలోనే ఎక్కడా నిర్వహించని యజ్ఞం తలపెట్టి దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం
: *రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

విజయవాడ : ఉన్నతమైన సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధిని కాంక్షించి, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా లోకకళ్యాణ హితార్థం చేస్తున్న అష్టోత్తర శత కుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం దిగ్విజయంగా ఐదో రోజు కొనసాగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి .కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలోని యజ్ఞవాటిక ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ లో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ చతురాగమ శాలలో వేద మంత్రోచ్ఛరణల మధ్య మూల మంత్ర జపాలు, చతుర్వేద పారాయణాలు, నిరంతర హోమాలు, అర్చనలు, కుంకుమార్చనలు, విభిన్న అభిషేకాలు, విశేష పూజలతో చేస్తున్న ఈ తరహా యజ్ఞాన్ని భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడా చూడలేదని, అంతటి గొప్ప యజ్ఞాన్ని మనం తలపెట్టడం, దిగ్విజయంగా కొనసాగించడం అసాధారణ విషయమన్నారు. యజ్ఞానికి సంపూర్ణత్వం కలిగేలా రుత్విక్కులు, ఘనాపాటిలు, వేద పండితులు తమ శక్తినంతా ధారబోసి క్రతువును వైభవోపేతంగా నిర్వహిస్తున్నారన్నారు. ఈ మహా క్రతువుతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దేదీప్యమానంగా, అధ్యాత్మిక శోభతో అలరారుతుందన్నారు.

ముఖ్యమంత్రి .వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంకల్ప శుద్ధితోనే మహా యజ్ఞం ప్రారంభమైందని చెప్పిన మంత్రి ఈ సందర్భంగా రేపు(17.05.2023) ఆయన స్వహస్తాలతో పండితులు నిర్ణయించిన సుముహూర్తాన మహా పూర్ణాహుతితో కార్యక్రమం ముగుస్తుందన్నారు. ఉదయం 8.55 గం.లకు ముఖ్యమంత్రి యజ్ఞ మండపం వద్దకు చేరుకుంటారని, అనంతరం 9.10 నిమిషాలకు పాంచరాత్ర యాగశాలలో, 9.20కి వైదిక స్మార్త యాగశాలలో విశేష విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 9.50 గం.ల లోపు రాజశ్యామల అమ్మవారు వేంచేసి ఉన్న వైఖానస యాగశాలలో పూర్ణాహుతికి సంబంధించిన పూజా కార్యక్రమం చేస్తారన్నారు.

అనంతరం 10.10 గం.లకు శైవ ఆగమ శాలకు సీఎం రావడంతో పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నల్లకలువలతో వేదమంత్రోచ్ఛరణల మధ్య రుత్విక్కులు, ఘనాపాటిలు, పండితులతో విశేషంగా పూజా కార్యక్రమాలు చేపడతారన్నారు. 10.20 గం.లకు అభిషేక మండపంలో ముఖ్యమంత్రి కోసం ఏర్పాటు చేసిన ఆసనంలో ఆసీనులవుతారన్నారు. వారి చేతుల మీదుగా అమ్మవారికి, కంచి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన స్వర్ణ ప్రతిమ రూపంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం జరుపుతారన్నారు. క్రతువులో భాగంగా రుత్విక్కులు ముఖ్యమంత్రికి యజ్ఞ ప్రసాదం ఇస్తారన్నారు. అదే సమయంలో యజ్ఞ దీక్ష చేపట్టిన దంపతులు ముఖ్యమంత్రికి నూతన పట్టు వస్త్రాలు బహుకరణ చేస్తారన్నారు. అనంతరం రుత్విక్కులు, వేద పండితులు, పీఠాధిపతుల సమక్షంలో ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం ఉంటుందన్నారు. ఆ తర్వాత వేద పండితులను, పీఠాధిపతులను సీఎం సత్కరిస్తారని తెలిపారు.

పుణ్య కలశ జలాల సంప్రోక్షణతో పూర్ణాహుతి కార్యక్రమం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి ప్రవేశ ద్వారం దగ్గరకు బయలుదేరి ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయానికి సంబంధించిన రూ.180 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు, శాస్త్రోక్తంగా వాస్తు పండితుల సూచన మేరకు నిర్ణయించిన ప్రధాన రాజగోపుర ద్వారం నుండి దర్శనం చేసుకునే ఏర్పాట్లు వంటి కార్యక్రమాల మాస్టర్ ప్లాన్ మోడల్ ను ముఖ్యమంత్రి చూసే విధంగా ఏర్పాటు చేశామన్నారు. వాటిని సీఎం పరిశీలిస్తారన్నారు. సీఎం అనుమతి మేరకు అతి త్వరలో శంకుస్థాపన తేదీని నిర్ణయిస్తామన్నామని మంత్రి వెల్లడించారు. అడిగిన వెంటనే ఇంతటి మహా క్రతువు చేసేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి అన్యయముతో మహాపూర్ణాహుతి ఆగమోక్తంగా జరుగుతుందన్నారు. కార్యక్రమానికి చినజీయర్ స్వామి, మంత్రాలయ పీఠాధిపతి, అహోబిల పీఠాధిపతి తదితరులు హాజరవుతారని తెలిపారు.

ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం యజ్ఞధారణ చేపట్టిన దేవదాయశాఖ మంత్రి దంపతులు నిరంతరం ప్రవహించే కృష్ణానదిలో పవిత్ర స్నానం చేసిన అనంతరం పండితులు, పీఠాధిపతులచే వేదాశీర్వచనం తీసుకుంటారు. అనంతరం వారిని మంత్రి సత్కరించే కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం వారితో కలిసి యజ్ఞ ప్రసాదం స్వీకరిస్తామన్నారు.

ఈరోజు అధ్యాత్మిక శోభను సంతరించుకున్న యాగశాలలో భక్తులకు అభ్యుదయ పరంపరాభివృద్ధి కొరకు సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహాస్వామి వార్ల దివ్య కళ్యాణమహోత్సవం కన్నుల పండువగా జరిగిందన్నారు. వేదాంత రాజగోపాల చక్రవర్తి అనుగ్రహ భాషణం ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకొందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయన్నారు. ప్రతి ఒక్క భక్తుడు అధ్యాత్మిక అనుభూతికి లోనవుతున్నారన్నారు. యజ్ఞం తిలకించిన భక్తుల జన్మ ధన్యమైనట్లే అని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో సైతం రాష్ట్రం నిర్వహిస్తున్న యజ్ఞంపై చర్చిస్తున్నారన్నారు.

ఈ నేల ఎంతో పుణ్యం చేసుకుందని, పరమ పవిత్ర హోమ గుండంతో అలరారుతున్న యజ్ఞంలో పాల్గొన్న వారు ధన్యులని హంపీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీస్వామి అనుగ్రహ భాషణం చేశారు.రాజరాజేశ్వరీ మహా విద్యా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ వాసుదేవానందగిరి స్వాముల వారు అనుగ్రహ భాషణం చేస్తూ లలిత సహస్రనామంలో యజ్ఞప్రియ అనే నామం ఉందని, జగన్మాత యజ్ఞంతో ప్రీతి చెందుతుంది కనుక రాజశ్యామల దేవీ సకల జనులకు అనుగ్రహ వర్షం కురిపిస్తుందని, పుణ్యం చేసుకుంటే తప్ప ఇక్కడకు రాలేరని అభిప్రాయ పడ్డారు.

పూజ్య పీఠాధిపతులు సైతం కార్యక్రమాన్ని కొనియాడారన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చైతన్యతపోవన ఆశ్రమపీఠాధీశ్వరి శ్రీశ్రీశ్రీ శివానంద సరస్వతీ అనుగ్రహ భాషణంలో వందలాది మంది ముత్తైదువులతో సుహాసినీ పూజ జరపడం ఎంతో శుభసూచికమని, అడుగడుగునా అమ్మవారు ఆనందంతో నడయాడుతుందని చెప్పారన్నారు.

రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి, సకల జనుల సంతోషం కోసం దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో యజ్ఞ కార్యక్రమం చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పండితులంతా నిస్వార్థంగా, నిజాయితీగా, ఆగమశాస్త్ర నియామానుసారం రాత్రింబవళ్లు శ్రమించి పూజలు నిర్వహిస్తున్నారన్నారు. భగవంతుని అనుగ్రహ ప్రాప్తి కోసం భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యజ్ఞ ప్రదక్షిణకు, యజ్ఞ ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో మహా యజ్ఞానికి హాజరై క్రతువును స్వయంగా సకుటుంబ సపరివార సమేతంగా తిలకించి యజ్ఞ ఫల ప్రాప్తి పొందాలని మంత్రి కోరారు.

 

 

 

మీడియా సమావేశంలో భక్తులపై, పాత్రికేయులపై మానససరోవరం నుంచి తెచ్చిన పవిత్ర జలాన్ని వేద పండితులచే ప్రోక్షణగావించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మీడియా సమావేశంలో దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్, ఆర్ఎస్ డీ చంద్రశేఖర్ ఆజాద్, యజ్ఞ కార్యక్రమాల ఇన్ ఛార్జి వేదాంత రాజ గోపాల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply