Suryaa.co.in

Devotional

ఆది శంకరాచార్య: వ్యక్తిత్వం-తత్వం

1. శంకరాచార్యుడి తల్లిదండ్రులెవరు ? అతనెప్పుడు పుట్టాడు ? ఎక్కడ పుట్టాడు ? ఏమేమి చేశాడు ? ఏమి వ్రాశాడు ? ఎప్పుడు మరణించాడు ? ఎక్కడ మరణించాడు ? ఎలా మలం : ఉడు ” అతని శవాన్ని ఏమి చేశారు ? పూడ్చిపెట్టారా ? దహనం చేశారా ? ఎక్కడ ? అంత్యక్రియలు ఎక్కడ జరిపారు ? సమక్షంలో ఎవరున్నారు? శ్రాద్ధం ఎవరు, ఎలా, ఎక్కడ పెట్టారు ? లేక శ్రాద్ధం జరగనే లేదా ?

ఇలాంటి ప్రశ్నలకు శంకర చరిత్రలుగా చెప్పబడే గ్రంధాలు ఏకముఖంగా సమాధానాలు చెప్పడం లేదు. ఇప్పటికీ ఆ ప్రశ్నలకు రూఢి అయిన సమాధానాలు లేవు, పురాణంగా తప్పు చరిత్రను చరిత్రగా వ్రాయడానికి అలవాటు పడని భారతీయులు శంకరుడి చరిత్రను కూడా అభూత కల్పనలతో నింపివేశారు. దాన్ని చరిత్ర అనుకోవడానికే వీలు లేకుండా అలికివేశారు.

కాగా, శంకరుడు క్రీ॥శ॥ 788 లో పుట్టి, 820లో మరణించి వుండవచ్చునని కొందరు పాశ్చాత్య, భారతీయ చరిత్రకారులు, పరిశోధకులు తేల్చారు. వైదిక వాజ్మయం మొదలు కావ్యాదులదాక అందినంతవరకు భారతీయ సాహిత్యాన్ని సేకరించి, చీకటినుంచి వెలుగులోకి తీసి పరిష్కరించి, తమ భాషల్లోకి అనువాదం చేసి, ఆ రచనల కాలాలను, రచయితల చరిత్రలను ఆరాతీసి, భారతీయులకు తొలిసారిగా పరిచయం చేసినవారు నిజానికి పాశ్చాత్యులే.

వారి చారిత్రక పరిశోధనలో సాధ్యమైనంత సత్యనిష్ఠ, నిష్పాక్షికత కన్పిస్తుంది. మన చారిత్రకుల్లో చాలామందికింకా పురాణం గబ్బుపోలేదు. చరిత్రను నిష్పాక్షికంగా చూడటానికి మన వారికి కుల మత శాఖల దురభిమానాలు, సంకుచిత మానసిక సంస్కారం అడ్డువస్తాయి. అందువల్ల మన చారిత్రకులిప్పటికీ తెలుపును నలుపుగా, నలుపును తెలుపుగా చూపుతున్నారు. అలా తెలుపుగా ప్రదర్శితమైన నలుపుల్లో శంకరాచార్యుడి చరిత్రకూడా వుంది.

దాన్ని జాగ్రత్తగా విశ్లేషించి చూస్తే కాని శంకరుడి కథా కమామిషు బోధపడవు. అతని శీలం, కృషి, వ్యక్తిత్వం, స్వకీయ తత్వం వగైరాల నిజస్వరూపాన్ని అంచనా వేయబోయేముందు, ఈ దేశంలో భావతిరోగమన చరిత్రలో అతను నిర్వహించిన పాత్ర ఎంత కుత్సితమైనదో పరిశీలించబోయేముందు, అతనిజీవితాన్ని గురించి స్థూలంగానైనా తెలుసుకోవాలి. అందుకు ముఖ్యాధారం శంకరవిజయాల పేరుతో వెలసిన పురాణాలే. వాటి ప్రకారం శంకరుడి జీవిత ఘట్టాలు ఇలా వున్నాయి:

శంకరుడేమేమి చేశాడంటున్నారు ?
శంకరుడు కేరళ రాష్ట్రంలో నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. తల్లి గర్భంనుంచి ఆయన బయటపడకముందో, పడిన తరవాత కొద్దికాలానికో తండ్రి మరణించాడు.
ఐదోయేట శంకరుడికి ఉపనయనం జరిగింది. పిన్ననాడే గురుకులవాసంలో వేదవేదాంగపురాణేతిహాసాలను అధ్యయనం చేసాడు. ఆకాలంలోనే శంకరుడొక బ్రాహ్మణి యింటికి భిక్షకోసం పోగా, ఇంటిలో మరేమీ లేనందువల్ల ఆ గృహిణి ఒక ఉసిరికాయను భిక్షవేసింది. ఆమె పేదరికాన్ని గ్రహించిన శంకరుడు “కనకధారాస్తోత్రం” చేయగా ఆ యింటి ముంగిట బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది.

ఇది బాల శంకరుడి మహత్యం -1.
శంకరుడి తల్లి ఒక రోజు పూర్ణానదికి స్నానంకోసం వెళ్ళివస్తూ దారిలో పడిపోయింది. అది గమనించిన శంకరుడు తన యోగ మహిమతో పూర్ణానదిని తన యింటి ముందుగా ప్రవహించేటట్లుగా చేసాడు.
ఇది మహత్యం -2
శంకరుడు తన యెనిమిదోయేట నదిలో స్నానం చేస్తుంటే, మొసలి ఒకటి ఆయన కాలు పట్టుకొన్నది. సన్యసించడానికి తనకు అనుమతిస్తే మొసలి వదలి పెడుతుందని శంకరుడు తల్లితో అన్నాడు. ఆమె అలానే అనుమతించింది. వెంటనే మొసలి శంకరుణ్ణి వదలి వెళ్లింది.
ఇది మహత్యం -3.
సన్యసించిన శంకరుడు గోవిందపాదుని వద్దకుపోయి, శిష్యరికం చేసి, అద్వైత వేదాంతవిద్యలో పండితుడైనాడు. ఒకనాడు గురువు ధ్యానముద్రలోవుండగా, కుంభవృష్టివల్ల రేవానది పొంగి పొర్లుతుంటే, శంకరుడు తన మంత్ర శక్తితో ఆ నదిలోని నీటిని మొత్తాన్నీ మట్టి ముంతలో పట్టివేశాడు.
ఇది మహత్యం -4.
అనంతరం గోవిందుని ఆదేశం ప్రకారం శంకరుడు కాశీ నగరం చేరాడు. దక్షిణాది నుండి వచ్చిన సనందనుణ్ణి శిష్యుడిగా స్వీకరించాడు. ఒకనాడు శంకరుడు గంగానది అవతలి ఒడ్డునవున్న సనందనుడ్ని ఇవతలి ఒడ్డుకు రమ్మని పిలిచాడు. అతను వెనకా ముందు చూడకుండా నదిలో నడక సాగించాడు. అద్భుతంగా అతనిపాదాల క్రింద పద్మాలుచేరి, అతను నీటిలో మునగకుండా ఈ దరికి నీటి పై నడిపించేందుకు తోడుపడినై. ఆ కారణంగా అతను పద్మపాదుడైనాడు.
ఇది మహత్యం -5.
కాశీలో వుండగా శంకరుడొకనాడు గంగాస్నానం చేసి తిరిగి వస్తుండగా శివుడు నాల్గువేదాలను వేటకుక్కలుగా మార్చుకొని చండాల వేషంలో యెదురైనాడు. శంకరుడతన్ని తొలగిపొమ్మన్నాడు. “అంతా బ్రహ్మమేనంటున్నావుకదా, ఈ శరీరాన్ని తొలగమంటావా, లోపలి చైతన్యాన్ని తొలగమంటావా!” అని చండాలుడు ప్రశ్నించాడు. దానితో తనకు అజ్ఞానం నశించి అద్వైత బ్రహ్మతత్వం అర్థమైందని “మనీషా పంచకం” పేరుతో శంకరుడు ఐదు శ్లోకాలు చెప్పాడు. ఆ వెంటనే “మాయాపంచకం” కూడా చెప్పాడు. ఇందులో శంకరుడు తానుగా చేసిన మహత్యం ఏమీ లేకపోయినా, ఆయన జీవితంలో జరిగిన మహత్యంగా దాన్ని అద్వైతులు కొనియాడతారు. ఇంతకుముందు తనకు అర్థంకాకుండానే తాను ఇతరులకు బోధించిన అద్వైతం శంకరుడికిప్పుడు అర్థం కావడమే అద్భుతం. ఇందులో శివుడు చండాలుడిగా, వేదాలు కుక్కలుగా మారడం మరో అద్భుతం.

