-కేంద్ర సంకీర్ణంలో బీ.ఆర్.ఎస్. పాత్ర అత్యంత కీలకం కాబోతోంది
-అప్పుడు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించి తీరుతాం
– కేంద్రం మెడలు ఎలా వంచాలో తెలంగాణకు తెలుసు
– కాజీపేటకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు
– పీవోహెచ్‌తో ఒరిగేదేమీ లేదు
– కోచ్ ఫ్యాక్టరీతోనే కాజీపేట ప్రాంత ప్రజలకు న్యాయం
– కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో తగ్గేదిలే
– ప్రత్యక్షంగా.. పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ ఉపాధిఅవకాశాలు
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్
కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. కేంద్రం మెడలు ఎలా వంచాలో తెలంగాణకు తెలుసు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధించి తీరుతాం.. సాధించేదాకా వదిలిపెట్టే ప్రసక్తేలేదు. దశాబ్దాలుగా కాజీపేటకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించేది లేదు. దేశంలో కోచ్‌ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఎలా ఏర్పాటు చేస్తున్నారు..? ఈ ప్రశ్నకు తెలంగాణ బీజేపీ నేతలు కూడా సూటిగా సమాధానం చెప్పాలి.
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ అంశాన్ని తప్పుదోవపట్టించి, కేవలం పీవోహెచ్ వర్క్‌షాపు అని.. ఆ తర్వాత వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటూ.. కాజీపేటకు వస్తున్న ప్రధాని మోడీ మోసాన్ని ఓరుగల్లు ప్రజలు గమనిస్తున్నారు. తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు…అని మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు.
ఈనెల 8న కాజీపేటకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో గురువారం దక్షిణ కొరియా దేశ పర్యటన నుంచి వినోద్ కుమార్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.దశాబ్దాలుగా కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఇక సహించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ఓరుగల్లు ప్రజలు పోరుబిడ్డలు.. కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేదాకా కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ కావాలని చెప్పి ఉద్యమించారు. నిజానికి.. 1980లో పీవీ నరసింహారావు ఎంపీగా గెలిచిన తర్వాత 1982లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సర్వేలు చేశారు. కాజీపేట చుట్టుపక్కల ప్రాంతాలు అయిన అయోధ్యాపురం, మడికొండ, రాంపూర్ తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూసేకరణ చేస్తామని చెప్పారు. దీంతో ఇక కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు అవుతుందని ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు యావత్ తెలంగాణ ప్రజలు కూడా సంతోషపడ్డారు.
అయితే ఆ సమయంలోనే ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మరణించడం… ఆతర్వాత రాజీవ్‌గాంధీ ప్రధాని కావడం.. ఆనాడు పంజాబ్ రాష్ట్రంలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని సంప్రదింపులతో నీరుగార్చడానికి ప్రముఖ ఉద్యమనాయకుడు లోంగోవాలాతో ఒప్పదం చేసుకున్నారు. కాజీపేటకు రావాల్సిన కోచ్‌ఫ్యాక్టరీని పంజాబ్‌లోని ఖబుర్తలాలో ఏర్పాటు చేశారు. ఇది చాలా పెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఇక అప్పటి నుంచి కాజీపేటకు తీరని అన్యాయం జరుగుతూనే ఉంది.
కోచ్‌ఫ్యాక్టరీ ఒక కలగానే మిగిలిపోతోంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తే తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల నోట్లో కేంద్ర ప్రభుత్వాలు మన్నుకొడుతూనే ఉన్నాయి.. అని వినోద్‌కుమార్ అన్నారు.
దశాబ్దాలుగా కాజీపేటకు అన్యాయమే..
కాజీపేటలో ఆనాడు సీపీఐ నేతలు భగవాన్‌దాస్, కాళీదాస్‌తోపాటు అనేక మంది నాయకులతో కలిసి వరంగల్ ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు ఉద్యమించారు. ఉద్యమిస్తూనే ఉన్నారు. ఖలిస్తాన్ ఉద్యమాన్ని చల్లార్చడానికి ఖబర్తలాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎవరు కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా ఉంటే వారు.. వారివారి నియోజకవర్గాల్లో కోచ్‌ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నారు. జాఫర్ షరీఫ్, లాలూప్రసాద్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, సోనియా గాంధీ, పీయూష్ గోయల్ లు వారివారి నియోజకవర్గాలకు తరలించారు.
కానీ.. వీటన్నింటికంటే ముందే కాజీపేటకు ఇచ్చిన మాటను మాత్రం మరిచిపోయారు. ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా అంటే 2016లో పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ.. కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని అడిగాను. ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నిలదీస్తే.. ఇప్పుడు కోచ్‌ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదు… అంత అవసరం కూడా లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
కానీ.. ఆ తర్వాత పీయూష్ గోయల్ రైల్వేశాఖ మంత్రి ఉన్నప్పుడు మహారాష్ట్రలోని లాథూర్‌లో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. అంతెందుకు.. మొన్నటికి మొన్న జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ అక్కడి దాహోస్ లో సుమారు రూ.20వేల కోట్లతో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
కోచ్‌ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వమే.. ఆ తర్వాత రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తోంది… అంటే తెలంగాణ ప్రజలను మోడీ ఎలా మోసం చేస్తున్నారో ఒక్కసారి అందరూ ఆలోచించాలి. తెలంగాణపై మోడీ చూపిస్తున్న వివక్షకు ఇది నిదర్శనం కాదా..? అని నేను అడుగుతున్నా.. దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు కూడా సమాధానం చెప్పాలి.. అని వినోద్‌కుమార్ అన్నారు.
కోచ్‌ఫ్యాక్టరీ సాధించేదాక ఉద్యమిస్తాం
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రధాన నినాదం. కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలతో కలిసి ఉద్యమించాం. ఈనేపథ్యంలో రాష్ట్ర విభజన చట్టంలోనూ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని పొందుపర్చారు. కానీ.. ఇక్కడి ప్రజల డిమాండ్‌ను పక్కనబెట్టి.. కేవంలో పీవోహెచ్ వర్క్ షాపు ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చింది. దీంతో ఇక్కడి ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన అంశాన్ని పక్కనబెట్టి.. మోడీ ప్రభుత్వం తెలంగాణను మోసం చేస్తోంది. కాజీపేటలో పీవోహెచ్ వర్క్ షాపు ఏర్పాటుకు పునాదిరాయి వేయడానికి ప్రధాని మోడీ జూలై 8న కాజీపేటకు వస్తున్నట్లు జూన్ 30న పత్రికల్లో వార్తలు చూసి ఈ ప్రాంత ప్రజలు మండిపడ్డారు. బీ.ఆర్.ఎస్. పార్టీగా మేం కూడా తీవ్రంగా వ్యతిరేకించాం. ఈ ప్రాంత ప్రజలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడుగుతుంటే.. కేవలం పీవోహెచ్ వర్క్ షాపు ఎందుకని ప్రశ్నించాం.
మేం ప్రశ్నించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడిపోయింది. కాజీపేటలో పీవోహెచ్ కాదు.. వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మేం దీనిని స్వాగతిస్తున్నాం.. కానీ.. తెలంగాణకు.. కాజీపేటకు కావాల్సింది కోచ్‌ఫ్యాక్టరీ మాత్రమే. కోచ్‌ఫ్యాక్టరీతోనే ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది. వేలాదిమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ విషయాన్ని కేంద్రంలోని బీజేపీ గమనించాలి. లేనిపక్షంలో తెలంగాణ ప్రజల చేతిలో బీజేపీ చావుదెబ్బతింటుంది అని వినోద్‌కుమార్ హెచ్చరించారు.