-జగన్మోహన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి, సాయి రెడ్డికి సాక్షి దినపత్రికకు సంబంధం ఏమిటి?
-అసెంబ్లీ నియోజకవర్గాలలో బలాబలాలను బట్టి డిసైడ్ చేసుకోనున్న ఇరు పార్టీల పెద్దలు
-చంద్రబాబు నాయుడు మంచిపనులను ప్రజలకు తెలిసోచ్చేలా చేసిన జగన్మోహన్ రెడ్డి
-లోకేష్ యువ గళం 2.0 పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్యస్పందన
-జగన్మోహన్ రెడ్డి చేసిన చిలిపి నీటి యుద్ధాన్ని పసిగట్టిన తెలంగాణ ప్రజలు
-పార్లమెంటులో ఏ ఒక్కనాడు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడలేదు?
-అయితే… జగన్మోహన్ రెడ్డి కేసుల మాఫీ గురించి, లేదంటే నా డిస్ క్వాలిఫికేషన్ గురించే మాట్లాడింది నిజం కాదా??
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అనేది ఆ రెండు పార్టీల అంతర్గత వ్యవహారమని, దానితో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, సాయి రెడ్డికి సంబంధం ఏమిటని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…
అసెంబ్లీ నియోజకవర్గాలలో రెండు పార్టీల బలాబలాల ఆధారంగా సీట్లను సర్దుబాటు చేసుకుంటారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఓడించాలని చూస్తోందని సాక్షి దినపత్రిక వార్తా కథనాన్ని రాయడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను ఓడించడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడగకుండా చూడాలన్నదే తెలుగుదేశం పార్టీ కుట్రగా సాక్షి దినపత్రిక తన వార్తా కథనంలో అభివర్ణించింది .
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు అభిమానులు, జనసేన అభ్యర్థులు పోటీ చేసే చోట వారికే ఓటు వేస్తారు. అలాగే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయని తెలుగుదేశం పార్టీ, ప్రచారం నిర్వహించాలనుకోవడం కూడా అత్యాశే అవుతుంది. తెలంగాణలో ప్రధానంగా రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుంది. బిజెపి కూడా రేసులో ఉంది. బిజెపితో పవన్ కళ్యాణ్ జట్టు కట్టారు. తెలంగాణలో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నది ముఖ్యం కాదు. కలిశారా లేదా అన్నదే ముఖ్యం. తెలంగాణలో బిజెపి, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ కలిసే ఉన్నాయి. తదుపరి ఎన్నికల్లో ముగ్గురు కలిసి పోటీ చేస్తారన్న భావన ప్రజల్లో ఉంది.
ఆ భావనే మా పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుట్టిస్తోందని రఘురామకృష్ణం రాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే, పార్టీ నుంచి వెళ్ళిపోవాలని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడూ ఆయన మంచిగానే మాట్లాడుతారు , ఎప్పుడు పవన్ కళ్యాణ్ మంచిగా మాట్లాడినా ఆయనకు నేను అభినందనలను తెలియజేస్తాను. ప్రభుత్వ పెద్దలు ప్రేరేపించిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ అనుచరులుగా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే గెటవుట్ అని చెప్పకనే పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అదే మాట చెబుతున్నారు.
ప్రతి సందర్భంలోనూ జనసేనతో మనం కలిసే వెళ్తున్నామని స్పష్టం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను అగ్రజుడిగా గౌరవిస్తూ నారా లోకేష్ ముందుకు వెళ్తున్నారు. ఎంతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన జనాలు, జన సైనికులలో కసి కనిపించడం లేదని మా పార్టీ నాయకులు బాధపడుతున్నారు. ఇంకా ఎంత బాధ పడిన లాభం లేదు. ఎందుకంటే నో బడీ కెన్ బ్రేక్ దిస్ ఫ్రెండ్షిప్. సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని మేము చూసుకుంటాం… నీకేమిటి సంబంధం. నీ పని నువ్వు చూసుకొమ్మా జగన్మోహన్ రెడ్డి అంటూ రఘురామకృష్ణం రాజు సవినయంగా మనవి చేశారు.
చంద్రబాబు నాయుడు ఎంతో మంచి చేస్తే… జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎంతో అన్యాయాన్ని చేశారు
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులను ప్రజలకు తెలుసొచ్చేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారేమోనని అనిపిస్తోందని రఘురామకృష్ణం రాజు అన్నారు. చంద్రబాబు నాయుడు పై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడం ద్వారా, ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులను అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నో మంచి చేస్తే, జగన్మోహన్ రెడ్డి ఏమిటి ఆయన కు ఇంత అన్యాయం చేశారని ప్రజలు రియలైజ్ అయ్యారు.
ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తే రాష్ట్ర ఖజానాకు ఆదాయం గండి పడిందని వెంకట్ రెడ్డి అనే అధికారి ఫిర్యాదు చేయగా, సిఐడి కేసు నమోదు చేసింది. ఉచితంగా ఇసుక పంపిణీ ద్వారా నిర్మాణ రంగాన్ని చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారు. అది కూడా తప్పే అన్నట్టుగా కేసు నమోదు చేయడం ఈ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఇలాగే చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులపై కేసులు పెట్టుకుంటూ వెళ్లండని, అప్పుడు ప్రజలు మరింతగా చంద్రబాబు నాయుడుకు చేరువ అవుతారంటూ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. నాణ్యమైన మద్యాన్ని విక్రయించడం ద్వారా ఆసుపత్రులకు ఎంతో నష్టం వాటిల్లిందని ఫిర్యాదు చేస్తే, సిఐడి చీఫ్ సంజయ్ కేసు నమోదు చేస్తారన్నారు.
ఇలాంటి తింగరి కేసులు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోండి. రక్తహీనత గురించి విన్నాం. మా వాళ్లుకు బుద్ధిహీనత ఎక్కువైంది. బుద్ధిహీనతకు మందులు లేవు. తెదేపా వారు తాము చేసిన మంచి పనులు చెప్పుకోవలసిన అవసరం లేకుండానే, వారి కీర్తిని మన కేసుల ద్వారా తెలియజేస్తున్నాం. గన్నవరం నుంచి కృష్ణానది ఒడ్డున ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకోవడానికి ఆయనకు ప్రస్తుతం 6 గంటల సమయం పడితే, ఇలాగే అక్రమ కేసులను నమోదు చేస్తే 10 గంటల సమయం పట్టే పరిస్థితి ఎంతో దూరంలో లేదన్నారు.
తెదేపా శ్రేణుల్లో నూతన ఉత్సాహం
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువ గళం 2.0 పాదయాత్ర ద్వారా ఆ పార్టీ శ్రేణులలో నూతన ఉత్సాహం కనిపిస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. యువ గళం 2.0 పాదయాత్ర ప్రారంభమైన తరువాత మరింత దూకుడుగా, పుష్పా చిత్రంలో అల్లు అర్జున్ మాదిరి మేనరిజంతో తగ్గేదేలే అన్నట్టు గా లోకేష్ ప్రసంగాలు కొనసాగుతున్నాయి. లోకేష్ ప్రసంగాలకు ప్రజల నుంచి చక్కటి ప్రతిస్పందన లభిస్తోంది.లోకేష్ చెప్పే డైలాగులకు
ప్రజలు కేరింతలు కొట్టడం చూస్తుంటే, అయిపోయావు జగన్… అయిపోయావని ప్రతి ఒక్కరూ అంటున్నారు. కోనసీమతో పాటు కాకినాడలో అదే ఊపు కనిపించింది. పిఠాపురంలోనూ ఒక దానికి మించి మరొకటి లోకేష్ పాదయాత్ర సభలు సక్సెస్ అవుతున్నాయి.
లోకేష్ జోరు చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గుండె బేజారేనని అనడంలో ఎటువంటి సందేహం అక్కరకు లేదు. ఇక చంద్రబాబు నాయుడు రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలై కృష్ణానది ఒడ్డున ఉన్న నివాసానికి చేరుకోవడానికి 14 గంటల సమయం అవసరమా అని మిల్లెట్ రెడ్డి, సుధాలు ఏడ్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి శుక్రవారం నాడు ఆయన తన నివాసానికి చేరుకోవడానికి 6 గంటల సమయం పట్టింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోయినప్పటికీ, జనం పోటెత్తారు. ఇదేమి జగన్మోహన్ రెడ్డి సభలకు బలవంతంగా జనాలను తీసుకొచ్చినట్లు తీసుకువచ్చిన జనం కాదు. చంద్రబాబు నాయుడు అరెస్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలయ్యారేమోనని ప్రజల ప్రతిస్పందన చూస్తే అర్థమవుతుందన్నారు..
ప్రజలేమైనా వెర్రి పప్పలని అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ముందు రోజు పల్నాడు పోలీసులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఎవర్ని అరెస్టు చేస్తారేమోనని అనుకుంటుండగా, అకస్మాత్తుగా తన కిం కర్తవ్యం గుర్తు వచ్చినట్లు నీటి యుద్ధం పేరిట… చిలిపి యుద్ధాన్ని చేశారు . పల్నాడు నుంచి వెళ్ళిన పోలీసులు నాగార్జునసాగర్ గేట్లను స్వాధీనం చేసుకున్నారని సాక్షి దినపత్రికలో వార్త కథనంగా రాశారు. అయితే దీన్ని దండయాత్ర గా ఒక ప్రముఖ దిన పత్రిక పేర్కొనడాన్ని, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తప్పు పట్టారు. మా భూభాగంలోకి మేము వెళ్తే దాన్ని దండయాత్ర అంటారా అని ఆయన ఆక్షేపించారు.
