Suryaa.co.in

Political News

అదానీ.. జగన్.. ఆ 1750 కోట్లు!

ఆ అంకెలు …సరదాగా … అసలు స్టోరీ ఏంటంటే…
తెలుగు జనానికి మంచి కాలక్షేపం దొరికింది . ఏ నలుగురు ఒక చోట చేరినా …., “చూశావా ? జగన్ కు అదానీ 1750 కోట్లు ఇచ్చాడంట! ఆర్నీ….” అంటూ కాసేపు మాట్టాడుకుని, ఎవరి దారిని వారు పోవడానికి ఈ అంకెలు పనికి వస్తాయి .

జగన్ సంపాదనలో …. ఈ 1750 కోట్లు ఓ గుడ్డి వెంట్రుక తో సమానం అనేవాళ్ళు లేకపోలేదు . సీబీఐ వాళ్ళు చచ్చీ చెడీ….భూతద్దాలు వేసుకుని వెదికితే, ఓ నలభై వేల కోట్ల ఆస్తులు 2012 లోనే దొరికాయి .

అప్పటి నుంచి , అవి ఎన్ని చిలవలు , పలవులుగా పెరిగిపోయి ఉంటాయో చెప్పగలిగిన వారు ఎవరు !? డబ్బు విలువ జగన్ కు తెలుసు . ఎవరినైనా డబ్బు తో కొట్టడం లో ఆయన సిద్ధ హస్తుడు అని కూడా అంటారు .

అందుకే , అప్పటి సీబీఐ జే డీ గా పనిచేసిన వీ వీ లక్ష్మీనారాయణ ప్రాణాలకు తెగించి మరీ దాఖలు చేసిన 11 ఛార్జ్ షీట్లు …డబ్బున్నవారి ఇళ్ళల్లో మునగడ దీసుకుని పడుకునుండే జర్మన్ షెపర్డ్ కుక్కల్లా మునగడ దీసుకుని ఎక్కడెక్కడో …బీరువాల్లో పడుకుని ఉన్నాయి. ఇప్పటికి 12,13 ఏళ్లు అవుతున్నది .

ఆ డబ్బే లేకపోతే , ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి లభించి ఉండేది కాదు .
ముఖ్యమంత్రి పదవి లభించిన తరువాత ; ఇక , “ఇంత” అని చెప్పగలిగిన వారు ఎవరు ? అందులో …. ఇప్పుడు అదానీ అనే ఆర్భకుడు ఇచ్చాడు అని మీడియా వాళ్ళు కాకి గోల చేస్తున్న 1750 కోట్లు …ఆయన ఆర్థిక సముద్రం లో ఏ మూలకి!?
ఆ సముద్రం లో ఇదో కాకి రెట్ట .
జనానికి కాలక్షేపం కోసం ఏదో ఓ సొల్లు మాట్లాడుకోవడమే గానీ , జగన్ కు గుడ్డి వెంట్రుక కూడా ఊడదు.

ఆయన అధికారం లో ఉన్నప్పుడే……2022 ఏప్రిల్ 8 న ఒకసారి; జూన్ 27 న ఒకసారి ” వీరెవరూ నా వెంట్రుక కూడా పీకలేరు …” అని ప్రకటించారు . ఇప్పటికీ పీకలేరు. ఆ విషయం తెలిసిన జ్ఞానులు గనుకనే ; తెలుగు దేశం వారు గానీ , జనసేన వారు గానీ , బీజేపీ వారు గానీ నోరు పారేసుకోలేదు .

ఎందుకంటే – డబ్బులు ఇచ్చింది అని అమెరికా వాళ్ళు చెబుతున్నది అల్లాటప్పా ఆదినారాయణ కాదు . అదానీ .
చూడ ముచ్చటగా , ముద్దు ముద్దుగా… బొద్దుగా ఉండే అదానీ కి జలుబు చేస్తే ; మన ప్రధాని మోడీ కి తుమ్ములు వస్తాయి అంటారు , కాంగ్రెస్ వాళ్ళు. ఇద్దరూ…. “అవిభక్త ” కవలలా అని ఆశ్చర్యపోతుంటారు, రాజకీయ విశ్లేషకులు .
అందువల్ల ; జగన్ ను ఏమైనా అంటే , అదానీ ని అన్నట్టే . అంటే , ప్రధాని ని అన్నట్టే .
ప్రధాని …అంటే బీజేపీ . అంటే , కూటమి లోని ఒక పార్టీని కూటమి వాళ్ళే విమర్శించినట్టు .
పైపెచ్చు , 1750 కోట్లు ఈరోజుల్లో రాజకీయం గా పెద్ద అమౌంట్ కూడా కాదు . ఆ చిల్లర పైసల కోసం అనవసరమైన రభస ఎందుకు అని కూటమి విజ్ఞులు భావించి ఉంటారు.
జగన్ గానీ , ఆయన ఆత్మ – సజ్జల రామకృష్ణారెడ్డి గానీ …అందుకే స్పందించి ఉండరు, ఈ “చిల్లర పైసల పంచాయతీ” పై స్పందించడం తమ లెవెల్ కు చిన్నతనం అని .

నిజానికి , 100 కోట్ల లిక్కర్ స్కాం జరిగిపోయిందంటూ గుండెలు బాదుకుని ; ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను , ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ను , కేసీఆర్ కూతురు కవితను , ఎం పీ మాగంటి శ్రీనివాస రెడ్డి కొడుకును , విజయసాయి రెడ్డి అల్లుడు తమ్ముడు శరత్ చంద్రారెడ్డి ని … మరికొందరినీ మామిడికాయల్ని ముగ్గేసినట్టు తీహార్ జైల్లో నెలలు తరబడి మగ్గేసిన సీబీఐ గానీ , ఈ డీ గానీ , ఇన్ కమ్ టాక్స్ వాళ్ళు గానీ , జగన్ వైపు కన్నెత్తి చూడరు . చూస్తే , ఉద్యోగాలు పోతాయి . బూజుపట్టి , దమ్మిడీ కి పనికిరాకుండా పోతారు .

ఎందుకంటే , అదానీ – ప్రధాని కి ఆత్మ బంధువు . అంటే , బీజేపీ కి బంధువు .
మరి , అమెరికా వాళ్ళు అదానీ ని ఓపాలి పంపించమని మన కేంద్రప్రభుత్వాన్ని అడుగుతారా ?
అదే అసలైన ప్రశ్న . అడిగితే , మన ప్రభుత్వం ఏం చేస్తుంది ? అదో ఇంట్రెస్టింగ్ పాయింట్ .
న్యూయార్క్ కోర్టు అరెస్టు వారెంట్లు కూడా జారీ చేసింది కాబట్టి ; అదానీ ఇండియా దాటి ఎక్కడికి వెళ్ళడం కుదరదు . ఎఫ్ బీ ఐ వాళ్ళు ఎగరేసుకు పోతారు . ఆసక్తికరమైన ఇన్ని “యవ్వారాలు ” ఉంటే ; 1750 కోట్లదేముంది!?

– భోగాది వేంకట రాయుడు

LEAVE A RESPONSE