Suryaa.co.in

Entertainment

అత్యంత విషమంగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యం..

టాలీవుడ్‌ దిగ్గజం కైకాల సత్యనారాయణ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కైకాల. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు అపోలో ఆస్పత్రి వైద్యులు. ఐసీయూలో వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నామని..బీపీ లెవల్స్‌ తక్కువగా ఉన్నట్టు తెలిపారు.ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
కొద్దిరోజుల క్రితం త‌న ఇంట్లో జారిపడ్డారాయన. నొప్పులు కాస్త ఎక్కువ‌గా ఉండ‌డంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించి వైద్యం అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో.. జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్యనారాయణ కోలుకోవాలని నటీనటులు, అభిమానులు కోరుకుంటున్నారు.
ఇటీవలే కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’ అని చిరు త‌న‌ ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల.. ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 సినిమాల్లో నటించి.. తెలుగు అభిమానులను అలరించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధిస్తున్నారు.

LEAVE A RESPONSE