కాశీలో వుండగా శంకరుడు ప్రస్థానత్రయానికి భాష్యాలు వ్రాశాడు. ఆ తర్వాత కాశీ విడిచి విగ్రహాలు ప్రతిష్టించుకుంటూ హరిద్వారం, హృషీకేశం, బదరి, కేదారం మొదలైన హిమవత్రాంతమంతా తిరిగాడు. అనంతరం వైదిక కర్మనిష్టుడైన కుమారిలభట్టును ఓడించడానికి బయలుదేరాడు. తాను ముసలివాణ్ణనీ, మండనమిశ్రుని ఓడిస్తే తనను ఓడించినట్లేననీ, కాబట్టి మండనుడి వద్దకు వెళ్ళి వాదించమనీ కుమారిలుడు సలహాయిచ్చాడు.

మండనమిశ్రుడి యింటికి వెళ్ళిన శంకరుని చూచి ఆ యింటి గుమ్మంలోని ఎనిమిది చిలుకలు శాస్త్ర చర్చ ప్రారంభించడం శంకరుని ఆశ్చర్యచకితుని చేసింది. మండనుడు గృహద్వారాలన్నీ మూసివేసి, లోపల శ్రాద్ధక్రతువులో వున్నాడు. గోడలు దూకితేతప్ప, లోపలికి వెళ్ళడానికి వీలులేదు. ఇంతలో ఈడిగవాడొకడు మంత్ర ప్రభావంతో తాటి చెట్టును వంచి, కల్లు గీయడం కన్పించింది. ఈడిగవానికి బంగారం చేసే విద్యనేర్పి అతనివద్ద నుంచి శంకరుడు చెట్లనువంచే విద్య నేర్చుకొన్నాడు. మండనుడి దొడ్డిలోని కొబ్బరి చెట్టును వంచి, దానిమీదుగా యింటిలోనికి ప్రవేశించాడు.

