“మహా స్వాప్నికుడు “
విశ్వం మెచ్చిన నాయకుడుగా,విజన్ ఉన్న నేతగా పేరుపొందిన నారా చంద్రబాబునాయుడు నాల్గో సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా పగ్గాలు చేపట్టి చారిత్రకెక్కారు.అయితే ఆయన జీవితమే ఓ సంక్షోభాల,సంక్షేమాల,సంక్షేమపథకాల, అభివృద్ధి కాగడాల, చీకటి వెలుగుల , వెలుగురేఖల గెలుపు ఓటముల దుర్గమ మార్గమని నిరూపించడానికా అన్నట్టు మహాస్వాప్నికుడు అన్న గ్రంథం వెలువరించాడు విక్రమ్ పూల.
1950 ఏప్రిల్ 10 న జన్మించిన చంద్రబాబు జీవితాన్ని అనేక కోణాల్లో విపులంగా,సమగ్రంగా,సాధికారికంగా అక్షరరీకరించిన అపూర్వ పరిశోధనా గ్రంథమిది. నాయకుడు అంటే రాబోయే ఎన్నికల కోసం పనిచేసే వాడు కాదు.రాబోయే తరాల కోసం పనిచేసేవాడు అన్న ఉపశీర్షికతో “మహా స్వాప్నికుడు” గ్రంథాన్ని వెలువరించడం ఒక చారిత్రక అవసరం.
“గొప్ప నాయకత్వం పటిమ,పరిపాలనా సామర్థ్యం కలిగిన నాయకులు విజయాలను చూసి పొంగిపోరు.సంక్షోభాలొస్తే కుదేలైపోరు.స్థిత ప్రజ్ఞతతో , కార్యదీక్షతో ముందుకు సాగుతారు.ఆ కోవకు చెందిన అరుదైన రాజకీయ నాయకుల్లో నారా చంద్రబాబు నాయుడు ఒకరు.”అంటూ తన ముందుమాటలో పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు టి.డి.జనార్ధన్ .
అలాగే “చరిత్రలో కొందరు గొప్ప నాయకులు తమ మార్గంలో ఎన్ని అవాంతరాలెదురైనా వాటిని లెక్కచేయకుండా ముందుకు సాగిపోవటం ,ప్రపంచం వారివెంట నడవటం కనిపిస్తుంది.
అటువంటి మహా నేతల్లో నారా చంద్రబాబు నాయుడు ఒకరు.ఆయన తన నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎదురైన సవాళ్ళను,సంక్షోభాలను ఎదుర్కొని వాటినే అవకాశాలు గా మలుచుకున్న తీరు ప్రతి ఒక్కరికి అత్యంత స్ఫూర్తిదాయకం”అంటూ తెలుగు దేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తన ముందుమాటలో అభివర్ణించారు.
ఇలా ప్రముఖుల ప్రశంసలు పొందిన “మహా స్వాప్నికుడు” గ్రంథాన్ని విక్రమ్ పూల ఎంతో కష్టించి, పరిశోధించి, విషయసేకరణచేసి, అనేక వ్యాసాలుగా వింగడించి, విశ్లేషించి, సాధికారిక మైన 208 పేజీల బృహత్ గ్రంథాన్ని వెలువరించడం సాధారణవిషయం కాదు.ఒక్క మాటలో చెప్పాలంటే ఏ యూనివర్సిటీల్లో ఇటువంటి పరిశోధనా గ్రంథం ఇంతవరకూ వెలువడలేదు.
ఇక “మహా స్వాప్నికుడు “అన్న పరిశోధనా గ్రంథంలో ‘పోరాట యోధుడు-కార్యసాధకుడు’ అన్న తొలి వ్యాసంలోనే రచయిత ….
ఆయనొక అవిశ్రాంత పోరాట యోధుడు…
పడినపుడెల్లా ఉవ్వెత్తున లేచిన సముద్రకెరటం…
ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసే ధైర్యశాలి…
నాలుగున్నర దశాబ్దాల ఆయన రాజకీయ ప్రస్థానం ఆద్యంతం సమరశీలం,నిత్యనూతనం,అత్యంత స్ఫూర్తిదాయకం..
భారతదేశంలోనే కాదు…ప్రపంచ రాజకీయ చరిత్ర మొత్తం వెతికినా ఇటువంటి నాయకుడు మరొకరు కనపడరు…
అంటూ కవితాత్మక వాక్యాలతో వ్యాసాన్ని ప్రారంభిస్తారు రచయిత.
