-ఇకపై ప్రతి వారం సమీక్షిస్తా
-ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ నీటి ప్రాజెక్టు పనులకు డెడ్ లైన్
-ప్రాజెక్టుల్లో రోడ్లు, భూ సేకరణ, నేషనల్ హైవే సహా పలు సమస్యల పరిష్కారానికి మార్గనిర్దేశం చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజంద్రనాథ్ రెడ్డి
అమరావతి,మే,25; ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఏపీఐఐసీ ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కర్నూలు పట్టణంలోని పోలీస్ అతిథి గృహంలో సంబంధిత శాఖల జిల్లా యంత్రాంగంతో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇకపై ప్రతి వారం పనులు జరిగే తీరుపై సమీక్ష నిర్వహిస్తానని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ నీటి ప్రాజెక్టు పనిలో మరింత వేగం పెంచాలన్నారు. పలు ప్రాజెక్టుల్లో రోడ్లు సహా నీరు, భూ సేకరణ, నేషనల్ హైవే సంబంధిత అంశాలలో ఎదురవుతున్న ఇబ్బందులను ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్ కుమార్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మార్గనిర్దేశం చేశారు.
ఓర్వకల్ వాటర్ ప్రాజెక్టు సమయాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళుతూ వేగంగా పూర్తి చేయాలన్నారు. డిజైన్లు, పైప్ ల ఏర్పాటు,జలవనరుల శాఖ అనుమతులు. ప్రాజెక్టులో కీలకమైన పనులు సహా పలు అంశాలపై కర్నూలు జిల్లా కలెక్టర్ జి.సృజన, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్ కుమార్ సహా జిల్లా స్థాయి యంత్రాంగంతో మంత్రి బుగ్గన కీలకంగా చర్చించారు.
నందికొట్కూరు, కేతవరం,పగిడ్యాలలో పైప్ లైన్ ల ఏర్పాటులో ఇబ్బంది రాకుండా పలు ఆదేశాలివ్వడమే కాకుండా వారం వారం పురోగతి చూపాలని డెడ్ లైన్ విధించారు. కర్నూలు, నంద్యాల జిల్లాకు చెందిన పారిశ్రామిక పార్కులు, ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు జరుగుతున్న పనుల ప్రగతిపైనా మంత్రి ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, కర్నూలు జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ సృజన, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్ కుమార్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, కర్నూలు ఏపీఐఐసీ జెడ్ఎం విశ్వేశ్వర్ రావు, ఏపీఐఐసీ ఇంజీనీరింగ్ అధికారులు, జలవనరుల శాఖ అధికారులు హాజరయ్యారు.