Suryaa.co.in

Devotional

కర్మ.. కర్మ తోనే నశిస్తుంది

గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది… వెంటనే గంగానదినే అడిగాడట. “అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు తల్లీ… అని.

అందుకా తల్లి “నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను” అని బదులిచ్చిందట.

వెంటనే, అయ్యో అన్ని పుణ్యనదులు ఇంతేకదా… పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని… సముద్రాన్నే అడిగాడు…ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని… దానికా సముద్రుడు
నేనెక్కడ భరిస్తున్నాను? ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను’ అని బదులిచ్చాడట.

అరే … ఎంతో తేలికగా కదిలాడే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది… అని అనుకుంటూ, ఓ మేఘమాలికల్లారా ఎలా భరిస్తున్నారు… ఈ పాప భారాన్ని అని అడగగా… అవి పకపకా నవ్వి ‘మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటికప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా’…అని బదులివ్వగా… ఓహో… ఆ పాపాలన్నీ మన మీద పడి లేదా తాగుతూ, మనమే అనుభవిస్తున్నామన్నమాట.

కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడట.
ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః
ఆత్మతీర్ధం న జానన్తి కధం మోక్షః శృణు ప్రియే.
పరమశివుడు, పార్వతీదేవి కి ఉపదేశించిన శ్లోకమిది.
ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగునని తీర్ధ స్నానమునకై పరుగులెత్తెడు మానవులు భ్రమకు లోబడినవారు.
ఆత్మజ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షమెటుల కలుగును?…అని ఈ శ్లోకం అర్థం.
కర్మ కర్మణా నశ్యతి…. అనగా, కర్మ కర్మతోనే నశిస్తుంది.

– వెలగపూడి గోపాలకృష్ణ

LEAVE A RESPONSE