Suryaa.co.in

Andhra Pradesh

ఏడు కొండలు.. ఏడు అగరబత్తుల బ్రాండ్లు.. విక్రయం ప్రారంభం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉప‌యోగించిన పుష్పాల‌తో ప‌రిమ‌ళాలు వెదజల్లే అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకువచ్చారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో అగరబత్తుల విక్రయాన్ని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి ప్రారంభించారు. శ్రీనివాసుని ఏడుకొండ‌ల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్లతో వీటిని తీసుకొచ్చారు. ఈ బ్రాండ్ల పేర్లు.. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో వీటిని విక్రయించనున్నారు. వీటి తయారీకి దర్శన్‌ ఇంటర్నేషన్‌ సంస్థ, వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీతో తితిదే ఒప్పందం కుదుర్చుకుంది.
ఆలోచనకు పునాది పడింది ఇలా : తితిదే ఆలయాల్లో పూజ‌లు, అలంక‌ర‌ణ‌ల‌కు రోజూ పుష్పాలు వినియోగిస్తున్నారు. పర్వదినాలు, ఉత్సవాల స‌మ‌యంలో అయితే పుష్పాల వినియోగం మ‌రింత అధికంగా ఉంటుంది. దేవతామూర్తులకు ఉప‌యోగించిన పుష్పాల‌న్నీ మ‌రుస‌టిరోజు ఉద‌యం తొల‌గిస్తారు. దీంతో స్వామివారి సేవ‌కు వినియోగించిన ఈ పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉప‌యోగించే విష‌యంపై తితిదే బోర్డు వినూత్న ఆలోచన చేసింది.
ఈ క్రమంలో బెంగ‌ళూరు కేంద్రంగా పనిచేస్తున్న దర్శన్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ తితిదే ఆల‌యాల్లో రోజువారీగా వినియోగించిన పుష్పాల‌ను అందిస్తే లాభంతో సంబంధంలేకుండా అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఆ సంస్థతో తితిదే అవగాహన కుదుర్చుకొని ఎస్వీ గోశాల‌లో అగ‌ర‌బ‌త్తుల త‌యారీకి అవ‌స‌ర‌మైన స్థలం కేటాయించింది. దర్శన్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ సొంత ఖ‌ర్చుతో యంత్రాలు, సిబ్బందిని నియ‌మించుకుని అగ‌ర‌బ‌త్తుల ఉత్పత్తిని ప్రారంభించింది.

LEAVE A RESPONSE