మండనుణ్ణి శాస్తారంలో వాదానికి పిలిచి, అతని భార్య ఉదయభారతిని మధ్యవర్తిగా వుంచుకొని శంకరుడు శాస్త్ర చర్చ చేశాడు. మండనుడి మెడలోని పూలదండ వాడిపోవడాన్ని బట్టి చర్చలో అతను ఓడిపోయాడని తేలింది. ఒప్పందం ప్రకారం మండనుడు ముండనం చేయించుకొని సన్యాసం స్వీకరించాలి. అందుకు ఉదయభారతిఅడ్డువచ్చి తనను కూడా కామశాస్త్ర చర్చలో గెలవమని కోరగా, శంకరుడు గడువడిగి, అమరుకుడనే రాజు శవంలో పరకాయ ప్రవేశం చేసి, అతని భార్యలు నూరు మందితో కామకేళిలో తేలి, ఆ అనుభవ జ్ఞానంతో ఉదయభారతిని కామచర్చలో ఓడించాడు. ఇందులోని విడ్డూరాలు చిలుకల శాస్త్ర చర్చ, చెట్టును వంచే మంత్రాలు, బంగారం చేసే విద్య, వాదంలో వోటమికి పూలదండ వాడడం, పరకాయ ప్రవేశం. అంతేకాదు, ఓడిపోయిన ఉదయభారతి బ్రహ్మలోకానికి వెళ్ళబోతుంటే, శంకరుడామెను వనదుర్గా మంత్రంచేత బంధించాడు. ఆమె ఢూలోకంలో వుండిపోవడానికి ఒక షరతు విధించింది. దాని ప్రకారం, అతను వెనక్కి తిరిగి చూడకుండా వున్నంత కాలం ఆమె అతని వెంటబడి వస్తుంది. శృంగేరి ప్రాంతం చేరుకునేటప్పటికి ఆమె గజ్జలరవళి విన్పించలేదు, ఆపై శంకరుడు వెనక్కు తిరిగి చూడగా అక్కడే ఆమె శిల అయిపోయింది. ఇదొక మహత్యం. ఇదే గాధలో మరొక మహత్యం కూడా వుంది. అమరుకుడి భార్యలు శవాలను దహింపజేయిస్తూ, శంకరుడి కళేబరాన్ని కూడా దహింపజేయించడం ప్రారంభించారు. అంతలో శంకరుడు అమరుకుడి కాయాన్ని వదలి నిజకళేబరంలో దూరాడు. అప్పటికే సగం కాలిపోయిన అతని కాళ్ళు లక్ష్మీనృసింహ స్తోత్రం చేయగా తిరిగి మొలిచాయి.

ఒకనాడు నాస్తికుడొకడు కరిగించిన సీసాన్ని తెచ్చి “అంతా బ్రహ్మమయం అంటున్నావు కదా, దీన్ని త్రాగండి” అన్నాడు. శంకరుడా సీసాన్ని గటగట త్రాగివేశాడు.
మరోసారి కాపాలికుడొకడు భైరవుడికి బలి యివ్వడంకోసం శంకరుడి శిరస్సు కావాలని కోరాడు. శిష్యులెవ్వరూ లేనప్పుడు అలానే తీసుకుపొమ్మన్నాడు శంకరుడు. శంకరుడు ఒంటరిగా ఉన్నప్పుడు అతని శిరస్సు ఖండించడానికి కాపాలికుడు రాగా, పద్మపాదుడీ విషయాన్ని దివ్యదృష్టి ద్వారా తెలుసుకుని, నరశింహావతారంలో ప్రత్యక్షమై కాపాలికుణ్ని సంహరించాడు.
శాక్తుడొకడు చేతబడి చేసి శంకరుడికి భగందర రోగం రప్పించాడు. పద్మపాదుడు ఎదురుచేతబడి చేసి, శాక్తుణ్ని సంహరించి శంకరుడి రోగాన్ని కుదిర్చాడు.

శంకరుడి తల్లి అవసాన దశలో వుండి శంకరుణ్ని స్మరించింది. అతను యోగ శక్తితో తల్లి వద్దకు చేరి శివ భుజంగ స్తోత్రం విన్పించాడు. ఆమెను కైలాసానికి తీసుకుపోవడానికి శివభటులు వచ్చారు. వారితో పోవడానికి ఆమె ఇష్టపడలేదు. తరవాత శంకరుడు విష్ణుస్తోత్రం చేశాడు. విష్ణుదూతలు వచ్చి ఆమెను వైకుంఠానికి తీసుకుపోయారు. తల్లికి వైష్ణవంమీద, కొడుకుకు శైవంమీద భక్తి అని దీన్ని బట్టి అర్ధంచేసుకోవలసి వస్తుంది. సన్యాసి శ్రాద్ధం చేయడం శాస్త్ర సమ్మతం కాదు. అందువల్ల అక్కడి బ్రాహ్మలు శంకరుడి తల్లి శవాన్ని దహించడానికి స్మశానంలో చోటివ్వలేదు, నిప్పు యివ్వలేదు. శంకరుడు తన భుజాలు మధించి, నిప్పు పుట్టించి తన యింటి పెరట్లోనే శవదహనం చేశాడు. ఛాందసుల సహాయనిరాకరణకు కోపించి “ఇకపై నంబూద్రి బ్రాహ్మలు తమ పెరళ్ళలోనే దహనం చేసుకోవాలి, వారి యిళ్ళలో సన్యాసులు భిక్షచేయరు” అని శంకరుడు శపించాడు. నంబూద్రి బ్రాహ్మల్లో ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది.

