అమరావతి: రాష్ట్రంలో ఏసీబీ, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అధికారులను ఆదేశించారు. దిశ తరహాలో అవినీతి ఫిర్యాదులకుగానూ ఏసీబీ యాప్ తేవాలని ఆయన అధికారులకు సూచించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో హోం శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏసీబీకి యాప్ ద్వారా ఆడియో ఫిర్యాదు సైతం చేయొచ్చని పేర్కొన్నారు. అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందేని ఆయన అధికారులను ఆదేశించారు. నెలరోజుల్లోగా ఏసీబీ యాప్ రూపకల్పన జరగనుందని, నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. అలాగే మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు ఉంటాయని చెప్పారు.