Suryaa.co.in

Andhra Pradesh Telangana

అవినాష్ రెడ్డి కనుసైగల మేరకు పథకం ప్రకారమే దాడి

-మీడియాపై దాడి చేసే అధికారం ఎక్కడిది?
-హత్యాయత్నం కేసు నమోదు చెయ్యాలి
-టీయుడబ్ల్యుజె డిమాండ్

విధి నిర్వహణలో భాగంగా సమాచార సేకరణకు వెళ్లిన పాత్రికేయులపై కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి అనుచరులు చేసిన పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే. విరాహత్ అలీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఫ్యాక్షనిజాన్ని తలపించే విధంగా నడి రోడ్డుపై, ప్రజల సాక్షిగా జర్నలిస్టులపై హత్యాయత్నం చేసే అధికారాన్ని అవినాష్ రెడ్డి అనుచరులకు ఎవరిచ్చారని వారు ప్రశ్నించారు. సమాచార సేకరణకు వెళ్లిన ఏబీఎన్ ప్రతినిధి శశి, హెచ్ఎంటివి ప్రతినిధి రత్నకుమార్ లపై రక్తం చిందే విధంగా అతని అనుచరులు భౌతిక దాడికి దిగడంతో పాటు ఏబీఎన్ వాహన అద్దాలను, హెచ్ఎంటివి కెమెరాలను ధ్వంసం చేయడం సహించరాని దన్నారు. అవినాష్ రెడ్డి కనుసైగల మేరకు పథకం ప్రకారమే ఈ దాడి జరిగిందని వారు ఆరోపించారు.

గౌరవప్రదమైన పార్లమెంటరియన్ పదవిలో ఉన్న అవినాష్ రెడ్డి ఇలాంటి అప్రజాస్వామిక దాడులు చేయించి ఆ పదవికి మచ్చతెచ్చారని వారు ధ్వజమెత్తారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా జర్నలిస్టులపై దాడికి పాల్పడిన దుండగులపై, దీనికి కారకుడైన వై.ఎస్.అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తెలంగాణ డీజీపీకి ఐజేయూ, టీయుడబ్ల్యుజె నాయకులు డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE