Suryaa.co.in

Editorial

అదానీ..షిర్డిసాయిపై వేటే..రైటు

– తెలుగురాష్ట్రాల్లో ‘అదానీ’ మంటలు
– చంద్రబాబు-రేవంత్‌కు అదొక్కటే పరిష్కారం
– కళంకితుడి నుంచి వందకోట్ల విరాళం ఎందుకు?
– ఆ వందకోట్లు అదానీకి వాపసు చేయాలంటున్న తెలంగాణ విపక్షం
-యాదాద్రిలో అదానీ సిమెంట్ కంపెనీ ఒప్పందం రద్దు చేయాల్సిందే
– తెలంగాణలో 12,400 కోట్ల ఒప్పందాల రద్దుపై రగడ
– ఏపీలో దమ్ముంటే ఒప్పందాలు రద్దు చేయాలని వైసీపీ సవాల్
– ఏమాత్రం వెరకుండా వైసీపీ ఎదురుదాడిలో ధీమా ఏమిటి?
– వైసీపీ సవాల్ చేసినా కొరడా ఝళిపించకపోతే మౌనంగా ఉంటే అప్రతిష్ట
– పైగా ప్రజల దృష్టిలో అనేక అనవసర అనుమానాలు
– అదానీతో ఒప్పందం వల్ల భారమని గతంలోనే టీడీపీ ఆరోపణ
– జగన్-అదానీ ఒప్పందంపై విరుచుకుపడిన నాటి పీఏసీ చైర్మన్ పయ్యావులకేశవ్
– ఇప్పుడు కేశవ్ మౌనానికి కారణమేమిటి?
– కూటమి వాటిని రద్దు చేయకపోతే మోదీ ఒత్తిళ్లతో చేయడం లేదన్న అపవాదు
– షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ లీజు భూములు రద్దు చేయరేం?
– ట్రాన్స్‌ఫార్మార్ల కొను‘గోల్‌మాల్’పై విజిలెన్స్ ఏదీ?
– చర్య తీసుకోకపోతే విశ్వసనీయ కోల్పోయే ప్రమాదం
– విద్యుత్ శాఖ మంత్రి చర్యల కొరడా ఝళిపించరేం?
– షిర్డిసాయి అక్రమాలపై సమీక్షించని విద్యుత్‌శాఖ మంత్రి
– అసలు షిర్డిసాయింపెనీకి నోటీసులిచ్చారా?
– ఇప్పుడు కొత్తగా మంత్రికి అదానీ తలనొప్పి
– కూటమి సర్కారుకు అప్రతిష్ట తెస్తున్న ఓ ఐఏఎస్
( మార్తి సుబ్రహ్మణ్యం)

కూటమి సర్కారు తనకు సంబంధం లేని అంశాలతో తలనొప్పి ఎదుర్కొంటోంది. జగన్ జమానాలో జరిగిన ఒప్పందాలను ‘కక్షసాధింపులు ఉండ వు. పారిశ్రామి వాతావరణం చెడగొట్టకూడదన్న’ కారణంతో రద్దు చేయని ఫలితంగా.. ఇప్పుడు సమస్యలను ‘కొని’ తెచ్చుకుంటున్న వైచిత్రి.

సూపర్‌సిక్స్ హామీల అమలు, పనిచేసిన వారికి పదవులతో పట్టం కట్డడంపై దృష్టి సారించాల్సి.. కార్యకర్తలను మెప్పించాల్సిన ఈ సమయంలో..జగన్ జమానాలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు, భూముల కేటాయింపులు రద్దు చేయకుండా, మీనమేషాలు లెక్కించడం వైసీపీకి అలుసయిపోవడం విశేషం. అంటే కూటమి సర్కారు జగన్ జమానాలో కుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయలేదన్న భరోసాకు వచ్చేశారన్నమాట.

అందుకే అడ్డగోలు ఒప్పందాలు చేసుకున్న వైసీపీ సర్కారు.. ఇప్పుడు భయపడటం బదులు, ఎదురుదాడి చేయడం కూటమి వర్గాలను నిశ్చేష్టులను చేస్తోంది. ‘దమ్ముంటే అదానీతో చేసుకున్న ఆ ఒప్పందాలు రద్దు చేయమ’ని సవాల్ చేసే స్థాయికి వెళ్లిందంటే.. తప్పు ఎవరిది? లోపం ఎక్కడ? ప్రభుత్వానిదా? అధికారులదా?.. ఇదీ ఇప్పుడు ఏపీలో హాట్‌టాపిక్.

