Suryaa.co.in

Devotional

సంధ్యాదీపానికీ లక్ష్మీదేవికీ సంబంధమేమిటి?

‘సంధౌ భవా సంధ్యా, సంధ్యాయాం దీపః సంధ్యాదీపః’ అని వుత్యత్పత్తి. ప్రతిరోజుకీ రెండు సంధ్యలు వస్తాయి. రాత్రి చంద్రుడు అస్తమించడానికీ, పగటి సూర్యుడు ఉదయించ డానికీ నడుమ ఉండే సంధ్యని ప్రాతస్సంధ్య లేదా ఉదయ సంధ్య అంటారు.

అదేవిధంగా పగటి సూర్యుడు అస్తమించడానికీ రాత్రి చంద్రుడు ఉదయించడానికీ నడుమన ఉండే సంధ్యని సాయం సంధ్య అని అంటారు.

‘సంధ్యాదీప’మనే మాట ఈ రెండు సంధ్యలలో సాయంసంధ్యకి సంబంధిం చిందే తప్ప ఉదయ సంధ్యకి సంబంధించింది కాదు. ఉదయ సంధ్యా దీపాన్ని దైవం దగ్గర వెలిగించవలసి వస్తే సాయం సంధ్యాదీపాన్ని ఇంటి ప్రధాన ద్వారపు గుమ్మం (మండిగం) మీద వెలిగించి భక్తితో నమస్కరించి అలా ఉంచాలి.

ఒక పదేళ్ళ క్రితం వరకూ కూడా ద్వారబంధానికి ఒక వైపున ఎత్తు మీద దీపం పెడుతూ వుండేవారు. గుమ్మం మీద ప్రమిదతో దీపాన్ని కూడా పెడు తూండేవారు. దీపం అనేది గుమ్మం మీద ఉండి అటు గదికీ ఇటుగదికీ కూడా ప్రకాశాన్ని ఇవ్వడమనేది లౌకిక ప్రయోజన మైతే, ఆధ్యాత్మిక ప్రయోజనం మాత్రం వేరుగా ఉంది.

‘దినాంతే నిహితం తేజ స్సవిత్రేవ హుతాశనః” పగలు సూర్యుడు అస్తమిస్తూ తన సర్వశక్తినీ అగ్నిలోగాని, దీపంలోగాని నిక్షేపించి వెళ్తాడని శాస్త్రం చెప్తాంది._

అందువల్ల ఉదయకాలంలో సూర్యుడికి నమస్కరిస్తే వచ్చే ఫలితం సాయం సంధ్యాదీపానికి నమస్కరిస్తే కలుగుతుంది.

లక్ష్మీదేవికి ‘ఆదిత్యవర్ల’ అనే పేరుంది. (శ్రీసూక్తంలో ‘ఆదిత్యవర్లే!తపసోధిజాతః…) సూర్యునితో సమానమయిన ప్రకాశం కలదానా! అని అర్థం. సంధ్యాదీపంలో సూర్యప్రకాశం ఉంటుంది కాబట్టి, ‘సంధ్యాదీపం వెలిగిం చడమంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడమే. విద్యుద్దీపాలెన్ని ఉన్నా, వాటిలో సూర్యుని అంశ లక్ష్మీప్రకాశం ఉండదు. సంధ్యా దీపమంటే ‘నూనెతో వెలిగించిన ప్రమిద మాత్రమే’. ఆ దీపంలోనే ‘లక్ష్మి’ ఉంటుంది.

“దీపావళి సిరియిచ్చున్

దైవత్వానికీ, మానవత్వానికి, దానవత్వానికి గుణాలే కారణాలవుతాయి.

ఉదాహరణికి దేవకీ వసుదేవుల్ని మానవులుగాను, దేవకీదేవి సోదరుడైన కంసుడిని దానవుడిగాను, దేవకీ వసుదేవుల కుమారుడయిన శ్రీకృష్ణుడిని దైవం గాను భావిస్తున్నాం. వీటన్నిటికీ కారణం వారి వారి గుణగణాలే…

జాతిరీత్యా గుణాలరీత్యా రాక్షసులల్లో రెండురకాల వారు న్నారు. రాక్షసులు సైతం తీవ్రంగా తపస్సు చేసి వరాలు పొందడం తప్పశ్చర్యచే సాధించిన శక్తులతో వారు లోకాన్ని బాధించటం, ఆ లోకకంటకులైన రాక్షసులవల్ల బాధలు తప్పించేందుకే భగవంతుడు అవతరిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. ద్వాపరయుగంలో నరకుడు అసుర గుణాలతో జన్మించాడు.

నరకుడు భూదేవి కుమారుడు. జననకాల దోషం రీత్యా ఇతడు అసురుడైనాడు. ఈ నరకుడు ప్రాగ్జోతిష పురానికి ప్రభువు, పరమదుష్టుడు. అహంకారి, మాయావి, పరమాత్మను మరచినవాడు. దేవతల్ని పరాభవించిన వాడు. ఋషుల్ని మునీంద్రుల్ని బాధించాడు. రాజుల్ని దోచుకున్నాడు. స్త్రీలను ఎన్నో యాతనలు పెట్టాడు అతని ఆగడాలకి అంతులేకుండా పోయింది. అంతటితో ఆగక ఇంకా అలౌకికమైన శక్తుల్ని సంపాదించాలని, సాధించాలని నరకుడు దురాలోచన చేస్తాడు.

