– ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తున్న స్థానిక వైసీపీ నేతలు
– గుంతలు పూడ్చలేని సీఎం..మూడురాజధానులెలా కడతాడు
– రాష్ట్రాన్ని దోచుకునేందుకే మూడు రాజధానుల డ్రామా
– ఉత్తరాంధ్ర భవిష్యత్తు అక్కడి ప్రజలపైనే ఉంది
– టీడీపీ హయాంలో నిర్మాణాత్మకంగా అభివృద్ధి కార్యక్రమాలు
– వైసీపీ పాలనలో కూల్చివేతల దిశగా సీఎం చర్యలు
– రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ
విశాఖపట్నంలో భూ బకాసురులు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తిష్టవేసుకుని కూర్చుని అక్కడి భూములను నామరూపాలు లేకుండా దోచుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…‘‘జగన్ రెడ్డి విశాఖను, ఉత్తరాంధ్ర దోచుకునేందుకు మూడు రాజధానుల పేరుతో దోపీడీ డ్రామాలాడుతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తులను దోచుకునేందుకు, రాష్ట్ర ఆర్థిక నగరం విశాఖను కొల్లగొట్టేందుకు జగన్ రెడ్డి దోపిడీ ముఠా విశాఖలో భూ కబ్జాలకు పాల్పడుతోంది.
విజయసాయిరెడ్డి ఇప్పటికే వేలాదికోట్లు విలువచేసే భూములను దోచుకుని, ఏమీ ఎరుగని అమాయకుడిలా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాడు. రోడ్ల మీద పడిన గుంతల్లో గుప్పెడు మట్టి వేయలేని ముఖ్యమంత్రి..మూడు రాజధానులు ఎలా కడతారో ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీయాలని కోరుతున్నాం. దోపిడీకి మారుపేరు జగన్ రెడ్డి అనేది జగమెరిగిన సత్యం. ఇటువంటి వ్యక్తికి సహకరిస్తూ…ఉత్తరాంధ్ర నాయకులు ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేస్తున్నారు.
5 కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలు ముడిపడిఉన్న రాజధాని అమరావతిని జగన్ రెడ్డి కుట్రపూరితంగా ధ్వంసం చేశాడు. రాష్ట్ర ప్రజలపై అధిక ధరలు, పన్నుల భారం మోపి ఆర్థిక ఇబ్బందులకు గురిచేశాడు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న విషయాన్ని ప్రజలకు తెలియకుండా ఉండేందుకు మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చి తన వైఫల్యాలు, దోపిడీని జగన్ రెడ్డి కప్పిపుచ్చుకుంటున్నాడని రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి.
రాజధానిని నిర్మించలేక తన దద్దమ్మతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కులం, మతం, ప్రాంతీయ విద్వేషాలను జగన్ రెడ్డి రెచ్చగొట్టి…వీటి చాటున తన దోపిడీ, కబ్జా వ్యవహారాలు కొనసాగిస్తున్నాడు. రాజధాని పేరుతో విశాఖలోని రుషికొండకు పూర్తిగా వైసీపీ నాయకులు గుండుకొట్టారు. తమ దోపిడీకి ఏదీ అడ్డుకాదు అనే విధంగా వైసీపీ నాయకులు పేట్రేగిపోతున్నారు.
తెలుగుదేశం అధికారంలో ఉండగా శ్రీకాకుళంలో ఐఐటీ, డయాలసిస్ కేంద్రాలు, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం అంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్మాణాత్మకంగా చేపట్టడం జరిగింది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వీటినన్నిటినీ ధ్వంసం చేశాడు. అమరావతిలో వివిధ కంపెనీలు రూ.15లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. వాటి ద్వారా 30లక్షల ఉద్యోగాలు వచ్చేవి. వీటినన్నిటినీ జగన్ రెడ్డి కూలగొట్టారు. అమరావతిని నాశనం చేసిన వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.
తన జేబులు నింపుకోవడానికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను నాశనం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు జగన్ భజన చేస్తూ…రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్రంతో సహా హెచ్చరిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలి. అభివృద్ధి చేసే నాయకుడు ఎవరు, దోచుకునే నాయకుడు ఎవరో అర్థం చేసుకోవాలి. ఉత్తరాంధ్ర భవిష్యత్తు అక్కడి ప్రజలపైనే ఆధారపడి ఉంది.
మూడు రాజధానుల పేరుతో తమకు అన్యాయం చేస్తున్న వైసీపీ నాయకులను ఉత్తరాంధ్ర ప్రజలు నిలదీయాలి. విశాఖలో జరిగిన భూకబ్జాలపై గళం విప్పాలి. గతంలో జరిగిన అభివృద్ధి, వైసీపీ పాలనలో కనిపించకుండా పోయిన అభివృద్ధిపై తమ నాయకులను ప్రశ్నించాలి. రాష్ట్ర భవిష్యత్తును, భావితరాల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఉత్తరాంధ్ర ప్రజలపై ఉంది.
ఉత్తరాంధ్ర ప్రజల పోరాటాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. భూ బకాసురులు, తాడేపల్లి ప్యాలెస్ లోని దోపిడీ దొంగ, వైసీపీ గూండాలు, రౌడీల నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రజలు సమైఖ్యంగా ముందడుగు వేయాలి…రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటోంది’’ అని అన్నారు.