Suryaa.co.in

Political News

మునుగోడు సాక్షిగా.. మునిగింది ప్రజాస్వామ్యం!

అదిగదిగో..
మునుగోడు బరి
ఎన్నికల సంఘమే
కాటికాపరి..
ప్రజాస్వామ్యమా..
నువ్వు మరోసారి చచ్చావు..
ఊరేగుతోంది నీ శవం..
మునుగోడు రోడ్లపై నగ్నంగా..
నీకు లేదేమో సిగ్గు..
అధికారం చక్కగా తొంగుంది
గెలిచిన మజాలో
మింగేసి ఎగస్ట్రా పెగ్గు..!

గతంలో చీకటి పడ్డాకే
పంపిణీ..కాలాపానీ..
మునుగోడులో
పంచడమే పని..
ఇదంతా చూసి
నవ్వుకుంది అవని..!

కంచే చేను మేసిన వైనం
కాంచి గొల్లుమంది ప్రజాస్వామ్యం..
చూస్తూ వికటాట్టహాసం చేసింది ధనస్వామ్యం..
బడాబాబులు ఇష్టం..
మునుగోడులో
రాజుకుంది రావణకాష్టం..
ప్రజాస్వామ్యమా..
నీకెంత కష్టం..!

ఇది 2024 ఎన్నికలకు
రెక్కీనా..
ఇంతకు మించి ఉండబోతుందా
విలువల పతనం..
ఇది పక్కానా..
పంపిణీ ఇంత చక్కానా..
ఇంకెక్కడిది ప్రజాస్వామ్యానికి ఠికానా?

అయినా మారరా..
ఈ ప్రజలు ఇది మానరా..
ఒక్క రోజు ఇచ్చే సొమ్ము..
అయిదేళ్ల భవిత వమ్ము..
ఇచ్చిన బిర్యానీలు మేస్తూ
ఓటుకు నోటు అమ్మేస్తూ..
ఓటరుగా నువ్వు చస్తున్నావు
నీ పాపానికి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నావు!

ఉపదేశాలు..సందేశాలు అనవసరం..
పంచడం వారి ఆవశ్యకత…
తీసుకోవడం నీ బలహీనత..
ఇదే కదా ఇండియా..
అక్రమాలకే తాలియా..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE