ఒంగోలు నుండి ఒక పెద్దాయన, వెంకటసుబ్బయ్య గారు ఫోన్ చేసి శాసనసభ సమావేశాల నిర్వహణకు ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఈ తరహా సమావేశాల వల్ల సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అని అడిగారు. రెండు ప్రశ్నలు చాలా చిన్నవే. కాకపోతే, వాటికి సమాధానాలే దొరకవు.
నాకు ఒకటి స్పష్టంగా కనబడింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకపాత్రాభినయానికి వేదికగా శాసనసభ మారిపోయింది. వివిధ అంశాలపై చర్చ జరిగినట్లు చెప్పబడుతున్న స్వల్పకాలిక చర్చల్లో ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రసంగాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ గమనిస్తే వాటి కోసమే ఈ తంతు జరిగినట్లు అనిపించింది. ఆయన బుర్రలో వచ్చిన ఆలోచనలు, 21 బిల్లుల రూపంలో సభలో ప్రవేశ పెట్టబడ్డాయి. వాటిపై చర్చే లేకుండా బల్లలు చరిచి ఆమోదించుకొన్నారట.
26 గంటలకుపైగా సమావేశాలు నిర్వహించారట. అంటే రోజుకు ఐదు గంటలు గౌరవ శాసనసభ్యులు సమావేశాల్లో పాల్గొనడం గమనార్హం. ప్రతిపక్ష సభులను ఐదు రోజులూ క్రమం తప్పకుండా సస్పెండ్ చేసి రికార్డు సృష్టించారట. సభకు హాజరుకాని సభ్యులను కూడా ఒక రోజు జాబితాలో చేర్చి సస్పెండ్ చేసినట్లు ప్రసారమాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఆహా! ఎంత ఉన్నతంగా, హుందాగా, ప్రజాస్వామ్యయుతంగా చట్ట సభ నిర్వహించబడిందో కదా! అని ప్రజాస్వామ్యవాదులు ముక్కున వేలేసుకున్నారు.
మొదటి రోజు, “వికేంద్రీకరణే మా విధానం, రైతులు సాగిస్తున్న ఉద్యమం పెత్తందారుల ఉద్యమం” అంటూ ప్రాంతీయ – కులపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే దోరణిలో ముఖ్యమంత్రి ప్రసంగించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అమరావతే రాజధాని – మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణ పనులను ఆరు నెలలల్లో పూర్తి చేయాలంటూ ఆరు నెలల క్రితం హైకోర్టు ఇచ్చిన తీర్పుకు పూర్తి భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తూ శాసనసభను రక్షణ కవచంగా వినియోగించుకొని ఆ ప్రసంగం చేశారు.
దాదాపు 30,000 రైతు కుటుంబాలు తమకు జీవనాధారమైన 34,000 ఎకరాల సారవంతమైన భూములను రాజధాని నిర్మాణానికి భూసమీకరణ చట్టం ప్రకారం ఇచ్చిన రైతులు, మహిళలు, దళితులు వెయ్యి రోజులకుపైగా అవిశ్రాంత ఉద్యమంచేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా “నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు”, అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, పెత్తందారీ వైఖరిని ఎండగడుతూ నేడు సాగిస్తున్న మహాపాదయాత్రపై కక్ష పూరిత వైఖరితో మాట్లాడారు. ఆ మరుసటి రోజే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. తద్వారా, అమరావతి నిర్మాణ పనులను చేపట్టనని, వచ్చే ఎన్నికల అజెండాలో మూడు రాజధానుల అంశం ఉంటుందని చెప్పకనే చెప్పారు.