ఆ నరకుడి రాజ్యంలోనూ, చుట్టుపట్లా ఎటుచూసినా శాంతి భద్రతలుండవు. ప్రతి ఒక్కరికీ దుఃఖం తప్ప సంతోషం వుండదు. అందరి మనసులు భయంతో వణికి పోయాయి. స్త్రీలోకం బెదిరి పోయింది. కన్నీటిపాలైంది. ‘ఈ దుర్మార్గుడికి రాత్రిళ్లు కనపడ కూడదు’ అని తమ ఇళ్లలో రాత్రివేళల్లో దీపాలు కూడా పెట్టుకునేవారు కారు. దాంతో రాజ్యమంతా చీకటిమయం. ఎటుచూసినా అంధకారమే. జన సంచారలేని వీధులు. కలవరపరచే నిశ్శబద్ధ వాతావరణం. మానవులే కాదు, దేవతలు, ఋషులు, మునులు అంతా అనుక్షణం కలత పడుతూ దుర్భర జీవితాన్ని గడపవలసిన పరిస్థితి వచ్చింది.

సమస్త రాజ్యాన్నీ ఇంతటి దుర్భరపరిస్థితులకు గురిచేసినా తృప్తి చెందక వరకాసురుడు దేవేంద్రుడి మీదా దాడిచేశాడు. అక్కడి ఆస్తులను కొల్లగొట్టాడు. ఐరావతాన్ని, కల్పవృక్షాన్ని తెచ్చి తన ఇంటి పెరట్లో పెట్టుకున్నాడు. ఇలాంటి భయంకర దుష్కృత్యాలకు బెదిరిన ఇంద్రుడు శ్రీకృష్ణునితో మొరపెట్టుకున్నాడు.

అధర్మం మితిమీరినప్పుడల్లా నేను వచ్చి దానిని అడ్డుకుని శిష్టులను రక్షిస్తానని హామీ ఇచ్చిన ఆ జగద్గురువు. జగదేకవీరుడు, జగన్నాథుడు అయిన శ్రీకృష్ణుడు వెంటనే నరకునిపై యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెంట స్వాతి నక్షత్రాన జన్మించి సర్వశక్తిమంతురాలు అయిన సత్యభామ కూడా బయలుదేరింది.

వాసుదేవుడు ‘అది వనవిహారం కాదని భయంకరమైన రణరంగం’ అని ఆమెను వారిస్తాడు. అయినా ఆమె వినకుండా కృష్ణుని వెంట యుద్ధభూమికి ఉత్సాహంగా బయలుదేరుతుంది. ఆమె ముచ్చటను కాదనలేక శ్రీకృష్ణుడు ఆమెకు అస్త్రశస్త్రాలు అందజేస్తాడు. అప్పుడు ఆ వీరనారి అతనితో పోరాడి తన దగ్గరున్న అస్త్రాలతో ఆ దుష్టుడయిన నరకాసురుణ్ణి వధించింది.

స్త్రీలను చెరబట్టిన దుష్టుడుగా లోకకీర్తిని గడించిన నరకుడు చివరికి స్త్రీ శక్తి చేతనే అంతమయ్యాడు. నరకాసురుని అంతమొందించిన విజయంతో సత్యభామా సమేతుడై శ్రీకృష్ణుడు తిరిగి వచ్చాడు.

ఆనాటితో తమకు నరకుని పీడ వదలిందని లోకమంతటా దీపాల తోరణాలు కట్టి ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ‘దీపావళి’ పండుగ చేసుకు న్నారు.

సత్యభామ ఘనతను కీర్తిస్తూ స్వాతి నక్షత్రం రాగానే ప్రజలంతా తలంటుకుని మంగళస్నానం చెయ్యటం ఆనాటి నుంచి నేటికీ ఆచారంగా వస్తోంది.

ఆనాడు ఆచరించేటువంటి స్నానం గంగాస్నానంతో సమానమన్నారు. ఎందుకంటే తైలం లక్ష్మీకరం, జలం గంగాతుల్యం. ఆనాటి నరకాసుర సంహారంతో లోకంలో అలుముకొని వున్న చీకట్లు తొలగిపోయి జగత్కల్యాణకరమయిన సూర్యోదయం వచ్చింది. చీకటి అజ్ఞానానికి, వెలుగు విజ్ఞానానికి సంకేతాలు. దీపావళి పండుగనాడు పెట్టే దీపాల్ని వెలిగించే జ్యోతి పరంజ్యోతి. వెలిగింపబడేవి జీవనజ్యోతులనే పరమార్థం ఇందులో ఇమిడి వుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే గుణాలు వుండటం వల్ల నరకుడు అపకీర్తి పాలయ్యాడు.

అందుకని శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందాలంటే ప్రతివ్యక్తీ సదాచారం కలిగి, తన శక్తినీ, జ్ఞానాన్నీ, సమయాన్ని సంపదను సద్వినియోగం చెయ్యాలని స్వార్థం లేని జన్మే సార్థకమని, చీకట్లను తొలగించే దీపశిఖలాగా ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఉపకారగుణం కలిగి జీవించాలని, ఈ దీపావళి తెలియజేస్తుంది.

ఈ పండుగ రోజున దీపం తోరణాల వెలుగుల మధ్య అందరూ సంపద లక్ష్మి ప్రణమిల్లి ప్రతి ఇంటా సిరి సంపదలతో ఆ మహాలక్ష్మి కొలువై ఉంటుంది.

శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
సర్వేజనా సుఖినోభవంతు-శుభమస్తు.

సేకరణ

LEAVE A RESPONSE