మరి మీ భూభాగంలోకి ఇప్పుడే ఎందుకు వెళ్లారు . ముందే వెళ్ళవచ్చు కదా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఒక్కరోజు ముందే ఎందుకు వెళ్లారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. అటు ఇటు మోహరించిన వాటర్ వారియర్స్ ప్రజల్ని వెర్రి పప్పలని అనుకుంటున్నారా ఉంటూ నిలదీశారు. ప్రజలయితే ఒరేయ్ తింగరి నా కొడుకుల్లారా మీ ఆటలన్నీ మాకు తెలుసు అని అనుకుంటున్నారన్నారు. సరైన సమయంలో సరైన తీర్పును ఇస్తామని నిర్ణయానికి వచ్చారని తెలిపారు. మరి ఇంత డ్రామా నా?, ఇంతటి బ్లేటెంట్ డ్రామానా అమ్మ జగన్ జనమేమైనా పిచ్చోళ్లా?, పార్లమెంటులో ఒక్క నాడైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారా? తెలంగాణ నుంచి రావలసిన బకాయిల గురించి అడిగారా? ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారా?అంటూ నిలదీశారు.
కనీసం ప్రత్యేక హోదా గురించి మేము అడుగుతాం … సీరియస్ గా తీసుకోవద్దని, ప్రస్తుతం నీటి యుద్ధం చేసినట్లుగా చిలిపి యుద్ధమైనా చేశారా?, మనపై ఉన్న కేసుల దృష్ట్యా కనీసం చిలిపి యుద్ధాన్ని కూడా చేసే సాహసం చేయలేదు. కేవలం రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని, సిబిఐ చేత కేసులు నమోదు చేయించాలని మాత్రమే అడిగారు. తనపై 30 కేసులు ఉన్నాయి కాబట్టి రఘురామకృష్ణం రాజు పై మూడు కేసులు కూడా లేకపోతే ఎలా అన్న ధోరణితో ఒక్క అవకాశం ఉంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వ్యక్తిగత అవసరాల కోసం వాడేసుకుని, రాష్ట్రాన్ని సంక నాకించారు.
అమరావతి బాండ్స్ ను కూడా డి గ్రేడ్ కు దిగజార్చారు. ఈ లెక్కన పెట్టుబడులు కూడా గల్లంతయినట్లే. ఈ మంగళవారానికి మూడు వేల కోట్ల రూపాయల అప్పుకు ఇండెంట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా 3000 కోట్ల రూపాయల అప్పులు ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలిసింది. రాబోయే మూడు నెలల కాల వ్యవధిలో 25 వేల కోట్ల రూపాయల అప్పులను చేసేలా ఉన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
అమ్మ దొంగ అంటున్న ఆంధ్ర ప్రజలు
జగన్మోహన్ రెడ్డి చేసిన నీటి యుద్ధాన్ని తెలంగాణ ప్రజలు పసిగడితే, ఆంధ్ర ప్రజలు అమ్మ దొంగ అంటున్నారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. పరాయి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలని పిచ్చివాళ్లుగా చూస్తున్న ఈ ప్రభుత్వ పెద్దలను పిచ్చివాళ్లను చేసి తరిమికొట్టే రోజులు ఎంతో దూరంలో లేవని నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి చేసిన చిలిపి నీటి యుద్ధం పై సోషల్ మీడియాలో ను, ఎంతోమంది వ్యక్తిగతంగా నాతో మాట్లాడి తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. తీవ్ర కరోనా సమయంలో అంబులెన్స్ వాహనాలను రాష్ట్ర సరిహద్దులలోనే నిలిపివేస్తే, హైదరాబాదు నగరం ఉమ్మడి రాజధాని అని ఆపడానికి నువ్వెవరు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించ లేకపోయారు.
తెలంగాణలో ఉన్న ఒక రావు తో మాట్లాడుకుని నిబంధనలన్నీ తుంగలో తొక్కి నన్ను అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు జెంటిల్మెన్, ఆయనతో కాదు మరొక రావు తో మాట్లాడారు. ప్రజల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుంటే, ఉమ్మడి రాజధానిలోకి వాహనాలను అనుమతించలేని పరిస్థితి నెలకొంటే పోరాటం మానేసి, ఇప్పుడు చిలిపి నీటి యుద్ధాలు చేయడం అవసరమా? ప్రశ్నించారు. వ్యక్తిగత కక్షల కోసం ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు. కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి తన పైనున్న కేసుల మాఫీ గురించి, నా అనర్హత గురించి మాత్రమే అడిగింది నిజం కాదా అంటూ నిలదీశారు.
