Suryaa.co.in

Editorial

అడ్డం తిరిగిన ‘కి’రాయి

– మందుబాటిలిచ్చి డబ్బులివ్వలేదట
– అందుకే జగనన్నపై కోపంతో రాయి వేశాడట
– ఇంటికి 200 రూపాయలిస్తామని మోసం చేశారట
– జగనన్నపై రాయి వెనుక అసలు కథ ఇదేనట
– రాయి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
– వడ్డెర యువకులను అరెస్టు చేసిన ఖాకీలు
– సర్కారుపై వడ్డెరల తిరుగుబాటు
– పోలీసుస్టేషన్ ముందుకుటుంబాలతో సహా ధర్నా
– జగన్‌పై తిరగబడ్డ కి ’రాయి‘
– అసలు రహస్యం తెలియక సానుభూతి ప్రకటించిన మోదీ, సీఎంలు
– అది కిరాయి అని తెలియడంతో పరువుపోయిన వైనం
( మార్తి సుబ్రహ్మణ్యం)

డామిట్ కథ అడ్డం తిరిగింది. బెజవాడలో సీఎం జగన్‌పైపడిన రాయి.. కిరాయిదేనని తేలింది. చంద్రబాబు హ త్యాయత్నం చేయించారంటూ జగన్ నుంచి అంబటి వరకూ ఆరోపణల వర్షం కురిపించారు. జగన్ సొంత మీడియాలో ఫలానా స్కూలు నుంచి రాయి వచ్చిందంటూ స్కూలు ఫొటోకూడా వేశారు. అయితే ఆ రాయి జనం మధ్య నుంచే వచ్చిందంటూ సీపీ రాణా సెలవిచ్చి, తెలియకుండానే అన్నయ్య సొంత మీడియా గాలితీశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ నుంచి చాలామంది సీఎంలు స్పందించి, ఖండించారు.అయితే చివరాఖరకు జగన్‌పై పడిన ఆ రాయి.. కిరాయిదేనని తేలడటంతో నోరెళ్లబెట్టడం ‘సానుభూతిపరుల’ వంతయింది.

బెజవాడ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్‌పై విసిరిన రాయి కలకలం సృష్టించింది. ఆ రాయి సమీపంలోని స్కూలు నుంచి వచ్చిందేనంటూ, జగన్ సొంత మీడియాలోఫొటో కూడా వేశారు. తర్వాత ఒకేరాయి వచ్చి ముందు జగన్‌ను, తర్వాత ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు తగిలిందన్న వైనం, వెల్లంపల్లి కన్ను’కట్టు’తో తెలిసింది. అయితే జగన్‌కు వేసిన గజమాలలోని ఇనుప తీగ ఆయన కంటిపైభాగానికి గీసుకుందని.. సోషల్‌మీడియా కథనాలతో పాటు, పోలీసు ఉన్నతాధికారులు సైతం అభిప్రాయపడ్డాయి. ఈ ఘటన వెనుక చంద్రబాబు హస్తం ఉందని, ఆయన రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకే జగన్‌పై రాయి వేశారని వైసీపీ ప్రచారం హొరెత్తించింది. చివరకు జగన్ సైతం తనపై బాబు హత్యారాజకీయాలు చేస్తున్నారని సానుభూతి పోగు చేసే ప్రచారం ప్రారంభించారు. అయితే పాపం స్థానిక సమాచారం తె లియని ప్రధాని మోదీ నుంచి స్టాలిన్ సహా పలువురు జగన్‌పై జరిగిన హత్యాయత్న(? )ఘటనను ఖండించారు.

జగన్‌పై దాడి ఘటన సమాచారం తెలిసిన వారికి ’పట్టిస్తే పదివేలు’ బహుమతి మాదిరిగా 2 లక్షల రివార్డు ఇస్తామని బెజవాడ సీపీ రాణా ప్రకటించారు. అయితే విచిత్రంగామరుసటిరోజునే.. ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని, విచారించారు. విచారణ సందర్భంగా ఆ యువకులు వెల్లడించిన వాస్తవాలు బయటకు పొక్కటంతో జగన్‌పై పడిన రాయి..కిరాయిదేనని తేలడటంతో వైసీపీ ప్రచారకర్తల పరిస్థితి కుక్కినపేను చందంగా మారాల్సిన విషాదం.

