ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ నియోజక వర్గాలలో, అధికార వైసీపీ పార్టీ కి ఈ సారి కేవలం ఏడు స్థానాలే లభిస్తాయని ఒక జాతీయ న్యూస్ ఛానెల్ న్యూసెక్స్ చెప్పింది. టీడీపీ కూటమి కి మిగిలిన 18 స్థానాలు దక్కుతాయి అనేది ఆ ఛానెల్ సర్వే అంచనా. ఇందులో నుంచి రెండు మూడు అర్ధాలను మనం ఇంటర్ప్రెట్ చేయవచ్చు.
మొదటిది – కడప లో వై ఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ గా విజయం సాధిస్తారు అనేది. ఎందుకంటే 25 స్థానాలలో వైసీపీ కి ఏడు స్థానాలు వస్తే, మిగిలిన 18 స్థానాలను కూటమి ఖాతాలో ఈ ఛానెల్ వేసింది. ఇందులో కాంగ్రెస్ కు ఒక్కటీ ఇవ్వలేదు.
మరి, జగన్ సోదరి వైఎస్ షర్మిలేమో కాంగ్రెస్ టికెట్ పై, అవినాష్ రెడ్డిపై పోటీ చేస్తున్నారు. అందువల్ల, అవినాష్ గెలుస్తారు అని ఈ న్యూసెక్స్ ఛానెల్ పరోక్షంగా చెప్పినట్టయింది.
మరో ఇంటర్ప్రెటేషన్ ఏంటంటే, శాసన సభ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించలేదు అనే విషయాన్ని పరోక్షంగా ఈ ఛానెల్ చెప్పినట్టయింది. ఒక్కొక్క లోక సభ నియోజక వర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అంటే, 49 నియోజక వర్గాలకే వైసీపీని ఈ ఇంగ్లీష్ ఛానెల్ పరిమితం చేసింది అనుకోవాలి. ఎన్నికల ఫలితాల గురించి ముందుగా ఏమీ చెప్పలేం. ఈ ఏడు లోకసభ నియోజకవర్గాలలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఓడిపోవచ్చు. అలాగే, ఓడిపోవడానికి అవకాశం ఉన్న ఎంపీ స్థానాల పరిధిలో కొన్ని అసెంబ్లీ స్థానాలు వైసీపీ గెలవ వచ్చు. అయితే, అసెంబ్లీ లో మెజారిటీ కి 89/99 స్థానాలు అవసరం. అందులో సగమే వస్తానికి వైసీపీ కి అవకాశం ఉన్నట్టు ఈ ఛానెల్ పరోక్షంగా చెబుతున్నది.
అదే, టీడీపీ కూటమికి 18 లోకసభ స్థానాలు ఇచ్చారు. జనసేనకు రెండు, బీజేపీ కి రెండు ఇచ్చారు. మిగిలిన 14 స్థానాలు టీడీపీ ఖాతాలో వేశారు. వీటినే శాసన సభ స్థానాల్లోకి మార్చుకుంటే – టీడీపీ కి దాదాపు 108 స్థానాలు ఇచ్చినట్టయింది. జనసేన కు 14 ఇచ్చారు. బీజేపీ అయితే అసలు అన్ని సీట్లలోనే పోటీ చేయడం లేదు. న్యూసెక్స్ అనేది జాతీయ స్థాయిలో బీజేపీ అనుకూలంగా ఇంగ్లీష్ ఛానెల్.మోడీ కి 370 కి పైగా స్థానాలు వస్తాయని ప్రొజెక్ట్ చేయడమే దీని లక్ష్యం. అందువల్ల, దీని సర్వే అంచనాలను ప్రామాణిక పద్ధతుల్లో రూపొందించినట్టుగా భావించలేం.
అయితే, ఆ మధ్య వెల్లడైన ఇండియా టుడే ఛానెల్ సర్వే లో కూడా వైసీపీ కి 7, కూటమికి 18 సీట్లు ఇచ్చారు. ఇండియా టుడే ఛానెల్ కొంతలో కొంత విశ్వసనీయత ఉన్న ఛానెల్. మొత్తం మీద చూస్తుంటే, విశ్వసనీయమైన సర్వేలలో వైసీపీకి ఆధిక్యత అంతగా కనపడడం లేదు. అదే నిజమైతే, వైసీపీ ఎదురీతపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది
దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలను రకరకాల కేటగిరీలకు చెందిన ఓటర్లకు నగదు రూపం లో పంపిణీ చేయడంతో పాటు ; ప్రతి 50 గృహాలకూ ఒక వాలంటీర్ ను పెట్టి, లబ్ది దారులపై పూర్తి గ్రిప్ సాధించినప్పటికీ ; వైసీపీ – ఈ సర్వేలలో టీడీపీ కంటే వెనుకబడి ఎందుకు ఉంది అనే విస్మయకర అంశం పై చర్చ జరగాల్సి ఉంది.