రెండవ రోజు, “రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేష్” అంటూ జబ్బలు చరుచుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతన సవరణ కోరినప్పుడు మాత్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదని ముఖ్యమంత్రిగారే బహిరంగంగా తెలియజేశారు. ఇప్పుడేమో ఆర్థిక పరిస్థితి “భేష్” అంటున్నారు. రిజర్వ్ బ్యాంకు నుంచి 2021-22 ఆర్థిక సం.లో 305 రోజులు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, 283 రోజులు వెస్ అండ్ మీన్స్, 146 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ వినియోగించుకున్నదని, ఈ మూడు రూపాల్లో అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో అంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచిందని ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఇండియా లిమిటెడ్ వెల్లడించింది. రాష్ట్రంపై ఉన్న రుణ భారంపై నిజాయితీతో, జవాబుదారీతనంతో వాస్తవాలు వెల్లడించారా! అంటే అదీ లేదు. అర్థసత్యాలతో కూడుకొన్న లెక్కలే వినిపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని “మసిబూసి మారేడు కాయ” చేసే విఫలప్రయత్నం చేశారు.
మూడో రోజు, పోలవరం డయాప్రంవాల్ ధ్వంసం కావడానికి చంద్రబాబు అసమర్థతే కారణమంటూ తీర్పు చెప్పారు. ఆయన ఎం.ఎల్.ఏ.గా ఉండడానికి కూడా అనర్హుడంటూ అసంబద్ధమైన, అత్యంత గర్హనీయమైన వ్యాఖ్యలు చేశారు. డయాప్రంవాల్ ధ్వంసం కావడానికి దారితీసిన కారణాలపై కేంద్ర జల సంఘం(సిడబ్లూసీ), డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్(డిడిఆర్పీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పిపిఏ) నిష్పాక్షికంగా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుదేల్చి, బాధ్యులను నిర్ధారించాలి. ఎవరు బాధ్యులైతే వారి నుండి నష్టాన్ని రికవరీ చేయాలి.
ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. పోలవరం జాతీయ ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం “ఫెసిలిటేటర్” మాత్రమే. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రయోజనాలను త్వరితగతిన రాష్ట్రానికి వనగూడెలా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుండి డబ్బు వెచ్చించి, త్వరితగతిన నిర్మాణం జరిగేలా కృషి చేస్తూ, కేంద్ర ప్రభుత్వం నుండి చేసిన వ్యయాన్ని తిరిగి వసూలు చేసుకొనే బాధ్యత నిర్వర్తిస్తున్నది. చంద్రబాబు లేదా జగన్ పోలవరం నిర్మాణం చేయడం లేదు. కేంద్ర జల సంఘం(సిడబ్లూసీ), డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్(డిడిఆర్పీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పిపిఏ) అనుమతితోనే నిర్మాణం జరుగుతున్నది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతిపై విచారణలు, నవయుగ సంస్థను తొలగించి మెగా కృష్ణారెడ్డి సంస్థకు కాంట్రాక్టును అప్పగించడం, పర్యవసానంగా నిర్మాణంలో ఆలస్యం, సమన్వయ లోపం, కోవిడ్ ప్రభావం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అలసత్వం, వగైరా అంశాలన్నింటినీ నిశితంగా పరిశీలించాలి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సాంకేతిక సలహా మండలి ఆమోదించిన డిపిఆర్ -2 కు మూడున్నర ఏళ్ళు గడిచినా మోడీ ప్రభుత్వం దానికి ఆమోదం తెలియజేయకుండా మోకాలడ్డి కూర్చున్నది.
పర్యవసానంగా నిధుల సమస్య అతిపెద్ద సమస్యగా తయారయ్యింది. పునరావాస పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూర్చడం లేదు. ఈ కారణాలన్నింటి పర్యవసానంగా పోలవరం నిర్మాణం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. చట్ట సభలో ఈ అన్ని కోణాల్లో చర్చ చేసి ఉంటే ప్రయోజనకరంగా ఉండేది. అలా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో ఈ విషయాలను ప్రస్తావన కూడా చేయలేదు. పోలవరం పట్ల మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సద్విమర్శ కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా! అనిపించింది. చంద్రబాబుపై నిందారోపణలుచేస్తూ కాలం వెళ్ళబుచ్చడం అత్యంత గర్హనీయం కాదా!