అదానీ ప్రకంపనలు ఏపీతోపాటు తెలంగాణనూ బలంగానే తాకుతున్నాయి. స్కిల్ యూనివర్శిటీకి అదానీ వందకోట్ల విరాళం ఇప్పుడు వివాదంగా మారుతోంది. అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో, ఆ విరాళాన్ని కళంకితుడైన అదానీకి వాపసు చేయాలని విపక్షం గట్టిగా డిమాండ్ చేస్తోంది. మూసీ ప్రాజెక్టు అదానీకే కట్టబెడుతున్నారన్న ఆరోపణలకు, పదునుబెడుతున్న బీఆర్‌ఎస్.. అదానీతో చేసుకున్న 12,400 కోట్ల రూపాయల ఒప్పందాలు రద్దు చేసుకోవాలని గళమెత్తడం, రేవంత్ సర్కారుకు సంకటంగా మారింది.

యాదాద్రిలో అదానీ సిమెంట్ కంపెనీకి అనుమతి ఇచ్చినందుకే, ఆయన ప్రభుత్వానికి 100 కోట్ల విరాళం ఇచ్చారంటూ కొత్త లాజిక్కును తెరపైకి తెచ్చింది. నిజానికి యాదాద్రిలో అదానీ సిమెంట్ పరిశ్రమను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల నీరు, గాలి కలుషితమయి, తమకు అపాయమని స్థానికులు చాలాకాలం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పీసీబీ, రెవిన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణను తూతూమంత్రం చేసి, అక్కడ అదానీ సిమెంట్ కంపెనీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.

ఇప్పుడు అదానీ అమెరికా స్థాయిలో ముద్దాయిగా నిలవడం, రేవంత్ రాజకీయ ప్రత్యర్ధులకు బ్రహ్మాస్త్రంగా పరిణమించింది. దానితో అదానీతో ఒప్పందం కొనసాగించే అంశం రేవంత్ సర్కారుకు ప్రతిష్ఠగా మారింది. ‘ఒకవైపు అదానీని రాహుల్ విమర్శిస్తారు. మరోవైపు అదే అదానీకి రేవంత్ ప్రాజెక్టులు కట్టబెడతార’ంటూ, ఇప్పటికే కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీనితో అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవడం రేవంత్ సర్కారుకు సవాలుగా పరిణమించింది. ‘అదానీతో మీకు లాలూచీ లే పోతే ఆయనతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాల’ని విపక్షం మెలిక పెట్టడమే దానికి కారణం.

అటు ఏపీలో పరిస్థితి తెలంగాణకు భిన్నం. రేవంత్ సర్కారు, అదానీతో 12,400 కోట్ల ఒప్పందమన్నా చేసుకుంది. కానీ కూటమి సర్కారు గత ఆరునెలల కాలంలో అదానీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. గజం భూమి కూడా కేటాయించలేదు. అయినా సంకట పరిస్థితి ఎదుర్కొంటోంది. అదే విశేషం.వచిత్రం! జగన్ జమానాలో అదానీకి అక్షరాలా 2,76,333 కోట్ల రూపాయల ఖరీదైన ప్రాజెక్టులు కట్టబెట్టారు.

పోర్టుల నుంచి స్మార్ట్‌మీటర్ల వరకూ అదానీ కంపెనీకే ధారాదత్తం చేసింది. ధర్మల్ కేంద్రాలకు బొగ్గుసరఫరా టెండర్లు, పంప్‌డ్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, సౌరవిద్యుత్ ప్రాజెక్టులను అప్పనంగా అదానీకే రాసిచ్చేసిన జగన్ సర్కారుపై, అప్పట్లో కూటమి విరుచుకుపడింది.