పసితనంనుంచి మందమతిగా, మూగగా వున్న ఒక బిడ్డను ఆ బిడ్డ తండ్రి శంకరడి వద్దకు తీసుకుపోయాడు. శంకరుడా బిడ్డను “నీవెవరవు” ? అని ప్రశ్నించాడు, వెంటనే ఆ బిడ్డడు తాను చిదానందజ్యోతిని అంటూ డజను శ్లోకాలు చెప్పాడు. అలా చెప్పినవాడే శంకరుడి శిష్యుడై, హస్తామలకుడైనాడు.

గిరి అనే మందమతి శిష్యుణ్ని అతని సహాధ్యాయులంతా హేళన చేస్తుండేవాళ్ళు. శంకరుడతనికి తోటకవృత్తం నేర్పి జ్ఞానిని చేశాడు. అతడే శంకరుడి శిష్యుడైన తోటకాచార్యుడు.
సుధన్వుడనే ఉజ్జయిని రాజు తోడురాగా, శంకరుడు శిష్యులతో కలసి అద్వైత సిద్ధాంత ప్రచారం కోసం దిగ్విజయ యాత్రలు చేశాడు. శాక్తుల్ని ఓడించాడు. భైరవుల్ని ఓవించాడు. కాపాలికుల్ని తుడిచిపెట్టాడు. గోకర్ణంలో శైవాచార్యుడైన నీలకంఠుణ్నీ, ద్వారకలో వైష్ణవుల్నీ, ఉజ్జయినిలో భట్టభాస్కరుణ్నీ ఓడించాడు. తూర్పున పూరీజగన్నాధంలో, దక్షిణాన శృంగేరిలో, పడమర ద్వారకలో, ఉత్తరాన బదరీలో పీఠాలను స్థాపించి వాటికి వరుసగా హస్తామలకుణ్ణి, సురేశ్వరుణ్ణి (మండనుడు), పద్మపాదుణ్ణి, తోటకాచార్యుణ్ణి పీఠాధిపతులుగా నియమించి- వర్ణాశ్రమాచార ధర్మాలను కాపాడడానికి వారికి బాసటగా, ధర్మరక్షకుడిగా సుధన్వుడ్డి నియమించాడు.చివరకు కాశ్మీరు వెళ్ళి సర్వజ్ఞపీఠం అధిష్టించాడు. ఆ తరవాత శంకరుడేమైందీ చెప్పడానికి వీలులేనన్ని కట్టుకథలు వ్యాపించినై.ఇదీ స్థూలంగా శంకరుడి కథ. శంకర విజయాల కథనం.

