-కేంద్రప్రభుత్వం, మానవహక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలి
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే దళితులపై వరుసదాడులు కొనసాగుతున్నాయి. దళితులపై దాడులకు పాల్పడిన అరాచకశక్తులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం అలసత్వం వహించడమే ఇందుకు నిదర్శనం. తాజాగా ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురంలో దళితుడైన నిప్పుల కోటేశ్వరరావు కుటుంబంపై వైసిపికి చెందిన ముత్తారెడ్డి తీవ్రంగా అవమానించి దాడికి పాల్పడటం దారుణం.
కులంపేరుతో ముత్తారెడ్డి తనను దూషించాడని పోలీసులకు బాధితుడు కోటేశ్వరరావు ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోకపోవడం, దాడి తర్వాత బాధిత కుటుంబానికి వైద్యం అందించేందుకు సైతం నందిగామ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిరాకరించడాన్ని గమనిస్తే జగన్ ప్రభుత్వ అండదండలతోనే దళితులపై దమనకాండ కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
కంచికచర్లలో దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ పై మూత్రంపోసి అవమానించి, చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో బాధ్యులపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదుచేయడాన్ని పరిశీలిస్తే దళితులపై జరుగుతున్నవన్నీ ప్రభుత్వ ప్రాయోజిత దాడులేనని స్పష్టమవుతోంది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అరాచకపర్వంపై కేంద్ర ప్రభుత్వం, జాతీయ మానవహక్కుల కమిషన్ జోక్యం చేసుకొని దళితులకు రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.