సిబిఐ విచారణకు లైన్ క్లియర్
హైకోర్టు తీర్పుపై స్టే కు నిరాకరించిన సుప్రీంకోర్టు
విచారణ పూర్తి అయ్యేంతవరకు అరెస్టుల వద్దన్న అభ్యర్ధన తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
హైకోర్టు తీర్పు అమలు తప్పని స్ధితి
కేసు నమోదుకు సన్నద్దం అవుతున్న సిబిఐ
తదుపరి విచారణ ఈ నెల 27వ తేదికి వాయిదా
(వేముల సత్యనారాయణ)
ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక మలుపు చోటుచేసుకొంది.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై తక్షణమే స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది..తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై శుక్రవారం జరిగిన విచారణలో కీలకపరిణామాలు చోటుచేసుకున్నాయి..ఈ పిటిషన్ విచారణ కొనసాగుతున్నంత వరకు కనీసం అరెస్టు లు చేయవద్దని సిబిఐను ఆదేశించాలన్న తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది అభ్యర్ధనపై సుప్రీంకోర్టు స్పందించలేదు..సిబిఐను తాము కంట్రోల్ చేయబోమంటూ తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రాల ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ పిటీషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్నది..
ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్లూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల కేసు సీబీఐ చేతికి వెళ్తే ఉపయోగం ఉండదని, ఇప్పటి వరకు జరిగిన విచారణ అంతా… పక్కదారి పడుతుందని ఈనెల 7, 8 తేదీల్లో జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, సిద్ధార్థ లుత్రాలు ప్రత్యేకంగా వాదనలు వినిపించారు. వెంటనే హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని న్యాయస్ధానాన్ని కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది.
సీబీఐ అధికారులు కేసు పత్రాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని, స్టేటస్ కో ఇవ్వాలని గత వారం తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు సీజేఐకు విజ్ఞప్తి చేశారు. ఒకసారి సీబీఐ చేతికి వెళితే… కేసు వెనక్కి రావడం కష్టం అవుతుందన్నారు. వాదనలు విన్న అనంతరం స్టేటస్ కో ఇవ్వడానికి కూడా ధర్మాసనం నిరాకరించింది. కేసులో మెరిట్స్ ఉంటే రివర్స్ చేస్తూ ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం పేర్కొంంది..ఇదిలా ఉండగా ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు చేసిన అభ్యర్ధనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు..
మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో నమోదైన ఎమ్మేల్యేల ఎర కేసు ఫైళ్లను తమకు అప్పగించాలంటూ సిబిఐ రాస్తున్న లేఖలు ఇన్నాళ్లు బుట్టదాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజా పరిణమాలతో ఉలిక్కిపడింది..ఇక, కేసు ఫైళ్లను సిబిఐకి తప్పనిసరిగా సిబిఐకి అప్పగించాల్సిన పరిస్థితి ఎదురవడంతో మరోసారి న్యాయనిపుణులతో చర్చలు ప్రారంభించారు ప్రభుత్వ పెద్దలు.
సీబీఐ కేసు నమోదు చేస్తే మాత్రం తొలి విచారణ పైలట్ రోహిత్ రెడ్డి.నందకుమార్ల నుంచే ప్రారంభం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి..తీగలాగితే డొంకకదిలినట్లు సీఎం కేసీఆర్ వరకు సిబిఐ విచారణ చేరవచ్చని ఇప్పటికే ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు..ఎమ్మెల్యేలకు ఎర కేసులో కర్త,కర్మ,క్రియ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే ఆరోపించారు