అంతేకాదు…అబ్దుల్ కలామ్ వంటి ఆదర్శపురుషుడు దేశానికి రాష్ట్రపతి కావడానికి కారణం అయ్యారని గుర్తుచేశారు.లక్షలాది సామాన్య యువత:ఐ.టి’బాట పట్టి ..ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు పొంది తమ కుటుంబ ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపర్చుకోడానికి దోహదం చేశారని కొనియాడారు.నేడు కొందరు ప్రపంచంలోని అనేక దేశాలలో ఉన్నతోద్యోగాలు చేస్తూ ఉపాధి కల్పించే పారిశ్రామిక వేత్తలు కావడానికి చంద్రబాబుగారి దూరదృష్టే కారణం అంటూ ఈ వ్యాసంలో అనేక విషయాలను పొందుపరిచారు.
అలాగే “బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు”అన్న వ్యాసంలో మనకు తెలియని అనేక అంశాలను పూల విక్రమ్ సాధికారిక స్వరంతో తెలియజేయటం ఆశ్చర్యమనిపిస్తుంది.ఇందులో చంద్రబాబునాయుడి బాల్యం,విద్యాభ్యాసం,విద్యార్థి దశ నుంచే సామాజిక,రాజకీయ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించిన విధానం చక్కగా వివరించారు.అంతేకాదు చంద్రబాబు అతి చిన్న వయసులో తొలి ప్రయత్నంతోనే శాసన సభ్యుడిగా ఎన్నికైన విధానం,మంత్రిగా అవకాశం,మొదలైన అంశాలను కూలంకషంగా చర్చించి వివరించారు .
మూడో చాప్టర్ లో(వివాహం) ఎన్.టి.ఆర్ కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబుకు ఎలా వివాహం కుదిరిందో,చంద్రబాబు నాయుడు తనకు సన్నిహితులైన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుబ్రమణ్యం నాయుడును ,డా.లక్ష్మీనారాయణలను వెంటబెట్టుకొని మద్రాస్ లోని ఎన్టీఆర్ ఇంటికి ఎలా వెళ్ళారో కూడా పేర్కొన్నారు.
పెళ్ళిచూపులు,చంద్రబాబు-భువనేశ్వరిల వివాహం మద్రాస్ లో అంగరంగ వైభవంగా పెళ్ళిజరిగిన విధానం ఈ వ్యాసంలో పొందు పరిచారు.మనకు తెలియని అనేక విషయాలు ఈ వ్యాసంలో విక్రం పూల కూలంకషంగా వివరించారు.
నాల్గో వ్యాసం”ఎమ్మెల్యేగా దైవసాక్షిగా ప్రమాణం”అన్న వ్యాసం చాలా విలువైనది.1978 మార్చి 15 వ తేదీ !నారా చంద్రబాబు నాయుడు మొట్ట మొదటి సారిగా శాసనసభలో అడుగు పెట్టిన విషయంతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు సస్పెన్షన్ విషయం కూడా తెలియజేశారు.
ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి విషయంలో నాటి మంత్రి అమరనాథరెడ్డి, చంద్రబాబునాయుడి వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో చంద్రబాబునాయుడు బలపరిచిన అభ్యర్థి కుతూహలమ్మ విజయం సాధించడం,చంద్రబాబు నాయుడి కార్యదీక్ష ,రాజకీయ చతురత ఏమిటో రాష్ట్రం నలుమూలలా తెలియటం ,ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సస్పెన్షన్ ఎత్తివేయడం మొదలైన అంశాలు రచయిత ఈ వ్యాసంలో సమగ్రంగా వివరించారు.
ఇక “తెలుగుదేశం ఆవిర్భావం-ఎన్నికలలో ఘన విజయం”
“1984 ఆగస్టులో నాదెండ్ల తిరుగుబాటు”
ఈ రెండు వ్యాసాలు ప్రత్యేకమైనవి.ఎన్టీఆర్ ప్రభుత్వం బర్త్ రఫ్ -ప్రజాస్వామ్య పరిరక్షణలో చంద్రబాబు కీలక భూమిక”
మొదలైన విషయాలు రచయిత దృశ్యాలు దృశ్యాలుగా మన కళ్ళముందు ఆవిష్కరించారు.