జగన్ పర్యటనకు వస్తే 350 రూపాయలడబ్బు, మందుబాటిల్ ఇస్తామని తీసుకువచ్చారట. కానీ ఆ తెచ్చిన వైసీపీ నాయకులు చేతిలో మందుబాటిల్ పెట్టి, జేబులో ఇస్తానన్న డబ్బు ఇవ్వకుండా జం పయిపోయారట. దానితో కోపం వచ్చిన ఆ యువకుడు తన కోపాన్ని జగన్‌పై రాయి వేసి తీర్చుకున్నాడట. ఇదీ జగన్‌పై విసిరిన కిరాయి కథ. అసలు ఆ రాయి విసిరన వ్యక్తికి ఏ పార్టీతోనూ సంబంధంలేదన్నది పోలీసుల కథనం. అంటే.. ఈ రెండురోజులూ వైసీపీ ప్రచారదళాలు, యూట్యూబ్ ’జనరలిస్టులు’ అది జగన్‌పై హత్యకు కుట్రేనంటూ చేసుకున్న వాంతులన్నీ.. నోట్లోబలవంతంగా వేళ్లు కుక్కుకుని చేసుకున్నవేనని స్పష్టమైంది.

అనుమానితులుగా పేర్కొన్న ఐదుగురు యువకులను పోలీసుస్టేషన్‌కు తెచ్చిన వైనం అక్కడి బడుగువర్గాల్లో తిరుగుబాటుకు కారణమయింది. ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేని తమ పిల్లలను అన్యాయంగా తీసుకువచ్చారంటూ వడ్డెర కుల స్తులంతా పోలీసుస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. 200రూపాయలిచ్చి తమను జగన్ మీటింగుకు తీసుకువెళ్లి, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదని.. పోలీసులు అదుపులోకి తీసుకున్న సతీష్ అనే యువకుడి తల్లి చెప్పిన వీడియో, ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చేస్తూ, వైసీపీ పరువును రోడ్డున పడేసింది. సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే యువకుడే. ఫుట్‌పాత్ కోసం వేసే టైల్ రాయితో సీఎంపై వేశారన్నది పోలీసుల ఆరోపణ. అతనితోపాటు ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తమవారిని విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఒంటిపై కిరోసిన్ పోసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల తీరుకు నిరసనగా డాబా సెంటర్‌లో వడ్డెర కులస్తులు భారీ సంఖ్యలో రాస్తారోకో చేయడం సంచలనం సృష్టించింది.
కాగా జగన్‌పై విసిరిన రాయి.. కిరాయిదేనని తేలడం, డబ్బులిస్తామని ఇల్లకుండా మోసం చేశారని స్వయంగా బాధితుడు సతీష్ తల్లి మీడియాకు చెప్పడం, అదికాస్తా సోషల్‌మీడియా ద్వారా ప్రపంచానికి తెలియడంతో.. జగన్‌పై బాబు హత్యాయత్నం చేయించారంటూ, రెండు రోజులనుంచి ఆరోపణలు చేస్తున్న వైసీపీ అడ్డంగా ఇరుక్కుపోయింది. ఆ పార్టీ ఆలోచనలను జనంలోకి వదిలిన యూట్యూబ్ పెద్దగొంతుల ’హింసధ్వని’ జనరలిస్టులకయితే, పాపం నోరులేకుండా పోయింది.

