– మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్
రాష్ట్రంలో భయోత్పాత పరిపాలన సాగుతోందని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా అవనిగడ్డలో పాదయాత్ర నిర్వహించారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ దుష్ట పరిపాలన తరిమికొట్టి టీడీపీతో ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు గుర్తించారన్నారు.
లోకేష్ పాదయాత్ర యువతకు భరోసా అందిస్తోందన్నారు. వైసీపీ ప్రజలకు స్వయం ఉపాధి మార్గాలు చూపట్లేదన్నారు. నాలుగేళ్ళలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు లేవని, యువతకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటం లేదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య ప్రతి ఏటా తగ్గిపోతోందనీ, టీడీపీ గెలిచి ఉంటే పింఛన్ మొదటి ఏడాదిలోనే రూ.3వేలు అయ్యేదన్నారు.
మూడు వేలు పింఛన్ హామీ జగన్ ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. వైసీపీ సృష్టించిన భయోత్పాత వాతావరణం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని, ప్రజలు భయవిముక్తులై వైసీపీ దుష్ట పరిపాలన తరిమి కొట్టాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.