అదే రోజు, పారిశ్రామిక రంగం ఉరకలు – పరుగులు తీస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గడచిన మూడేళ్లలో పారిశ్రామికాభివృద్ధి – ఉపాధి కల్పనకు సంబంధించిన ఆనవాళ్ళే కనపడడం లేదు. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులతో రాష్ట్రానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారన్న భ్రమలు కొల్పే రీతిలో ప్రగల్భాలతో తియ్యటి మాటలు వినిపించారు. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం ఏ దుస్థితిలో ఉన్నదో నిజాయితీగా వెల్లడించలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచబడిన కడప ఉక్కు కర్మాగారంపై మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న దగాకోరు విధానం ప్రస్తావనాలేదు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీల సంగతేంటో చెప్పలేదు. పారిశ్రామికాభివృద్ధికి ఊతం ఇస్తుందనుకొన్న ప్రత్యేక తరగతి హోదా అంశమూ ప్రస్తావించలేదు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు సాగిస్తున్న ఆందోళన నేపథ్యంలో మోడీ ప్రభుత్వం దూకుడును నిలవరింప చేయడానికి ఏం చేస్తారో మాట వరసకు కూడా చెప్పలేదు. గంగవరం పోర్టులో ఉన్న దాదాపు 11 శాతం వాటాలను ఆదానీ కంపెనీకి అమ్మి , సొమ్ము చేసుకొన్నారు. కరవు పీడిత రాయలసీమ, వెనుకబడ్డ ఉత్తరాంధ్ర లేదా రాష్ట్రంలో ఎక్కడైనా 500 మందికి సంఘటిత రంగంలో ఉపాధి కల్పించిన పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి గడచిన మూడేళ్ళలో నెలకొల్పబడిందేమో చూపెట్టే పరిస్థితి లేదు. మరి, ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు చెప్పండి!
నాలుగవ రోజు, “విద్యా, వైద్య రంగాల్లో నాడు – నేడు”పై చర్చలో “చదువుతోనే వెలుగు” అంటూ హితబోధ చేశారు. ఎవరు కాదనలేని సందేశం. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది కొరత తీవ్రాతితీవ్రమైన సమస్య. దానిపై దృష్టే లేదు. విద్యా ప్రమాణాలు ఎలా పెరుగుతాయి చెప్పండి!
ఐదవ రోజు, వ్యవసాయం – అనుబంధ రంగాలపై స్వల్ప కాలిక చర్చలో “సాగుకు దన్ను”గా ప్రభుత్వం నిలిచిందని నొక్కివక్కాణించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల రైతులకే మేలు జరుగుతుందని నమ్మబలికారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరలు కూడా లభించడంలేదని, వ్యవసాయం చేసి అప్పుల ఊబిలో కూరుకపోతున్నామని, కరవు పీడిత రాయలసీమ ప్రాంతంలో కూడా ఇటీవల చెరువుల్లోకి నీళ్ళు వచ్చి చేరినా వరి పంట సాగు చేయలేదు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయం రంగంపై సమగ్ర చర్చ చేసే ధైర్యమే ప్రభుత్వంలో కొరవడింది.
“ఎన్టీఆర్ గొప్పతనాన్ని సంపూర్ణంగా నమ్ముతున్నాం” అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూనే “ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్” పేరును “డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్”గా మారుస్తూ బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించుకొన్నారు. “నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరించినట్లు” నానుడిగా వ్యవహరించారు. తద్వారా పైశాచికానందం పొందవచ్చేమో! గానీ ప్రజా ప్రయోజనం గుండు సున్నా. సంకుచిత మనస్తత్వంతో “పేర్ల” చుట్టూ రాజకీయ వైషమ్యాలకు ఆజ్యం పోయడం సమాజానికి మేలు చేకూర్చదు. ప్రజాధనంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అన్నింటికీ అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ ముఖ్యమంత్రి తన, తన తండ్రి పేర్లు పెట్టడం అత్యంత జుగుప్సాకరంగా ఉన్నది. ప్రభుత్వం మారిన మరుక్షణం ఇవన్నీ కనుమరుగై పోతాయన్న వాస్తవాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తే ఉచితంగా ఉంటుందేమో!