ఇంకా ఈ పుస్తకంలో
“తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీకి నేతృత్వం”
“సి.ఎం.గా పగ్గాలు…తొలినాళ్ళ సవాళ్ళు”
“పూలదండలకు ,సన్మానాలకు స్వస్తి,రాజకీయాల్లో నూతన ఒరవడి’
“చరిత్ర సృష్టించిన పథకాలు”
“రెండో దశ సంస్కరణలకు ఆద్యుడు…
రాష్ట్రం దిశ,దశను మార్చిన సంస్కరణలు,పథకాలు”
“విజన్ -2020 కి రూపకల్పన”
“హస్తినలో కింగ్ మేకర్”
“హైదరాబాద్ లో మైక్రోసాప్ట్ ఏర్పాటు”
“హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ వృద్ధికి దోహదం”
“అలిపిరిలో పునర్జన్మ”
“చరిత్రపై చంద్రబాబు చేవ్రాలు’
మొదలైన వ్యాసాలు ఎంతో విషయపుష్టితో,చారిత్రక సత్య దృష్టితో,అరుదైన పరిశోధకసంతుష్టితో, విశ్లేషనాత్మకంగా రాసి ఒక పుస్తకంగా వెలువరించిన విక్రమ్ పూల కృషి అసామాన్యం. అపూర్వం. అద్భుతం.
అసాధ్యాలను సుసాధ్యం చేయడం గొప్ప నాయకులకే సాధ్యం.అంటూ చంద్రబాబు 1998 లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి)ని హైదరాబాద్ కు రప్పించిన విధానాన్ని రచయిత “ఐ.ఎస్.బి చంద్రబాబు ఘనతే”అనే వ్యాసంలో వివరించిన తీరు చంద్రబాబు కృషిని అద్భుతంగా ఆవిష్కరించింది.
ఇక పాలనా రంగంలోనే కాక పార్టీ అధ్యక్షుడుగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఏవిధంగా తీర్చిదిద్దారో,పార్టీ నేతలను ,కార్యకర్తలను ఏవిధంగా తీర్చిదిద్దారో, కూడా సమగ్రంగా వివరించారు.
ఎన్.టి.ఆర్ స్మృతులను శాశ్వతం చేస్తూ చేపట్టిన కార్యక్రమాలతో పాటు ,కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వెంగళరావు, బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిల పేర్లతో పార్కులు,వివిధ సంస్థలు ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు పయనించిన మార్గాన్ని వివరించడం చంద్రబాబు ఔన్నత్యాన్ని ఎత్తి చూపుతుంది.
రచయిత విక్రమ్ పూల తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ అనుబంధం కలిగి ఉండటం,పార్టీ సంస్థాగత పత్రిక “తెలుగుదేశం”పక్షపత్రికను అనేక సంవత్సరాలపాటు ఎడిటర్ గా నిర్వహించడంతో ఇందులోని అంశాలను సాధికారతతో,పరిశోధక కోణంలో, సమగ్రసమాచారంతో రాయగలిగారు. సహజంగా సీనియర్ జర్నలిస్టు కావడం చేత విక్రమ్ పూలకు వ్యాసం ఎలా మొదలు పెట్టాలో,ఎలా కొనసాగించాలో,ఎలా ముగించాలో బాగా తెలుసు.
అంతేకాదు సరళమైన వాడుకభాషలో సంక్లిష్టవాక్యనిర్మాణం లేకుండా అందరికీ అర్థమయ్యేలా రాయడం ఆయన శైలీవిన్యాసచతురతనే చెప్పవచ్చు..అందుకే ప్రతి వ్యాసం ఆసక్తిదాయకంగా,పాఠకులను రెప్పార్పకుండా చదివించేలా…ఉంది.
అందమైన బొమ్మలతో,మంచి డిజైనింగ్ తో “మహా స్వాప్నికుడు” పుస్తకాన్ని విక్రమ్ పూల రూపొందించి మనకందించారు. చంద్రబాబుపై అనేక పుస్తకాలు వచ్చినప్పటికి “మహాస్వాప్నికుడు”ఒక ప్రామాణిక గ్రంథంగా చరిత్రలో నిలిచిపోతుంది.ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదివి తీరాలి.ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి,విశేష కృషి చేసి ఇంతటి అపూర్వ పరిశోధనా గ్రంథాన్ని వెలువ రించిన విక్రమ్ పూల అభినందనీయుడు.
-డా.బిక్కి కృష్ణ
(రచయిత కవి,సీనియర్ పాత్రికేయుడు)
సెల్:8374439053