-విశాఖ శారదా పీఠానికి గతంలో 15 ఎకరాల స్థలం కేటాయించిన జగన్
-దానిని రద్దు చేస్తూ కూటమి సర్కారు ఉత్తర్వు జారీ
-తిరుమలపై నిర్మాణాలపైనా విచారణకు ఆదేశం
-జగన్గురువుకు కూటమి సర్కారు ఝలక్
-ఫలించని మంత్రి రాయబారం
విశాఖ: జగన్గురువు విశాఖ పీఠాథిపతి స్వరూపానంద స్వామికి.. విశాఖలో జగన్ సర్కారు ఇచ్చిన 15 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. 220 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్ధలాన్ని కేవలం 15 లక్షల రూపాయలకే ఇవ్వడం వివాదంగా మారింది.
ఈ నేపథ్యంలో విచారణ జరిపిన కూటమి ప్రభుత్వం, ఆ భూములను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా పీఠానికి కేటాయించిన భూములను రద్దు చేయకుండా, ఓ మంత్రి చేసిన ప్రయత్నాలు ఫలితంచలేదు.
విశాఖ శారదా పీఠానికి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ. 220 కోట్లు అయితే… కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చింది.
కూటమి ప్రభుత్వ వచ్చాక ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా స్థలం అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. దాంతోపాటే, తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది.