-టెక్స్ టైల్ పార్క్ లో ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు
-హెల్త్ హబ్ గా వరంగల్…రూ.1100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
-కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే ఏకైక పార్టీ బిఆర్ఎస్
-ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి
-వరంగల్ తూర్పు నియోజకవర్గం 35వ డివిజన్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర పంచాయతీరాజ్, -గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్, మే 3ః ఒకప్పుడు వరంగల్ లో అజంజాహీ మిల్లు కూతకు మనమంతా లేచేది. ఆ కూత పోయింది. మిల్లు పోయింది. కాంగ్రెస్ పార్టీ ఆ మిల్లును అమ్ముకుంది. ఆ మిల్లుపై ఆధారపడిన వారిని ఆగం చేసింది. సీఎం కెసిఆర్ సీఎం అయ్యాక, అజంజాహీ మిల్లును మించిన మెగా టెక్స్ టైల్ పార్క్ వరంగల్ లోనే ఏర్పాటు చేశారు.
మంత్రి కెటిఆర్ చొరవతో ఆ మెగా టెక్స్ టైల్ పార్క్ గీసుకొండ సమీపంలో పనులు ప్రారంభం అయ్యాయి. అందులో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం 35వ డివిజన్‌లో బుధవారం జరిగిన బిఆర్ ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఒకప్పుడు అజంజాహీ మిల్లు 10వేల మంది కార్మికులకు ఉపాధినిచ్చింది. ఇక్కడే చుట్టుముట్టు కార్మికులంతా నివసించే వారు. ఆ మిల్లు కూతకు లేచే వారు. అలాంటి మిల్లును దివాలా తీయించి, అప్పటి పాలకులు అమ్మేశారు. 10వేల మంది కార్మికులను రోడ్డున పడేశారు. దానికి బదులుగా వేలాది మందికి ఉపాధి లభించే విధంగా సిఎం కెసిఆర్ గారు మెగా టెక్స్ టైల్ పార్క్ ని అందుబాటులోకి తెచ్చారు. ఆ మిల్లులో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అలాగే, వరంగల్ నగరం హెల్త్ హబ్ గా మారుతున్నది. ఇప్పటికే ఉన్న ఎంజిఎంకు తోడు, పిఎంఎస్ ఎస్ వై హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా, వరంగల్లోనే రూ.1100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్నది. త్వరలోనే అది ప్రారంభం అవుతుంది. ఇక ఇక్కడి చుట్టుముట్టు ప్రజలు ఆరోగ్యం కోసం హైదరాబాద్ కు పోవాల్సిన పని లేదు. ఆ స్థాయి వైద్యం ఇక్కడే అందుబాటులోకి వస్తుందని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలను మంత్రి సోదాహరణంగా వివరించారు. ఆయా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలోనే వరంగల్ జిల్లాకు పార్టీ కార్యాలయం వస్తుందని తెలిపారు. కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుందన్నారు.
దేశంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ బిఆర్ ఎస్ మాత్రమేనని, ఇలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదని, 80 లక్షల మంది సైన్యంగా గల కార్యకర్తలు పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యతను తీసుకోవాలని, ప్రభుత్వ పథకాలను, ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో కీలకంగా పని చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు, స్థానిక నేతలు, డివిజన్ల కార్పొరేటర్లు, పార్టీ ముఖ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.