తొలుత గతంలో కూటమి సర్కారు అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కుదించి, హడావిడి చేసిన జగన్ సర్కారు.. తర్వాత ‘అసలు అదానీ తప్ప మరెవరూ ఏమీ చేయలేరన్నంతగా’, అన్నీ ఆ కంపెనీలకే ధారాదత్తం చేసింది. చివరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలోని పోర్టులను బెదిరించి మరీ.. ఆ కంపెనీకి కట్టబెట్టిన వైనంపై అప్పట్లో టీడీపీ విరుచుకుపడి, దానిని నానా యాగీ చేసింది.

విశాఖలో అదానీ డేటాసెంటర్‌కు 3058 కోట్ల ఖరీదైన 190 ఎకరాలు కట్టబెట్టినా, అక్కడ పనిమొదలైన దాఖలాలు లేవు. దానితో ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ ఇప్పుడు తెరపైకి వస్తోంది.

జగన్ సాయంతో కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటాను దక్కించుకునేందుకు, బెదిరింపులకు పాల్పడిందని కూటమి నేతలు ఆరోపించారు. డివిఎస్ రాజును బెదిరించి, గంగవరం పోర్టును ప్రభుత్వ ఈక్విటీని అదానీకి 645 కోట్లకు అమ్మడంపై కూటమి విరుచుపడింది.

3700 మెగావాట్ల పీఎస్‌పీ ప్రాజెక్టులను ధారాదత్తం చేసిన జగన్ సర్కారు.. ఏపీలో 10 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టులు కట్టబెట్టింది. విజయనగరం జిల్లా రైవాడ వద్ద 1000 మెగావాట్లు, కడప జిల్లా గండికోట రిజర్వాయర్ వద్ద 1000 మెగావాట్లు, అనకాపల్లి జిల్లా పెదకోట రిజర్వాయర్ వద్ద 1500 మెగావాట్లు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద 500 మెగావాట్లు, మన్యం జిల్లా కురుకుర్తి వద్ద 1200 మెగావాట్లు, కర్రిపలస వద్ద 1000 మెగావాట్ల పీఎస్‌పీ ప్రాజెక్టులను, అదానీ కంపెనీకి కట్టబెట్టింది.

సహజంగా ఒక కంపెనీకి ఇన్నేళ్ల నిర్దిష్ట కాలపరిమితితో, ప్రాజెక్టులు పూర్తి చేయాలని షరతు ఉంటుంది. లేకపోతే ప్రభుత్వం వారికి నోటీసులిచ్చి.. సదరు కంపెనీలకు ఇచ్చిన భూములు, రాయితీలు, వెసులుబాట్లను రద్దు చేసే అధికారం ఉంటుంది. మరి అదానీ ఐదేళ్లలో ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఏ ఒక్క ఒప్పందాన్నీ అమలుచేయనప్పుడు, వాటిని రద్దు చేసి తన చిత్తశుద్ధి చాటుకోవడం అనివార్యంగా మారింది. పైగా ఇప్పుడు అదానీ అంతర్జాతీయ ముద్దాయిగా నిలబడ్డ నేపథ్యంలో.. ఏపీలో ఆయన కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం ద్వారా, రాష్ట్రంపై పడ్డ మచ్చను తొలగించాలన్న డిమాండ్ కూటమిలోనే వినిపిస్తోంది.

మరోవైపు అదానీ-మోదీ బంధం బహిరంగమైన నేపథ్యంలో.. కాంగ్రెస్, వామపక్షాలు ఏపీలో అదానీతో జగన్ సర్కారు కుదుర్చుకున్న ఒప్పందాలు, రద్దు చేయాలన్న డిమాండ్‌కు పదును పెడుతున్నాయి. ఒకవేళ అదానీ కంపెనీలతో ఒప్పందాలు రద్దు చేసుకోకపోతే.. కూటమిపై మోదీ ఒత్తిళ్ల కారణంగానే రద్దు చేయడం లేదన్న అనవసర నిందలు ఎదుర్కోవలసి వస్తుందని కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు.

‘మనం అదానీ కంపెనీలకు గజం భూమివ్వలేదు. అలాంటప్పుడు భయపడటం ఎందుకు? పైగా జగన్ జమానాలో ఇచ్చిన భూములను రద్దు చేస్తే, కూటమి క్యాడర్‌లో మనం ఒక విశ్వాసం నెలకొల్పవచ్చు. ఇప్పటికే పులివెందుల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేశామని, జగన్ హయాంలో కీలకపాత్ర పోషించిన అధికారులకే పోస్టింగులిచ్చామన్న విమర్శలు ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో అదానీతో జగన్ చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుంటేనే, మనపై క్యాడర్‌లో విశ్వసనీయత పెరుగుతుంద’ని ఒ మాజీ మంత్రి విశ్లేషించారు.

