* ఆసుపత్రికి వెళ్లనీయకుండా తలిదండ్రులను ఆపివేసిన పోలీసులు
* దానితో చికిత్స అందక శిశువు అక్కడే మృతి
* పోలీసులను నిలదీసిన తలిదండ్రులు
*దళితుల ధర్నాలతో దద్దరిల్లిన కల్యాణదుర్గం
( మార్తి సుబ్రహ్మణ్యం)
కొత్తగా వచ్చిన మంత్రిగారి ముందు మార్కులు వేయించుకునే పోలీసుల అత్యుత్సాహం ఒక దళిత శిశువు మరణానికి కారణమయింది. చావుబతుకుల్లో ఉన్న ఏడాది శిశువును చికిత్స కోసం, ఆసుపత్రికి తీసుకువెళదామన్న తలిదండ్రుల ఆత్రుతను పోలీసులు నిలువరించారు. అలా గంటలపాటు పోలీసుల నిలిపివేత నేపథ్యంలో, పరిస్థితి విషమించిన శిశువు చివరకు అక్కడే తుది శ్వాస విడిచింది. కల్యాణదుర్గం నియోజకవర్గంలోని, శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన గణేష్-ఈశ్వరమ్మ దళిత దంపతులకు, ఏడాది క్రితమే చిన్నారి జన్మించింది. అయితే శుక్రవారం హటాత్తుగా ఆ చిన్నారికి అస్వస్థతగా ఉండటంతో వారు ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు బయలుదేరారు.
కానీ, మంత్రిగా ఇటీవలే ప్రమాణస్వీకారం చేసిన ఉషశ్రీ తొలిసారిగా ఆ దారిలో నియోజకవర్గానికి వస్తున్నారు. ఆ మేరకు వైసీపీ కార్యకర్తలు ఆ దారిలో హంగామా చేశారు. పోలీసులు కూడా మేడమ్ గారి రాకకోసం ట్రాఫిక్ నిలిపివేశారు. అందులో చిన్నారి కూడా ఇరుక్కుపోయింది. తమ చిన్నారిని ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు దారి విడిచిపెట్టాలని తలిదండ్రులు ప్రాధేయపడినా, నిబంధనల పేరిట పోలీసులు నిరాకరించారు. అటు పోలీసులతో వాదులాడలేక, ఇటు కన్నబిడ్డను ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్న కన్నపేగు ఆరాటంతో.. పాపం ఆ తలిదండ్రులు నలిగిపోయి, అలసిపోయారు. చివరాఖరకు ఆ చిన్నారి ఆసుపత్రికి చేరుకోకుండానే కన్నుమూసింది.
కాగా ఈ ఘటనతో దళిత సంఘాలు పోలీసుల తీరుపై విరుచుకుపడ్డాయి.చిన్నారి తలిదండ్రులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ‘ప్రాణాపాయంలో ఉన్న దళితులయినా, మరో కులానికి చెందిన
వారినయినా రక్షించాల్సిన పోలీసులు, మంత్రి రాక కోసం ఆసుపత్రికి వెళ్లనీయకుండా అడ్డుకోవడం అమానవీయం. చిన్నారి మృతికి కారణమైన పోలీసులను సస్పెండ్ చేసేవరకూ మా పోరాటం ఆగద’ని రోడ్డుపై బైఠాయించారు. తమను ఆపడానికి అడ్డం వచ్చిన నిబంధనలేమిటి? పోయిన మా చిన్నారి
ప్రాణాన్ని మీరు తిరిగి తీసుకువస్తారా? అంటూ తలిదండ్రులు పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ వార్త తెలిసిన దళిత సంఘాలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనితో కల్యాణదుర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.