Suryaa.co.in

Andhra Pradesh Telangana

నటనలో ఎన్టీఆర్‌కు సాటెవరూ లేరు

– సీబీఐ మాజీ జడ్జి జస్టిస్ నాగమారుతీ శర్మ
– ప్రముఖులకు ఎన్టీఆర్ శత జయంతి పురస్కారాలు
– ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలన్న పిన్నమనేని సాయిబాబా
– టీడీపీ నేత మండూరి సాంబశివరావుకు సన్మానం

సినీ రంగంలో రారాజులా వెలిగిన దివగంత ఎన్టీఆర్‌ను స్మరించుకోవడం మంచి సంప్రదాయమని సీబీఐ మాజీ జడ్జి జస్టిస్ నాగమారుతీ శర్మ అభినందించారు. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్‌కు సాటెవరూ రారని, తెలుగు చలనచిత్రాలపై ఆయనది చెరగని ముద్ర అని నాగమారుతీ శర్మ కొనియాడారు. వివిధ రంగాల్లో నిష్ణాతులను సన్మానించడం ప్రశంసనీయమన్నారు. ఉమ్మడి కుటుంబాలకు సంబంధించిన కథలు రావలసిన అవసరం, నేటి పరిస్థితిలో ఉందన్నారు.

అఖిల భారత ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిన్నమనేని సాయిబాబా మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగువారి గుండెల్లో కొలువైన దేవుడన్నారు. కులమతాలు అంటని మహనీయుడన్నారు. అలాంటి ఎన్టీఆర్ చరిత్ర, తెలుగుజాతికి ఆయన చేసిన సేవలు స్మరించుకుని, భావి తరాల వారికి ఆయనను గుర్తు చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్నగారి శతజయంతి సందర్భంగానయినా కేంద్రం ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. కళానిలయం సాంస్కృతిక సంస్థ త్యాగరాయగానసభలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులకు పురస్కారాలు అందించారు.

టీడీపీ నాయకుడు, ఎన్టీఆర్ అభిమాని మండూరి సాంబశివరావును ఈ సందర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ యుగాంతం వరకూ తెలుగు ప్రజలు, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి పురస్కారాల రోజున, తనను సన్మానించడం తన అదృష్టమన్నారు. అన్నగారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు సాయిబాబా ఎప్పటినుంచో పోరాడుతున్నారని గుర్తు చేశారు. కనీసం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగానయినా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చి, తెలుగుప్రజలను గౌరవించాలని మండూరి కేంద్రాన్ని అభ్యర్ధించారు.

నటులు గుండు సుదర్శన్, భవానీశంకర్, రచయిత టి.నవీన్‌కు ఎన్టీఆర్ పురస్కారం అందించారు. ప్రముఖ గాయని జిక్కీ కుమార్తె హేమలతకు ఘంటసాల-ఎన్టీఆర్ పురస్కారం అందించారు. మాజీ కార్పొరేటర్ పలక బాలరాజ్ గౌడ్, రవీంద్రాచారి, డాక్టర్ ఏఎస్‌రావు, సంస్థ అధ్యక్షురాలు పుష్పలత, కార్యదర్శి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE