(డాక్టర్ కోనేరు విజయకుమార్)
ఇప్పటి జనరేషన్ వాళ్లకి కొత్తేమో కానీ మా జనరేషన్ వాళ్ళకి .. చంద్రబాబు నాయుడుకు క్లిష్ట పరిస్థితులని ఎదుర్కోవటం కొత్త కాదు . 2004 లో ఓడిపోయినప్పుడు ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఇన్ని అన్ని కాదు . కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడారు . పార్టీ లోని సీనియర్స్ తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు మీ వల్లే పార్టీ ఓడిపోయింది అని మొహమ్మీదే చెప్పారు.
వైఎస్సార్ గ్రూప్ ఐతే చాలా వెకిలిగా హేళన చేస్తుంటే ఫైనల్ గా రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ కలిపించుకుని.. ఇండియాలోనే ఉన్నతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు , అలా మాట్లాడటం భావ్యం కాదు అని చెప్పిన తర్వాతే తగ్గించారు . చంద్రబాబు నాయుడు ని దెబ్బ తియ్యటానికే రామోజీరావు ని దెబ్బతీసి, రోడ్డున పడేయాలని చూశారు . ఇప్పటిలాగానే ఆయన అవినీతిని వెతకటానికి 24 ఎంక్వయిరీ కమిషన్స్ వేశారు .
సోమశేఖర కమిషన్ ముందు విచారణకు వచ్చినప్పుడు సరైన కుర్చీ కూడా లేకుండా , లంచ్ కి కూడా వెళ్లనీయకుండా అవమానించారు . అసెంబ్లీలో సాక్షాత్తు వైస్సార్.. చంద్రబాబు నాయుడు తల్లిని అవమానించారు . ఆ తర్వాత తెరాస , కాంగ్రెస్ వాళ్ళు అవమానించారు .అయినా అదే తెలంగాణ వాళ్ళ బాబ్లీ ప్రాజెక్ట్ కోసం మహారాష్ట్ర వెళ్లి, అరెస్ట్ అయ్యాడు .
సింగపూర్ హోటల్ అన్నారు . బిగ్‌బాస్ అన్నారు , ఎన్నో స్కాములు అన్నారు . ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేక పోయారు. చిత్తూరు వెళ్ళినప్పుడు అభిమానులు ఇంత అభివృద్ధి చేసి మీరు ఓడిపోవటమేమిటి అని కన్నీళ్లు పెట్టుకుంటే , ప్రజలు మన మీద ఇంకా ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారేమో అన్నాడే కానీ, ఎవరినీ తూలనాడలేదు . నేను పోరాటయోధుడిని తాతా అని నవ్వుకున్నాడు. 2014 లో మళ్ళీ అవకాశం వచ్చేదాకా వేచి చూసి మళ్ళా నవ్యంధ్రప్రదేశ్ అభివృద్ధికి కంకణం కట్టి, మొదటి రోజు నుంచి డ్యూటీ లోకి వెళ్ళిపోయాడు.
2019 లో ఓడినప్పుడు నాకు తెలిసిన ఒక పెద్దాయన ఆయనని పలకరిద్దామని వెళ్తే , రాజకీయంలో ఇవి సహజమే . త్వరలోనే అతను తప్పులు చేసి మనకి అవకాశం ఇస్తాడు. కానీ నా బాధ అల్లా రాష్ట్రాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లగలిగిన రెండు ప్రాజెక్ట్స్ అమరావతి , పోలవరం ఆగిపోతాయనే . చాలా కష్టపడ్డాం వాటిగురించి అని చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీరు తిరగడం గమనించానని ఆయన చెప్పినప్పుడు.. ఒక నాయకుడు రాష్ట్రం గురించి ఇంతగా తపన పడతారా? ఇలాంటి నాయకుణ్ణి ఎలా ఓడించుకున్నారు ప్రజలు అని మనసుకు బాధ అనిపించింది .
కరెక్ట్ గ ఆయన చెప్పిన నెలలోనే ప్రజావేదిక ధ్వంసం జరిగింది. తర్వాత ఆయనని ఎంత అవమానించారో చూశాం . కాకపోతే అప్పటికీ ఇప్పటికీ వయస్సు ఒక్కటే తేడా .చూద్దాం , న్యాయం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ తప్పకుండా ఆయనకు, రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఇది పూర్తిగా అక్రమ అరెస్ట్ అని ప్రజలందరికి అవగాహన వచ్చింది. సుప్రీమ్ లో తప్పకుండా రిలీఫ్ వస్తుంది .
ఒక నాయకుడు అక్రమ అరెస్ట్ ఐతే ఇన్ని రాష్ట్రాల్లో , దేశాల్లో ప్రజలు స్వచ్చందంగా బయటకి వచ్చి ఆయనకి సంఘీభావం తెలపటమనేది నభూతో నభవిష్యత్ . 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేస్తేనే.. 3 తరాల భవిష్యత్తు ని ఉజ్వలం చేసాడే.. మరలా 5 సం” విభజిత ఆంధ్ర ని పాలించి దేశంలోనే no1 గా చేసిన ఆయనని ఓడించుకుని, మనమే వెనకబడ్డాం . ఇప్పటికీ అదే స్థితప్రజ్ఞత ప్రదర్శిస్తూ జైల్లో నుంచే జడ్జి గారితో మాట్లాడుతూ న్యాయమే గెలవాలి , అందరికీ సమన్యాయం జరగాలి అన్నాడంటే.. ఆయనకంటే “మహానాయకుడు” ఎవరైనా ఉంటారా ? జై అమరావతి!