స్మార్ట్‌మీటర్ల టెండరూ అదానీ, షిర్డిసాయికే
రాష్ట్రంలోని అన్ని ప్రధాన వనరులనూ అదానీకే కట్టబెట్టిన జగన్ సర్కారు.. చివరకు స్టార్టుమీటర్లనూ అదానీ, షిర్డిసాయి కంపెనీలకే ధారాదత్తం చేసింది. వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లకు పిలిచిన టెండర్లలో ఎల్ 1, ఎల్-2గా వచ్చిన ఆదానీ, షిర్డిసాయి కంపెనీలకు నెలకు 92 రూపాయల చొప్పున 27.68 లక్షల విద్యుత్ కనెక్షన్లకు స్మార్టుమీటర్ల ఏర్పాటు, నిర్వహణ బాధ్యత ఇచ్చింది. ఫలితంగా ఒక్కో వినియోగదారుడు దీనికి నెలకు 108 రూపాయలు భరించాల్సి ఉంటుంది. దీనిని గతంలో కూటమి వ్యతిరేకించడం గమనార్హం. కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రానికి.. 7.5 లక్షల విదేశీ బొగ్గును టన్నుకు 13,100 రూపాయల చొప్పున సరఫరా చేసే కాంట్రాక్టును అదానీ కంపెనీ దక్కించుకుంది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తారా? లేదా? అన్నది చూడాలి.

కేశవ్ బయటపెట్టిన అదానీ లెక్క ఇదీ.. మరి కేశవ్ ఎక్కడ?
కాగా అదానీ కంపెనీతో జగన్ సర్కారు కుదుర్చుకున్న సౌరవిద్యుత్తు ఒప్పందాల వల్ల.. ప్రజలపై 25 ఏళ్లపాటు పడే భారం అక్షరాలా 1.10లక్షల కోట్లు. అంటే ప్రతి మనిషిపై పడే భారం 62 రూపాయలన్నమాట. అదానీ కరెంటుతో లక్షా 20 వేల కోట్ల భారం ప్రజలపై పడుతుందని అప్పట్లో పీఏసీ చైర్మన్‌గా ఉన్న పయ్యావుల కేశవ్, ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘రాజస్థాన్‌లో ఉత్పత్తి చేసే ఆ కరెంటు మనకు 4 రూపాయల 50 పైసలుకు ఇస్తున్నారు. అసలు ధరలు దిగి 2 రూపాయలకే ఇస్తుంటే అంత ఎక్కువకు కొనడం ఎవరికోసం? ధర ఎక్కువగా ఉన్నందుకే అదానీ పవరును ఎవరూ కొనడం లేదు. సెప్టెంబర్ 15న సెకీ లేఖ రాస్తే, జగన్ ప్రభుత్వం మరుసటిరోజునే ఆమోదించింది. ఇది రైతుల స్కీం కాదు. అదానీ స్కాం’’ అంటూ కేశవ్ గణాంకాలతో విరుచుకుపడ్డారు. కానీ ఇప్పుడు ఆర్ధికమంత్రిగా ఉన్న అదే కేశవ్ మాత్రం, దీనిపై మౌనంగా ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు అదానీతో ఒప్పందాన్ని గుర్తుచేసి, వాటి వల్ల రాష్ట్ర ఖజానాపై పడుతున్న భారాన్ని వివరించి వాటి ని రద్దు చేయాలని సూచించాల్సిన కేశవ్.. ఏ కారణంతో మౌనంగా ఉన్నారో అర్ధం కావడం లేదంటున్నారు.