ఫలితంగా గత ఎన్నికల్లో కోడికత్తి.. బాబాయ్‌పై గొడ్డలిపోటు సానుభూతి దారిలోనే.. రాయిదాడిని భూతద్దంలో చూపి, దానిని జగన్‌పై హత్యాయత్నంగా మలచి, ఓట్లు ఒలుచుకోవాలన్న వైసీపీ వ్యూహం వికటించినట్లు స్పష్టమయింది. జగన్‌పై దాడి వెనుక చంద్రబాబు ఉన్నారంటూ.. ఇప్పటిదాకా ప్రచారంచేసిన గోబెల్స్ నోళ్లు మూతపడటంతో, ఇదంతా ఓట్ల కోసం వైసీపీ నడిపించిన ’సురభి కంపెనీ డ్రామా’గా ప్రజలకు స్పష్టమయింది. సో.. కిరాయి ఎవరిదో తేలింది కాబట్టి, ఇక జగన్ తన ప్రచారంలోతలపై ఉన్న బ్యాండ్‌ను తీసేస్తే మంచిదన్న వ్యంగ్య వ్యాఖ్యలు, సోషల్‌మీడియాలోనెటిజన్ల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ’’సంఘటన జరిగిన రోజు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన జగనన్న కంటిపై చిన్న బ్యాండెయిడ్ ఉంటే, తర్వాత రోజు ప్రచారంలో మాత్రం దాని సైజు పెరిగింది. సంఘటన జరిగిన రోజు మీడియాతోమాట్లాడిన వెల్లంపల్లి కన్ను మామూలుగానే ఉంది. మళ్లీ ఆయన కంటిని కవర్ చేస్తూ ఇంతపెద్ద కట్టు వేసుకున్నారు. ఎన్నాళ్లీ కనికట్టు రాజకీయాలు? సురభి నాటక కంపెనీ వాళ్లు కూడా ఈర్ష్యపోతున్న ఈ సీన్లను చూలేక చస్తున్నాం. ప్లీజ్..ఈ ఉత్తుత్తిదాడులు కాకుండా, ఇంకేదైనా కొత్తగా ఆలోచించండి’’ అని నెటిజన్లు తెగ సెటర్లు కురిపిస్తూ, ’ఫ్యాను’కు గాలిరాకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ప్రధానితో తప్పులో కాలేయించారా?
ఏపీ సీఎం జగన్‌ పై రాయిదాడి జరిగిన ఘటనకు వైసీపీ మీడియా జాతయ స్థాయిలో ప్రచారం కల్పించింది. దానితో జాతీయ మీడియా ఆరోజు నానా హడావిడి చేసింది. ఇప్పటికే జగన్ సర్కారుతో లబ్థి పొందిన జాతీయ మీడియా, ఆ మేరకు తనవంతు శ్రమదానం చేసింది. దానితో సహజంగా ప్రధాని మోదీ కూడా స్పందించాల్సి వచ్చింది. సహజంగా పార్టీలు ఏవైనా ఒక సీఎంపై దాడి చేస్తే, ఎవరైనా దానిని ఖండిస్తారు. అదేపని ప్రధాని, కొన్ని రాష్ట్రాల సీఎంలు కూడా ఖండిస్తూ ట్వీట్ చేశారు.

అయితే ఇతర రాష్ట్రాల సీఎంలంటే, జాతీయ మీడియా వార్తలు చూసి ఖండించారనుకోవచ్చు. కానీ కేంద్రానికి ప్రతి రాష్ట్రంలోసెంట్రల్ ఇంటలిజన్స్ అధికారులుంటారు. డీస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ స్ధాయి అధికారులు ప్రతి రాష్ట్రంలోనూ పనిచేస్తుంటారు. ఆయా రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై, రోజువారీ నివేదికలు పంపించడం వారి విధి. విజయవాడలోకూడా సెంట్రల్ ఇంటలిజన్స్ అధికారులు,ఆఫీసు ఉంది. కానీ అది కనీస వాస్తవాలు సేకరించపోగా, అసలు విషయాన్ని కేంద్రానికి నివేదించకపోవడం వల్లే, ప్రధాని ఆ మేరకు ఖండన ఇచ్చిఉంటారని రాష్ట్రపోలీసు వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ.. మోదీకి జగన్ దత్తపుత్రుడేనన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జరిగిన కిరాయి ఘటనపై.. ఆ స్థాయి వ్యక్తితో స్పందింపచేసి, ఇప్పుడు నిజాలు వెలుగుచూడటంతో ప్రధానిని సైతం ఇరుకున పెట్టారన్న వ్యాఖ్యలు అటు బీజేపీ వర్గాల్లోనూ వినిపిస్తుండటం విశేషం.

LEAVE A RESPONSE