– తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు
అమరావతి: విశాఖను మింగేసి ఉత్తరాంధ్రను కబళిస్తున్న వైకాపా మూకకు వ్యతిరేకంగా పోరాడాలని తెలుగుదేశం పార్టీ నేతలకు అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.విశాఖను కొల్లగొట్టి.. కంపెనీలను వెళ్లగొట్టిన వాళ్లు అక్కడి ప్రజల గురించి ఇప్పుడు మాట్లాడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు తెలుగుదేశం నిలబడాలన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్యనేతలతో చంద్రబాబు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ముందస్తు ఎన్నికలు ఉన్నాయనే ఆలోచనతో నేతలు సిద్ధం కావాలని.. ఆయా నియోజకవర్గాల్లో గెలుస్తామనే నమ్మకాన్ని స్థానిక నాయకులే కల్పించాలన్నారు. అందుకు అనుగుణంగానే తన నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు తేల్చి చెప్పారు.
”రాష్ట్రంలో వైకాపా పాలనలో నష్టపోని వర్గం అంటూ లేదు. ప్రభుత్వంపై నెలకొన్న ప్రజా వ్యతిరేకతను పార్టీ శ్రేణులు అనుకూలంగా మార్చుకోవాలి. 3 రాజధానులంటూ సీఎం జగన్ మోసపూరిత ప్రకటనలతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. 3 రాజధానులు సాధ్యం కాదని కోర్టులు స్పష్టంగా చెబుతున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజధానులంటూ జగన్ జనాన్ని మోసం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ఇంఛార్జ్‌లు గట్టిగా పనిచేయాలి.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి” అని చంద్రబాబు సూచించారు.
తమ పనితీరు ద్వారా తాము గెలిచే అభ్యర్థులమని వారే నిరూపించుకోకుంటే భిన్నమైన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు. పార్టీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమాలు, ఓటర్ వెరిఫికేషన్ వంటి అంశాలపై నివేదికల ఆధారంగా సమీక్షించారు. ఈ అంశాల్లో వెనుకబడి ఉన్న నేతలు స్పీడు పెంచాలని గట్టిగా చెప్పారు. అలసత్వం ప్రదర్శించే నేతల లెక్కల కూడా నా వద్ద ఉన్నాయని తేల్చి చెప్పారు.