* కొత్త స్టేడియం నిర్మాణంకు త్వరలో ప్రభుత్వంతో చర్చలు
* తొలి దశలో రెండు మూడు జిల్లా కేంద్రాల్లో స్టేడియాలు కట్టేందుకు చర్యలు
* క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ నియామకంపై కసరత్తు
* పెండింగ్ ఆడిట్లకు మోక్షం
* బీసీసీఐ నుంచి నిధుల రాకకు లైన్‌క్లియర్
* ఈనెల 8 నుంచి డొమిస్టిక్ క్రికెట్ సీజన్ ప్రారంభం
* మహిళల లీగ్ క్రికెట్‌కు రూట్ మ్యాప్
హైదరాబాద్: బీసీసీఐ సహకారంతో రాష్ట్రంలో క్రికెట్ సర్వతోముఖాభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కొన్ని విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుంది. ఆదివారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, కార్యదర్శి దేవ్‌రాజ్, కోశాధికారి సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునిల్ అగర్వాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణ క్రికెటర్ల శ్రేయస్సు, ప్రగతిని దృష్టిలో పెట్టుకుని హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్‌ను నియమించేందుకు ఆయనతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు తగ్గట్టు త్వరలో కొత్త అంతర్జాతీయ స్టేడియం నిర్మించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరపనున్నామని, సర్కార్ భూమిస్తే సులభంగా కట్టవచ్చు అన్నారు.
అలానే రెండు, మూడు జిల్లా కేంద్రాల్లోనూ స్టేడియాల నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నామని, టెండర్లు పిలిచి మహబూబ్‌నగర్ స్టేడియంలో టర్ఫ్ వికెట్, నిజామాబాద్ స్టేడియంకు చుట్టు ఫెన్సింగ్ వేయనున్నామని తెలిపారు.
జూలై 8 నుంచి డొమిస్టిక్ సీజన్ ప్రారంభం
ఈనెల 8 నుంచి డొమిస్టిక్ క్రికెట్ షెడ్యూల్ ప్రారంభమవనుందని కార్యదర్శి దేవ్‌రాజ్ చెప్పారు. అలానే మహిళల లీగ్ క్రికెట్‌ను కూడా ప్రారంభించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మించే ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. కొత్త కోచ్‌లు, అంపైర్లు, గ్రౌండ్స్‌మెన్, స్కోరర్ల ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టనున్నామని దేవ్‌రాజ్ తెలిపారు.
పెండింగ్ ఆడిట్లకు మోక్షం
2018 నుంచి పెండింగ్‌లో ఉన్న ఆడిట్లను ఆమోదించామని జగన్ మోహన్ రావు తెలిపారు. ఇవి బీసీసీఐకి పంపిస్తే, బీసీసీఐ నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు కూడా రిలీజ్ అవుతాయని చెప్పారు. ఇక, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ఒక కమిటీని వేశామని, ఇందులో అపెక్స్ కౌన్సిల్ నుంచి ఒకరు, ఏజీ నుంచి ఒకరు, ఒక న్యాయవాది ఉంటారని చెప్పారు. వీరు విచారించి, బిల్లులు చెల్లింపులు చేస్తారని జగన్ మోహన్ రావు తెలిపారు.