శంకరుడేమిగా మనకు తేలతాడు ?
ఇందులో కల్లబొల్లి కథలన్నిటినీ తీసివేస్తే ఇక శంకరుడి చరిత్రగా చెప్పుకోడానికి మిగిలేదేమీ లేదు. మిగిలినదైనా యథాతథంగా నిజమనుకోడానికి వీలులేదు.
శంకరుడు కరుణామయుడనికానీ, సజ్జనుడనికానీ, నీతివంతుడని కానీ రుజువు
చేయగల సంఘటన ఒక్కటీ అతని కథలో కన్పించదు. అహింసాపరుడనడానికిగానీ, శీలవంతుడనడానికి కానీ ఒక్క తార్కాణం అతని చరిత్రలో కన్పించదు. అందుకే అతని చప్పటి కథను మహత్యాలతో నింపేశారు. చివరకు గోడలు దూకి యింట్లో జొరబదదాన్ని కూడా మహత్యంగా చిత్రీకరించారు. వాగ్వివాదంలో శంకరుడు ఓడించినట్లు చెప్పబడిన వారిలో వైదికకర్మనిష్ఠులు తప్ప, ప్రసిద్ధ దార్శనికులెవ్వరూలేరు. ఆయన డీకొన్నట్లు పేర్కొనబడ్డ దార్శనికుల్లో కొందరు ఆయన సమకాలీనులనడానికి కూడా నిర్ధారణపూర్వకమైన ఆధారాలు లేవు.

శంకరుడి చేష్టలు అతన్ని అద్వైతి అని రుజువు చేయజాలవు. ఆయన అనేక దేవాలయాలు దర్శించాడు, విగ్రహాలను పూజించాడు, కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించాడు, పాత విగ్రహాలకు పునః ప్రతిష్ఠలు చేశాడు. మఠాలన్నింటిలోను శివలింగాలను ప్రతిష్ఠించాడు. అనేక మంది దేవతలకు స్తోత్రాలు, స్తవాలు చెల్లించాడు. అదున రచనలుగా చెప్పబడే స్తోత్రాలు వందలాదిగా వున్నాయి. ఇవేవీ అతను చేయకపోతే, ఇంకా అతను చేసిందేమిటి?

బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు, దశోపనిషత్తులకు భాష్యాలు రాశాడని గొప్పలు చెప్పుకొన్నందువల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే శంకరుడి కథను, అతని పేరవున్న గ్రంథాలను పరిశీలిస్తే అతను అభ్యుదయ భావాలను దెబ్బకొట్టాడని తేలుతుంది. భావ వాదాన్ని ప్రచారం చేసి, వర్ణవ్యవస్థను పునరుద్ధరించి, తద్వారా భారత సమాజానికి తీరని ద్రోహం చేశాడని తేలుతుంది.

వ్యక్తిగత విమర్శ-వ్యక్తిత్వ విమర్శ
శంకరుడు మహామేధావి అనే కల్లబొల్లి ప్రచారం జోరుగా జరిగింది. కాని, అందుకు రుజువు ఆయన రచనల్లో కన్పించదు. ఆయన్ని చదివినవారికంటే చదవనివారే ఆ ప్రచారం ముమ్మరంగా ఇప్పటికీ చేస్తున్నట్లు కన్పిస్తుంది. హిందూ మతాన్ని ఉద్దరించిన వారినందరినీ మహా పురుషులుగా వర్ణించడమే ఈ దేశ చరిత్ర రచనలో వరవడి అయింది. అందువల్ల విప్లవ ప్రతీఘాతక శక్తులకు సైద్ధాంతిక నాయకత్వం వహించిన శంకరుడికి అనుచిత ప్రచారం లభించడంలో మనం ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఇక్కడి భావ తిరోగమన చరిత్రకు అది మరో సాక్ష్యమవుతుంది.

