– సిఎస్. డా.సమీర్ శర్మ
అమరావతి,26 జూలై: రాష్ట్రంలో అవినీతి నిరోధానికి సంబంధించి ఎసిబి రూపొందించి అమలులోకి తెచ్చిన 14400 కాల్ సర్వీసులకు సంబంధించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వీలుగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 3 X 5 అడుగుల సైజుతో కూడిన డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
మంగళవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు నుండి ఎసిబి 14400 కాల్ సర్వీసులు మరియు దానిపై రూపొందించిన యాప్ గురించి సిఎస్ వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతిని అంత మొందించే లక్ష్యంతో ఆర్టీజిఎస్ సహకారంతో ఎసిబి ఆధ్వర్యంలో ‘14400’తో కూడిన కాల్ సర్వీసులు మరియు యాప్ ను రూపొందించగా దానిని జూన్ మాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతిని ప్రభుత్వం దృష్టికి, అదే విధంగా అవినీతి నిరోధకశాఖ దృష్టికి తీసుకు వచ్చేందుకు ఈయాప్ ఉపయోగ పడుతుందని కావున ప్రజలు ఎక్కడైనా అవినీతి జరిగితే వెంటనే తెలియజేసేందుకు కృషి చేయాలని చెప్పారు.
’చేయి చేయి కలుపుదాం అవినీతి భూతాన్ని తరిమివేద్దాం-లంచం ఇవ్వడం,తీసుకోవడం నేరం’ అనే నినాదంతో ఎసిబి రూపొందించిన ఈ 14400 యాప్ పై ప్రజలందరికీ విస్తృతంగా తెలిసే విధంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రముఖ స్థలంలో 3 X 5 సైజుతో కూడిన డిస్ప్లే బోర్డులను 15రోజుల్లోగా ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు. ఈ విషయంలో ఆయా శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి సారించి త్వరిత గతిన ఏర్పాటు చేయాలని అన్నారు.
ముఖ్యంగా గ్రామ స్థాయిలోని అన్ని గ్రామ పంచాయితీలు,గ్రామ సచివాలయాలు,మండల స్థాయిలో తహసిల్దార్, ఎండిఓ,సబ్ రిజిష్ట్రార్ తదితరకార్యాలాయాలు,డివిజన్ స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సహా జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను ఈడిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఆదేశించారు.
ఎసిబి 14400 యాప్ ను ప్రజలు గూగుల్ ప్లే స్టోర్ నుండి రిజిష్టర్ మొబైల్ నంబరుతో డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ చెప్పారు.
ఈ యాప్ లో రెండు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయని అవి లైవ్ రికార్డు ఆడియో,పొటో లేదా వీడియో సౌకర్యం కలిగి ఉండి వెంటనే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. మరో ఫీచర్ వీడియోలు,పొటోలు, డాక్యుమెంట్లు,ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు వీలైన సౌకర్యం ఉందని తెలిపారు.ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత మొబైల్ కు ఆ ఫిర్యాదుకు సంబంధించిన రిఫెరెన్సు వస్తుందని చెప్పారు. కావున ఏ ప్రభుత్వ అధికారైనా ఎక్కడైనా లంచం అడిగితే వెంటనే ఈయాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఎసిబి సకాలంలో చర్యలు తీసుకుంటుందని సిఎస్ పేర్కొన్నారు.
అంతకు ముందు వీడియో లింక్ ద్వారా పాల్గొన్న ఏసీబీ డైరెక్టర్ అశోక్ కుమార్ 14400 కాల్ సర్వీసుల యాప్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ 2019 నవంబరు 25న 14400 కాల్ సర్వీసును,14400 మొబైల్ యాప్ ను 2022 జూన్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రారంభించారని చెప్పారు.
ఈ కాల్ సర్వీసులు కింద 2019లో 5114 కాల్స్ రాగా,2020లో 67,427 కాల్స్,2021లో 45,990 కాల్స్ వచ్చాయని వివరించారు. అదే విధంగా 2022లో ఇప్పటి వరకూ 31,419 కాల్స్,మొబైల్ యాప్ ద్వారా 1925 ఫిర్యాదులు వచ్చాయని సిఎస్ కు వివరించారు. ఇప్పటి వరకూ 14400కు వచ్చిన మొత్తం కాల్స్ లక్షా 49వేల 950 కాగా వాటిలో 8వేల 842 ఎసిబికి సంబంధించినవి కాగా 90వేల 715 ఎసిబి యేతర సంబంధిత కాల్స్ అని తెలిపారు.
అలాగే 8వేల 764 వేగ్ మరియు టెస్ట్ కాల్స్ అని మరో 15వేల 337 కాల్స్ గ్రీవియెన్స్ రిజిష్ట్రేషన్ కన్ఫర్మేషన్ మరియు స్టేటష్ చెక్ కాల్స్ కాగా మిగతా 26వేల 292 ఎసిబి కాల్ సెంటర్ పనితీరుకు సంబంధించిన ఎంక్వయిరీ కాల్స్ అని అశోక్ కుమార్ సిఎస్ కు వివరించారు.
ఎసిబి కాల్ సెంటర్ కు వచ్చిన 8,842 కాల్స్ లో ఎసిబికి సంబంధించిన 8687 ను ఇప్పటి వరకూ పరిష్కరించగా నాన్ ఎసిబికి సంబంధించి గత మే నుండి ఇప్పటి వరకూ వచ్చిన 1261 లో 943 పరిష్కరించినట్టు చెప్పారు.
అలాగే జూన్ 1నుండి ప్రారంభమైన 14400 మొబైల్ యాప్ కు సంబంధించి ఇప్పటి వరకూ 276 ఫిర్యాదులను గాను 98పరిష్కరించినట్టు అశోక్ కుమార్ సిఎస్ కు వివరించారు. ఈ సమావేశంలో వీడియో లింక్ ద్వారా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు విజయానంద్,రజత్ భార్గవ,ముఖ్య కార్యదర్శులు గోపాల కృష్ణ ద్వివేది,యంటి.కృష్ణబాబు, హరిశ్ గుప్తా,సమాచార శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.