‘షిర్డిసాయి’ మీటర్ల కొను‘గోల్‌మాల్’పై విచారణ ఎప్పుడు?
జగన్ జమానాలో విద్యుత్ శాఖను అడ్డగోలుగా దోచుకున్న సంస్థల్లో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ ఒకటి. అది స్వయంగా జగన్ బినామీ కంపెనీయేనంటూ సోమిరెడ్డి, పట్టాభి, నీలాయపాలెం విజయకుమార్ కొన్ని డజన్ల సార్లు ప్రెస్‌మీట్‌లో ఆరోపించారు. ఆ మేరకు జగన్ సర్కారు అడ్డదారిలో షిర్డిసాయికి కట్టబెట్టిన భూములు, స్మార్టుమీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల జాబితాను మీడియాకు విడుదల చేసింది. స్మార్టుమీటర్ల ప్రాజెక్టు ద్వారా షిర్డిసాయికి 6,888 కోట్ల ప్రజధనాన్ని అప్పనంగా అర్పించిన వైనం, అప్పట్లో పెనుదుమారం సృష్టించింది. టెండరు నిబంధనలు మార్చేసి ఆఫీస్‌నోట్ ద్వారా వందల కోట్లు చెల్లించింది. 18,58,587 కనెక్షన్లకు రు.1,421,30 కోట్ల రూపాయలు షిర్డిసాయికి అప్పనంగా దోచిపెట్టింది.

అయితే విచిత్రంగా అసలు స్మార్టుమీటర్లే లేకుండా.. వాటికి అమర్చేందుకు డిస్కంలు విడిభాగాలు కొనుగోలు చేయడం విశేషం. ఎన్నికల ముందు ఆ అనుబంధ పరికరాలను లారీలో తెచ్చి పడేసి వెళ్లాయి. అయితే కాంట్రాక్టర్లకు నిబంధనల ప్రకారం.. విడిభాగాలు సరఫరా చేసిన తర్వాత 50 శాతం, బిగించిన తర్వాత 30 శాతం బిల్లు చెల్లించాల్సి ఉండగా.. జగన్ సర్కారు అందుకు భిన్నంగా, 80 శాతం బిల్లులను అప్పడే చెల్లించడం విచిత్రం.

నిజానికి వాటి మార్కెట్ ధరల ఖర్చు 1,071 కోట్లు కాగా, షిర్డిసాయికి అదనంగా 922 కోట్లు అదనంగా చెల్లించిందంటే.. జగన్ జమానాలో షిర్డిసాయి ఏ స్థాయిలో వెలిగిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అప్పుడు-ఇప్పుడు ఇంధన శాఖను వెలిగిస్తున్న ఒక ఐఏఎస్ అధికారి చల్లని చూపులతోనే.. షిర్డిసాయికి కాంట్రాక్టులు, బిల్లులు వాయువేగంతో దక్కినట్లు, ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది.

ప్రభుత్వం మారినా సదరు అధికారి.. ఇంకా అదే శాఖలో కొనసాగడం బట్టి, ఆయన ఎంత బలవంతుడో, ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో నిష్ణాతుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నది అధికారుల వ్యాఖ్య. సదరు ఐఏఎస్ అధికారికి త్వరలో సీఎస్ పదవి కూడా ఇస్తారన్న ప్రచారం అధికార వర్గాల్లో వినిపిస్తోంది.

గత ఐదేళ్లలో షిర్డిసాయి నుంచి జగన్ ప్రభుత్వం 2 లక్షల 40 వేల ట్రాన్స్‌ఫార్మార్లు.. అవసరం లేకపోయినా కొనుగోలు చేసింది. ఫలితంగా ప్రజలపై 2,700 కోట్ల రూపాయల భారం పడటం దారుణం. అవసరం లేకపోయినా ట్రాన్స్‌ఫార్మన్లు కొనుగోలు చేయడంతో.. వాటిని దాచిపెట్టే స్థలం లేక విద్యుత్‌శాఖ కార్యాలయాల ఆవరణలో గుట్టలుగా పోసిన వైనం, అప్పట్లో మీడియాలో చర్చనీయాంశమయింది. ఇప్పుడు వారెంటీ పెద్ద సమస్యగా మారింది.

ఒక్కో డిస్కం సగటున 80 వేల ట్రాన్స్‌ఫార్మర్లు, షిర్డిసాయి నుంచి కొనుగోలు చేసింది. దానిపై విమర్శలు చెలరేగడంతో.. ఆధునీకరణ పేరుతో, ఏర్పాటుచేసి పదేళ్లు కూడా కాని ట్రాన్స్‌ఫార్మర్లను మార్చి.. కొనుగోలు చేసిన షిర్డిసాయి ట్రాన్స్‌ఫార్మార్లు బిగించింది. అందుకు డిస్కంలు చేసిన ఖర్చు 2,700 కోట్ల రూపాయలు. మళ్లీ ఇది వినియోగదారులకు చేతిచమురు వ్యవహారం.

25 కెవిఏ కెపాసిటీ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు 1,39,999 రూపాయలు డిస్కంలు చెల్లించాయి. అయితే ఇదే ట్రాన్స్‌ఫార్మర్లు తెలంగాణ డిస్కంలు 70 వేలకు కొనుగోలు చేయడం విచిత్రం. అసలు హర్యానా, తెలంగాణ డిస్కంలు కొనుగోలు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ల ధరల కంటే, జగన్ సర్కారు షిర్డిసాయికి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేశాయి.

ఇక జగన్ జమానాలో షిర్డిసాయి కంపెనీకి, అడ్డగోలుగా కట్టబెట్టిన ప్రభుత్వ భూములపై కూటమి ఆరోపణలు గుప్పించింది. ఆ కంపెనీకి ఎక్కడెక్కడ భూములు కేటాయించిందన్న వివరాలు వెల్లడించి, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే ఆ భూముల కేటాయింపులు రద్దు చేస్తామని, షిర్డిసాయి కంపెనీ కొనుగోలు, ఒప్పందాలపై విజిలెన్స్-న్యాయ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఆరునెలలయినప్పటికీ, అది కార్యరూపం దాల్చకపోవడంపై కూటమి వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

ట్రాన్స్‌ఫార్లర్ల కొనుగోలుతో ఖజానాను ఊడ్చేసిన షిర్డిసాయి కంపెనీకి.. జగన్ కంపెనీ క్వార్ట్‌జైట్ గనుల కోసం ఓర్వకల్లు వద్ద 42 హెక్టార్ల భూమిని 20 ఏళ్ల లీజుకు ఇవ్వడం విశేషం. ఇలా 3 లీజు భూమిని షిర్డిసాయికి కట్టబెట్టడం ద్వారా, ఆ కంపెనీతో తన అనుబంధం చాటుకుంది. మరి షిర్డి సాయి కంపెనీకి కట్టబెట్టిన ఈ లీజు భూములను కూటమి సర్కారు రద్దు చేస్తుందా? లేదా? అన్నదే ఇప్పుడు అందరి ఉత్కంఠ.
విద్యుత్‌మంత్రి.. కింకర్తవ్యం?

కొత్తగా తెరపైకి వచ్చిన అదానీ కుంభకోణం-పాతదయిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ అక్రమాలపై.. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తినెలకొంది. నిజానికి దీనిపై నేరుగా నిర్ణయం తీసుకునే అవకాశం-అధికారం మంత్రికి లేకపోయినప్పటికీ.. కనీసం ఇప్పటిదాకా ఈ అంశాలపై మంత్రి హోదాలో సమీక్ష నిర్వహించకపోవడమే ఆశ్చర్యం. అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే రాజకీయ-సాంకేతిక అంశాలతోపాటు, రాష్ట్ర ప్రయోజనాలు-ప్రతిష్ఠ వ్యవహారం ముడిపడి ఉంది.

అందువల్ల అదానీ అంశాన్ని పక్కకుపెడితే.. కనీసం షిర్డిసాయి ఎలక్ట్రిక ల్స్ అంశంపై మంత్రి ఇప్పటివరకూ, ఒక్క సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేకపోవడమే ఆశ్చర్యం. ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు షిర్డిసాయి కంపెనీపై.. తమ పార్టీ నాయకులే ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో, వాటి నిగ్గుతేల్చడం మంత్రి బాధ్యత అని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అసలు షిర్డిసాయి కంపెనీకి ఎంత చెల్లించారు? ఇంకా ఎంత చెల్లించాలి? ఆ కంపెనీ సరఫరా చేసిన ట్రాన్స్‌ఫార్మర్ల నాణ్యత, వారెంటీపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలా? వద్దా? అనే కీలక అంశాలపై మంత్రి హోదాలో సమీక్ష నిర్వహించాల్సి ఉంది.

LEAVE A RESPONSE