శంకరుడి కథలో మనం పేర్కొన్న ఘట్టాలన్నీ శంకరాద్వైతులు వ్రాసిన గ్రంథాలలోనివే. శంకరుడి వ్యక్తిత్వాన్ని గొప్పచేయాలనే ఉద్దేశమే వాటి గ్రంధీకరణలోవారి లక్ష్యం. ఆ ఘట్టాలనే మనం పేర్కొని, వాటిలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శ అని వేలెత్తి చూపే ప్రబుద్ధులున్నారు. అంతగా ఖండనీయమైన అపభ్రంశ చరిత్రను శంకర శిష్యులు ఎందుకు క్రోడీకరించారబ్బా అనే ప్రశ్న అలాంటి వారికి రాదు. మనం శంకరుడి అద్వైత తత్వాన్ని, ప్రస్థానత్రయభాష్య పాండితీవైభవాన్ని పరిశీలించాలికానీ, పరకాయ ప్రవేశకథలాంటి వ్యక్తిగత విషయాలు మాట్లాడటం మంచిది కాదనీ, అవి ఈ సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడవనీ సెలవిచ్చే శుద్ధతాత్వికులు, పరిశుద్ధ చరిత్రకారులు ఎక్కువైనారు.

శంకరుడి ఘనకార్యాలుగా, మహత్యాలుగా ఆయన చరిత్రకారులు వుటంకించిన అంశాలను ప్రశ్నించడం ఎలా వ్యక్తిగతమవుతుంది ? పరకాయ ప్రవేశాన్నే తీసుకుందాం : అందులో ఏది వ్యక్తిగతం ? పరకాయ ప్రవేశం శంకరుడి సిద్ధాంతంలో భాగం కావడం వ్యక్తిగతమా ? ఆ ప్రక్రియ చేయడం చాలా సులువని సాక్షాత్తు బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరుడు వ్రాయడం వ్యక్తిగతమా ? ఆ పని ఆయన చేసినట్లు ఆయన అనుయాయులు ఆయన జీవిత చరిత్రలో వ్రాయడం వ్యక్తిగతం కాదా? వారు చరిత్రగా వ్రాసినదాన్ని మనం ప్రశ్నించడం వ్యక్తిగతమవుతుందా?

రాజు వేషం వేసుకొని, అతని భార్యల్ని మోసంచేసి, హిప్నటైజు చేసి, వారియిష్టాలకు వ్యతిరేకంగా శంకరుడు మానభంగం చేశాడనడం వ్యక్తిగతమవుతుందా ? దాన్ని మహత్యంగా వర్ణిస్తే వ్యక్తిగతం కాదా ? శంకరుడి అంతవాడు అలాంటి అత్యాచారం చేయగా లేనిది తాము చేస్తే మాత్రం తప్పేముంది అనే దుర్భావం ప్రజల్లో వ్యాపించదా ? అలాంటి ఉదాహరణల్ని స్వయంగా శంకరుడే కోటిచేశాడు కదా ? వాటి ప్రభావం సమాజం మీద పడదా ? దాన్ని ఖండించడం సామాజిక న్యాయంలో భాగం కాదా ? శంకరమహత్యాల్లో భాగంగా ఆ గాధను శంకరులిప్పటికీ ప్రచారం చేయడం లేదా ? దాన్ని కొనియాడితే కాని వ్యక్తిగతం, విమర్శిస్తే అవుతుందా ? అందువల్ల అమాయకుల్ని మోసం చేయడానికి పనికివచ్చే శంకరకథల్ని ఖండించి ఎండగట్టడం ఆవశ్యకమే అవుతుంది. దుర్మార్గాలను ప్రశ్నించడం వ్యక్తిగతమైతే, ఇక కానిదేమిటి?

చేసిన ఘోరాలనుంచి శంకరుడి వ్యక్తిత్వాన్ని కాపాడడంకోసం అద్వైత జపం చేయడం, శ్రీరంగనీతులు వల్లించడం, దార్శనికత పేరుతో దగుల్బాజీ సమర్ధనలు సాగించడం సరైన పద్దతి కాదు. కొత్త భావాలను పాత పద్ధతిలో చెప్పడం, పాత భావాలకు కొత్త తాత్విక రంగు పూయడం మన సంప్రదాయంలో సాగుతూ వచ్చిన పురాణరోగం. హానికరమైన ఆ రోగం కుదిరితేగాని, ప్రగతి సాధనకు మార్గం సుగమంకాదు.

LEAVE A RESPONSE