– తాను లేనంటూ వీడియో విడుదల చేసిన హేమ
– తాను కూడా లేనన్న హీరో శ్రీకాంత్
– మంత్రి కాకాణి పేరుతో కారు స్టిక్కర్
– కన్నడనాట తెలుగు కలవరం
బెంగళూరు: స్థానిక ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన ఒక రేవ్ పార్టీ సినిమా పరిశ్రమను కుదిపేస్తోంది. ఈ పార్టీలో దాదాపు 100 మంది పాల్గొనగా.. అందులో 30 మంది మహిళలు ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో మోడల్స్, సినీ నటీమణులున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ డ్రగ్స్ కూడా సరఫరా చేసినట్లు వార్తలు రావడంతో అందరి దృష్టీ సినీ పరిశ్రమపై పడింది. కాగా అందులో పాల్గొన్న వారిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి పేరుతో ఒక కారుపై స్టిక్కర్ కూడా ఉండటం సంచలనం రేపుతోంది.
పక్కా సమాచారం మేరకు జరిగిన ఈ దాడిలో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టు హేమ కూడా పట్టుబడినట్లు సమాచారం. అయితే హైదరాబాద్‌లో హేమ విడుదల చేసిన వీడియో తర్వాత బూటకమని తేలిందని సమాచారం. అది ఆమె బెంగళూరు నుంచే విడుదల చేయడంతో, పోలీసులు కేసును తప్పుదోవపటడ్టించారన్న కారణంతో ఆమెపై మరోకేసు పెట్టినట్లు తెలుస్తోంది.
నటుడు శ్రీకాంత్ కూడా తాను అక్కడ లేనని, భార్యతో కలసి హైదరాబాద్‌లోని ఇంట్లోనే ఉన్నానని ఒక వీడియో విడుదల చేశారు. రేవ్ పార్టీ జరిగిన జీ ఆర్ ఫాంహౌస్, హైదరాబాద్‌కు చెందిన గోపాలరెడ్డిది కావడం గమనార్హం. అయితే బెంగళూరు పోలీసులు కేసు వివరాలను మీడియాకు విడుదల చేయలేదు.
నేను మా ఇంట్లోనే ఉన్నా: శ్రీకాంత్
రేవ్ పార్టీలో ఉన్నారని ప్రచారం జరుగుతున్న నటుడు శ్రీకాంత్ దానిని ఖండించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. బెంగుళూరు రేవ్ పార్టీకి నేను వెళ్లినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు నాలు చాలామంది ఫోను చేస్తూ వున్నారు. వీడియో క్లిప్స్ కూడా చూశాను. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవటంతో నాకు సంబంధించిన వార్తలను వారు రాయలేదు. కొన్నింటిలో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం,” అని చెప్పారు.