సింగరాయకొండ : వైసీపీకి చెందిన వారినే అధికార పార్టీ నేతలు ఒంగోలులోని మంత్రి సురేష్ కార్యాలయానికి తీసుకెళ్లి ఆయన చేత పార్టీ కండువాలు కప్పించారు. టీడీపీకి చెందిన వార్డు సభ్యుడు, 20 కుటుంబాలు వైసీపీ తీర్థంపుచ్చుకున్నట్లు ప్రకటించారు. ఆ విషయమై వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టి నవ్వులపాలయ్యారు.
మంత్రి సమక్షంలో జరిగిన చేరికల ఫొటోను చూసి అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు విస్తుపోయారు. వైసీపీకి చెందిన వారికే కండువాలు కప్పి టీడీపీ వారు పార్టీలో చేరారని చెప్పడాన్ని తెలుగుదేశం నేతలు ఖండించారు. సోమవారం రాత్రి స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆపార్టీ నేతలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని ఊళ్లపాలెం పంచాయతీలో టీడీపీ మద్దతు వార్డు సభ్యులుగా ఆరుగురు గెలిచారని తెలిపారు. వారంతా పార్టీలోనే కొనసాగుతున్నారన్నారు.
వైసీపీ మద్దతుతో 11వ వార్డు సభ్యురాలిగా గొల్లపోతు ఈశ్వరమ్మ గెలుపొందారని చెప్పారు. అయితే సోమవారం వైసీపీకి చెందిన ఈశ్వరమ్మ భర్త గొల్లపోతు శ్రీనివాసులు, ఆ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలకు మంత్రి సురేష్ చేత కండువాలు వేయించి టీడీపీకి చెందిన వారు చేరినట్లు ప్రకటనలు చేసారు.