Suryaa.co.in

Padayatra News

అదే జోరు…అదే హుషారు…ఉవ్వెత్తున సాగుతున్న మహాపాదయాత్ర

– పోలీసు ఆంక్షలు, వర్షపు జల్లులు అడపాదడపా ఆటంకాలు కలిగించినా.. రైతులు ముందుకే సాగారు
– నెల్లూరు జిల్లాలో రాజువారి చింతలపాలెం నుంచి మొదలైన యాత్ర.. కావలి చేరుకుంది
– ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున.. అమరావతి పరిరక్షణ సమితికి రూ.30 లక్షల విరాళం అందజేశారు
నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర 22 వరోజుకు చేరుకుంది.నిన్న రాత్రి కావలిలో బస చేసిన రైతులు నేడు నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట వరకు 13 కిలోమీటర్లు కొనసాగనుంది.
నెల్లూరు జిల్లా రాజువారి చింతలపాలెం నుంచి ప్రారంభమైన యాత్రకు.. స్థానికులు అడుగడుగునా హారతులు పట్టి నీరాజనాలు పలికారు.జై అమరావతి నినాదాలతో మహాపాదయాత్ర చలంచర్ల మీదుగా సాగింది.యాత్రలో వెంకటేశ్వరస్వామి రథంతో పాటు.. అల్లా, జీసస్‌కు సంబంధించిన వాహనాల ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఏకైక రాజధానిగా అమరావతినే కోరుకుంటున్నారని రైతులు తెలిపారు.సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నట్లే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
అమరావతి రైతులకు కొత్తపల్లిలో.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రజా నాయకులు, రైతు సంఘాలు ఎదురెళ్లి పూలతో స్వాగతం పలికారు.గుమ్మడికాయలతో దిష్టితీస్తూ, డప్పు చప్పుళ్లతో ఆహ్వానించారు.కావలిలో రైతులకు స్థానికులు పెద్దఎత్తున పూలతో ఘనస్వాగతం పలికారు.వర్షాలు, వరదలతో ప్రజలంతా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. అమరావతికి మద్దతుగా రైతుల అడుగులో అడుగేస్తూ ముందుకు కదిలారు.21వ రోజు యాత్ర 15 కిలోమీటర్లు సాగింది.ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున.. అమరావతి పరిరక్షణ సమితికి రూ.30 లక్షల విరాళం ప్రకటించారు.మాజీ ఎమ్మెల్యే రామారావు చేతుల మీదుగా చెక్ అందజేశారు.

LEAVE A RESPONSE