దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో మంత్రి కేటీఆర్ ను కలిసిన ఆదిత్య థాకరే
మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే, మంత్రి కే.టి.ఆర్ ను దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఐటి, లైఫ్ సైన్సెస్, ఫార్మా వంటి రంగాల్లో సాధిస్తున్న పురోగతి పైన చేపట్టిన కార్యక్రమాలపై ఆదిత్య థాకరే ఆసక్తి చూపించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం, మున్సిపల్ మరియు పంచాయతీ చట్టాల్లో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించడం వంటి కీలకమైన సంస్కరణలను కేటీఆర్ ఆదిత్య థాకరేకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలపై మరింత అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ వస్తానని ఆదిత్య థాకరే తెలిపారు.
ఈ సందర్భంగా మహారాష్ట్రలో పట్టణ అభివృద్ధిలో చేపట్టిన పలు అంశాల పైన ఆదిత్య థాకరే మంత్రి కేటీఆర్ కి వివరాలు అందించారు. పరస్పరం కలిసి పని చేసినప్పుడు రాష్ట్రాలు బలోపేతం అవుతాయని, తద్వారా బలమైన దేశం రూపొందుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.