నా అనర్హత గురించి పార్టీ పార్లమెంట్ నాయకుడు అడిగితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఛీ… పొమ్మని అన్నది నిజం కాదా నిలదీశారు . ఇంకా ఏదో చేయాలని, రాచీ రంపాన పెట్టాలని అనుకున్నావు. నువ్వు ఒక్క స్టెప్ వేస్తుంటే, నేను నాలుగు మెట్లు ఎదుగుతున్నాను. ఇకనైనా వెధవ వేషాలు చాలు. నన్ను ఎంతో చిత్రహింసలు గురిచేశావు. మానసికంగా హింసించావు. నియోజకవర్గానికి రాకుండా చేశావు. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఆయన కార్యాలయానికి లేఖ రాసి తప్పుడు సమాచారాన్ని చేరవేశావు. నేనేదో క్రైస్తవ వ్యతిరేకిని అన్నట్లుగా చిత్రీకరించావు.
నేను వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రధానమంత్రి కార్యాలయానికి అబద్దాలను చెప్పావు. నీ నీటి యుద్ధాల బ్యాగ్రౌండ్ లో అవినీతి యుద్ధం గురించి చెప్పవలసి వస్తుంది. ఈ మూడు నెలల పాటు అయినా ప్రతిపక్షాలను మరింతగా పెంచే ప్రయత్నాన్ని చేయకుండా, కొంచమైనా ప్రజలకు చేరువయ్యే పనులను చేయమని రఘురామ కృష్ణంరాజు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
జనవరిలో నియోజకవర్గానికి వస్తా… ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో
సంక్రాంతి పండగ సందర్భంగా జనవరిలో నియోజకవర్గానికి వస్తానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎటువంటి కేసులు పెడతావో చూస్తా… ఇప్పటికే నన్ను చాలా పెద్దోడిని చేశావు, ఇంకా పెద్దోడిని చేయాలనుకుంటే చెయ్ అని అన్నారు. అమెరికాలో వెంకటేష్ రెడ్డి అనే సైకో ఒకడు ఉన్నాడు. వాడు తన సమీప బంధువు చిత్రహింసలకు గురి చేశాడు. నా నియోజకవర్గ పరిధిలో ఒక ఎమ్మెల్యేకు కోపం వస్తే, వాడ్ని ఎత్తుకొచ్చేయ్ అని చెప్పగానే ఎత్తుకొచ్చి చిత్ర హింసలు పెడుతున్నారు.
దళితుడైన సుబ్రహ్మణ్యం కేసు విచారణను సిబిఐ కి అప్పగించాలని కోరుతుంటే సిఐడి చాలని అంటున్నారు. అదే కోడి కత్తి కేసులో ఎటువంటి కుట్ర లేదని ఎన్ ఐ ఏ తేల్చి చెప్పినప్పటికీ, మరింత లోతుగా విచారణ పేరిట సిబిఐ విచారణ కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం, దళితుడైన సుబ్రహ్మణ్యం కుటుంబానికి మరొక న్యాయమా అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. లోకల్ సైకోలను వారికి సహకరించిన పోలీసులను న్యాయపరంగా కచ్చితంగా శిక్షించి తీరుతాము. భౌతికంగా, మానసికంగా దెబ్బ తిన్న వ్యక్తిగా నేను ఇనిషియేటివ్ తీసుకుంటాను. అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు చూసుకుంటారు. ఆయన అభివృద్ధి కాముకుడని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకున్న మాట నిజమే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న మాట నిజమేనని రఘురామకృష్ణం రాజు అన్నారు. సర్వే అంచనాల ప్రకారం కాంగ్రెస్ బలపడినట్లుగా తెలుస్తోంది. సర్వే అంచనాలే నిజమైతే, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది. కర్ణాటకలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో పుంజుకున్నట్లే, ఆంధ్ర ప్రదేశ్ పై దృష్టి సారించనుంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కాస్తా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా మారింది.
ఆంధ్ర ప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం ఖాయం. ప్రస్తుతం ఒక్క శాతం గా ఉన్న ఓట్లను 8 శాతానికి పెంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఒక్కొక్క శాతం కాంగ్రెస్ పార్టీకి పెరిగే ఓట్ల శాతం మా పార్టీకి సమ్మెట దెబ్బ కానుంది. కాంగ్రెస్ పార్టీకి తన తండ్రి పేరు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కబ్జా చేశారని రఘురామకృష్ణం రాజు అన్నారు.